'మచాడో నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు ఇవ్వలేరు'- కమిటీ క్లారిటీ
ఒకసారి నోబెల్ బహుమతిని ప్రకటిస్తే తిరిగి దానిని రద్దు, బదిలీ, ఇతరులతో పంచుకునే అవకాశం ఉండదని నోబెల్ కమిటీ స్పష్టం


Published : January 11, 2026 at 10:22 AM IST
Machado Trump Nobel Peace Prize : ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇవ్వనున్నారనే వార్తలపై నోబెల్ కమిటీ స్పందించింది. ఒకసారి నోబెల్ బహుమతిని ప్రకటిస్తే తిరిగి దానిని రద్దు, బదిలీ, ఇతరులతో పంచుకునే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం అంతిమమైనదని, ఎప్పటికీ చెల్లుతుందని పేర్కొంది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో దక్కిన బహుమతిని ట్రంప్‌నకు అందించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు అమెరికా విజయవంతమైన ఆపరేషన్‌ను చేపట్టిన క్రమంలో నోబెల్ బహుమతిని ట్రంప్‌నకు ఇవ్వడానికి లేదా పంచుకోవడానికి సిద్ధమేనని మచాడో ప్రకటించారు. "ఇది వెనెజువెలా ప్రజల బహుమతి కాబట్టి మేము దానిని ఆయనతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇది ప్రజాస్వామ్య పరివర్తన వైపు ఒక పెద్ద అడుగు" అని అన్నారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను వరించింది. అయితే, నోబెల్ శాంతి పురస్కారాన్ని దక్కించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేశారు. అనేక యుద్ధాలను ఆపానని తాను నోబెల్‌కు అర్హుడినని అన్నారు. ఇటీవలె నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరని అభిప్రాయపడ్డారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏమీ చేయకపోయినా ఆ గౌరవం దక్కిందని అసహనం వ్యక్తంచేశారు ట్రంప్. దీంతో దానిని ట్రంప్‌నకు అంకితం చేస్తున్నట్లు ఇటీవల మచాడో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలో అమెరికా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ పురస్కారాన్ని ట్రంప్‌నకు ఇచ్చేస్తారా? అనే చర్చ మొదలు కాగా, నోబెల్ కమిటీ క్లారిటీ ఇచ్చింది.
వెనెజువెలా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించినట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నార్వే రాజధాని ఓస్లోలోని నోబెల్ కమిటీ ఆమెకు నోబెల్ ఇచ్చి సత్కరించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని చెప్పింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ఆమె వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా ఉన్నారు. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన మచాడో, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది.
నోబెల్ బహుమతే కారణమట
మరోవైపు వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను మచాడోకు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెనెజువెలా బాధ్యతలను వేరేవారికి అప్పగించే ఛాన్స్ తీసుకోబోమని, అది ఆ దేశ ప్రజలకు మంచిది కాదన్నారు. దేశంలో ఆమెకు సరైన మద్దతు లేదని ట్రంప్ చెప్పినప్పటికీ, అసలు కారణం మచాడో అందుకున్న నోబెల్ బహుమతే అనే ప్రచారం నడుస్తోంది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతేడాది నోబెల్ కమిటీ మచాడోకు శాంతి బహుమతి ప్రకటించగా, దాన్ని ఆమె అంగీకరించడం ట్రంప్‌నకు కోపం తెప్పించిందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. "ఆ బహుమతిని స్వీకరించడమే ఆమె చేసిన పాపం. నోబెల్ కమిటీ ప్రకటించగానే ఆమె దాన్ని తిరస్కరించాల్సింది. ఆ పురస్కారానికి ట్రంప్ మాత్రమే అర్హుడని చెప్పాల్సింది. అలా చేసుంటే ఈ రోజు కచ్చితంగా వెనెజువెలా అధ్యక్షురాలు అయ్యేవారు" అని వాషింగ్టన్ పోస్ట్ చెప్పినట్లు తెలుస్తోంది.

