నెతన్యాహూ, సారా లవ్ స్టోరీ: ఇండియన్ రెస్టారెంట్‌తో కనెక్షన్- స్వయంగా చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని
నెతన్యాహు, సారా తొలిసారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్‌లోనే- వంటకాలలాగే ఫస్ట్ డేట్ కూడా అద్భుతంగా జరిగింది- మీడియా సమావేశంలో వెల్లడించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

Published : February 26, 2026 at 8:04 PM IST
Netanyahu Sara Love Story : భారతీయ రెస్టారెంట్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి ఆసక్తికర విశేషాలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా భారత్‌కు రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి ముందు తన భార్య సారా, తాను కలిసి టెల్ అవివ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లామని తెలిపారు. అక్కడ రుచికరమైన భారతీయ భోజనాన్ని ఆరగించి ఆనందించామన్నారు. ఆ వంటకాల రుచి గురించి మాటల్లో చెప్పలేమని నెతన్యాహూ కొనియాడారు. గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం వేదికగా ఈవివరాలను నెతన్యాహూ తెలియజేశారు.
మా ఇద్దరి తొలి డేట్ అక్కడే మొదలైంది
"మొదటి విషయం ఏమిటంటే, భారతీయ వంటకాలు మాకు అమోఘంగా అనిపించాయి. అలాంటి వంటకాలను నా భార్య సారా తినడం అదే తొలిసారి. ఆ విధంగా మా ఇద్దరి తొలి డేట్ ఆరంభానికి వేదికగా ఒక భారతీయ రెస్టారెంట్ నిలిచింది. రీనా పుష్కర్ణ నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌కు మేం వెళ్లాం. అక్కడ వడ్డించిన అద్భుతమైన భారతీయ వంటకాల్లాగే, మా తొలి డేట్ కూడా అద్భుతంగా జరిగింది. అందుకే నేను, నా పిల్లలలాగే భారత్‌కు రుణపడి ఉంటాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మా తొలి డేట్ కోసం టెల్ అవివ్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది సారానే. ఆమె ఎంపిక అద్భుతం. దాని వల్లే మా డేట్ సక్సెస్ అయింది" అని నెతన్యాహూ గుర్తు చేసుకున్నారు.
బటర్ చికెన్, కరాహీ చికెన్ : నెతన్యాహూ ఫేవరేట్స్
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టం. ప్రత్యేకించి బటర్ చికెన్, కరాహీ చికెన్‌ను ఆయన ఇష్టంగా తింటారు. కనీసం వారానికి రెండుసార్లు ఈ వంటకాల కోసం టెల్ అవివ్ నగరంలోని రెస్టారెంట్లకు నెతన్యాహూ ఆర్డర్లు ఇస్తుంటారట. ఇక నెతన్యాహూ, సారాలకు 1991లో పెళ్లి జరిగింది. వారికి యాయిర్, అవ్నెర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
రీనా పుష్కర్ణ ఎవరు ?
ఇక నెతన్యాహూ చెప్పిన రీనా పుష్కర్ణ ఎవరు అంటే, ఆమె టెల్ అవివ్ నగరంలో తందూరి ల్యాండ్స్ ఎండ్ టెల్ అవివ్ పేరుతో భారతీయ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈమె రెస్టారెంట్‌లోనే నెతన్యాహూ, సారా కలిసి తొలిసారి భోజనం చేశారు. ఇజ్రాయెల్‌లో అందరూ రీనా పుష్కర్ణను కర్రీ క్వీన్ అని పిలుస్తుంటారు. తాజాగా భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా రీనా పుష్కర్ణను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆమె పలు కీలక వివరాలను చెప్పారు.
టేబుల్ నంబర్ 8లో నెతన్యాహూ, సారా కూర్చున్నారు
"గతసారి భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వచ్చినప్పుడు మేం ఎక్కువ సంఖ్యలో గుజరాతీ వంటకాలను చేయలేకపోయాం. ఈసారి వీలైనన్ని ఎక్కువ గుజరాతీ వంటకాలను తయారుచేసి మోదీకి అందిస్తాం. నెతన్యాహూ, సారా తొలిసారి కలిసి మా రెస్టారెంట్‌లోనే భోజనం చేశారు. వాళ్లు టేబుల్ నంబర్ 8లో కలిసి కూర్చున్నారు. నెతన్యాహూకు భారతీయ వంటకాలంటే బాగా ఇష్టం. బటర్ చికెన్, కరాహీ చికెన్ కోసం ఆయన వారానికి రెండుసార్లు ఆర్డర్లు ఇస్తుంటారు" అని రీనా పుష్కర్ణ తెలిపారు.
ప్రధాని మోదీకి వడ్డించిన భారతీయ వంటకాలివీ
ఫిబ్రవరి 25న మొదలైన భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురువారంతో ముగిసింది. ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2017లో ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటించారు. బుధవారం రోజు టెల్ అవివ్ ఎయిర్ పోర్టులో మోదీకి స్వయంగా నెతన్యాహూ, సారా దంపతులు స్వాగతం పలికారు. ఈసందర్భంగా అధికారిక లాంఛనాలతో మోదీకి ఆహ్వానం పలికారు. ఫిబ్రవరి 25న కింగ్ డేవిడ్ హోటల్‌లో ప్రధాని మోదీకి విందును ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు గ్రే జాకెట్, వైట్ కుర్తా ధరించి నెతన్యాహూ రావడాన్ని చూసి మోదీ ఆశ్చర్యపోయారు. ఈ డిన్నర్ కోసం భారతీయ వంటకాలను రీనా పుష్కర్ణ అందించారు. భారత ప్రధాని మోదీ, నెతన్యాహూ దంపతులకు ఈసందర్భంగా వడ్డించిన భారతీయ వంటకాల జాబితాలో నర్గిసి కోఫ్తా, ఇడ్లీ సాంబార్, తడ్కా దాల్, దాల్ ఖిచ్డీ, కుర్కురీ భీండీ, ఖాండ్వి, ఢోక్లా, థేప్లా ఉన్నాయి.

