మరింత అంతర్జాతీయ సాయం కోరిన నేపాల్- సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ పరికరాల కోసం అభ్యర్థన!
టన్నెల్ రెస్క్యూ, ఫోరెన్సిక్ చర్యల కోసం ఫ్రీజర్స్, డీఎన్ఏ కిట్లు, హై కెపాసిటీ డ్రోన్లు కావాలని విజ్ఞప్తి- ఆగస్ట్ 29 నుంచి నేపాల్‌లోనే పనిచేస్తున్న భారత్‌కు చెందిన 18 మంది డీఎన్ఏ నిపుణుల బృందం

Published : September 1, 2026 at 6:52 AM IST
Nepal Flood Rescue Support : నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని మిగిల్చాయి. భోటె కోషి నదిలో ఉద్ధృతి పెరగడంతో నేపాల్ అతలాకుతలమైంది. వరదల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వందలాది మంది మృతి చెందగా, వేలాది మంది గల్లంతయ్యారు. భారీ వరదల తర్వాత సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ నేపాల్ మరింత అంతర్జాతీయ సహకారం కోరింది. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లతో పాటు మృతదేహాల గుర్తింపు, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నిపుణుల సహాయం అవసరమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాఠ్‌మాండూలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి మాట్లాడుతూ, అమెరికా, సింగపూర్, చైనా తదితర దేశాల నుంచి వివిధ రకాల అత్యవసర సామగ్రి, సాంకేతిక సహాయాన్ని కోరినట్లు తెలిపారు.
ఫ్రీజర్లు, DNA కిట్లు, LiDAR కోసం రిక్వెస్ట్
మృతదేహాల నిర్వహణ, గుర్తింపు ప్రక్రియ కోసం అమెరికా నుంచి ఫ్రీజర్లు, డీఎన్ఏ టెస్టింగ్ కిట్లు, LiDAR వంటి అవసరమైన వస్తువులను నేపాల్ కోరింది. సింగపూర్ నుంచి డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్‌కు (DVI) సంబంధించిన సహాయం కోరినట్లు ఛెత్రి తెలిపారు. చైనా, సింగపూర్ నుంచి బ్రిడ్జ్ యూనిట్లు, అధిక సామర్థ్యం కలిగిన డ్రోన్లు వంటి పరికరాలను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే మృతదేహాల నిర్వహణ కోసం గాలి చొరబడని బ్యాగులు అందాయని, ఇవి మరిన్ని కూడా వస్తున్నాయని అధికారులు తెలిపారు.
భారత్ నుంచి 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు
విపత్తు అనంతరం నేపాల్‌కు భారత్ కూడా సాయం చేస్తోంది. ఇందులో ఫోరెన్సిక్ బృందం కూడా ఉంది. డీఎన్ఏ విశ్లేషణలో నైపుణ్యం కలిగిన దాదాపు 18 మంది భారత ఫోరెన్సిక్ నిపుణులు ఆగస్ట్ 29 నుంచి నేపాల్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాల్ని గుర్తించడం, బాధితుల వివరాలను నిర్ధరించడం వంటి ప్రక్రియల్లో డీఎన్ఏ పరీక్షలు కీలకంగా మారాయి. అదే విధంగా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లలో నేపాల్ సంస్థలు, చైనాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలతో కలిసి పనిచేస్తున్నాయి. సౌత్ కొరియా నుంచి కూడా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
భారత్, చైనా, జపాన్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), దక్షిణ కొరియా వంటి పలు దేశాలు నేపాల్‌కు రెస్క్యూ, సహాయక చర్యల్లో మద్దతు అందిస్తున్నాయి. బ్రిడ్జ్ యూనిట్లు, ఫ్రీజర్లు, జనరేటర్ సెట్లు, సోలార్ ల్యాంపులు, డీఎన్ఏ టెస్టింగ్ కిట్లు, అత్యవసర సహాయక సామగ్రితో పాటు టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఫుడ్ ప్యాకెట్లు, మందులు వంటి సామగ్రి అందుతున్నట్లు ఛెత్రి తెలిపారు. యూఏఈ, మయన్మార్, ఖతార్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, జపాన్, మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి మరిన్ని వస్తువులు రానున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలు, భాగస్వాముల నుంచి కూడా సహకారం అందుతోందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వంటి సంస్థలు సహకరిస్తున్నాయని వివరించారు.
939 కి చేరిన మృతులు
నేపాల్- టిబెట్ సరిహద్దుకు సమీపంలో కొండచరియలు విరిగిపడటం, గ్లేసియర్స్ కారణంగా ఆగస్ట్ 26న భారీ వరదలు సంభవించాయి. హిమాలయ ప్రాంతం నుంచి కిందికి ప్రవహించే బోటె కోషి నది వరద నీటిని మరింత దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లింది. దీంతో పెను విపత్తు సంభవించింది. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 939 మంది మృతిచెందారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (NDRRMA) ధ్రువీకరించింది. ఇదే సమయంలో దాదాపు 4 వేల మందికిపైగా ఆచూకీ గల్లంతైందని తెలిసింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మాకు సంబంధం లేదు- ఖండించిన చైనా
ఇక నేపాల్ వరదలకు టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధం ఉందన్న విమర్శలను చైనా ఖండించింది. ఇవి నిరాధార ఆరోపణలు అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు. చైనా, నేపాల్ నిపుణులు, అధికార సంస్థల అంచనాల ప్రకారం ఈ విపత్తుకు నేపాల్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమనీనదాలు కూలిపోవడం వల్ల ఏర్పడిన మట్టి ప్రవాహమే కారణమని తెలిపారు. విపత్తు సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.
మానవ తప్పిదాల వల్లే వాతావరణ మార్పులు- గత 40 ఏళ్లలో లేనంత తీవ్రంగా ఎల్‌నినో!

