'ఇది సహాయం కాదు- నైతిక బాధ్యత వహించాల్సిందే'- భారత్, చైనా, అమెరికా నుంచి పరిహారం డిమాండ్ చేస్తున్న నేపాల్
భారత్, అమెరికా, చైనా నుంచి వాతావరణ నష్టాలకు పరిహారం కోరుతున్న నేపాల్- సహాయం కాదు నైతిక, చట్టపరమైన బాధ్యత అని విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు- వరదల్లో 1000 దాటిన మృతుల సంఖ్య

Published : September 2, 2026 at 8:24 PM IST
Nepal Climate Compensation Claim : నేపాల్‌లో ఆగస్ట్ 26న సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిన నేపథ్యంలో ఆ దేశం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తన గళం విప్పుతోంది. ఈ విపత్తు మానవ నిర్మిత భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఏర్పడిన ఉష్ణోగ్రతల మార్పుల ఫలితమేనని, కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి భారత్, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి పరిహారం కోరుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను (గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు) ఈ దేశాలే విడుదల చేస్తున్నాయని, అందుకే తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇకపై తాము విదేశాల నుంచి సహాయం కోరడం లేదని, కేవలం న్యాయం, పరిహారం మాత్రమే కోరుతున్నామని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటించారు. విపత్తు ద్వారా అందించే సహాయాన్ని కేవలం విరాళంగా కాకుండా- నైతిక, చట్టపరమైన బాధ్యతగా చూడాలని, అందుకే ఈ సహాయం న్యాయం, పరిహారం కేటగిరీలోకి వస్తుందని చెప్పారు.
వాతావరణ మార్పులకు కారణమయ్యే ఉద్గారాల ప్రభావం నేపాల్‌లో చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటోందని ఖనాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా హిమనీనదాలు (గ్లేసియర్లు) వేగంగా కరుగుతుండటం, పర్వత ప్రాంతాల్లో తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించడం ఆందోళనకరమన్నారు. కాంటిపూర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శిశిర్ ఖనాల్- 'ప్రపంచం సృష్టించిన సంక్షోభానికి నేపాల్ భారీ మూల్యం చెల్లిస్తోంది. హిమనీనదాలు కరిగిపోతుండటం, పర్వత ప్రాంతాల్లో సంభవిస్తున్న భారీ వరదలు గ్లోబల్ క్లైమేట్ చేంజ్‌కు సంబంధించిన పరిణామాలు. అందుకే ఇది దాతృత్వం లేదా సహాయానికి సంబంధించిన విషయం కాదు. ఇది చట్టపరమైన, నైతిక బాధ్యతకు సంబంధించిన విషయం' అని స్పష్టం చేశారు.
ప్రధాన ఉద్గార దేశాలపై ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల్లో గట్టిగా లేవనెత్తుతామని శిశిర్ తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా చిన్న దేశాలు ఎదుర్కొంటున్న నష్టాలకు పరిహారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భారత్ మాత్రం పారిశ్రామికంగా ముందుగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు ఎక్కువ కార్బన్ ఉద్గారాలు చేస్తున్నాయని ఎప్పటినుంచో వాదిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాలతో నష్టపోయే అభివృద్ధి చెందుతున్న దేశాలకు 'లాస్ అండ్ డ్యామేజీ' పరిహారంపై భారత్ గతంలోనే మద్దతు తెలిపింది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు అవసరమైన ఆర్థిక వనరులను అందించాలని భారత్ చెబుతోంది.
ఇదిలా ఉండగా, ఆగస్ట్ 26న భోటెకోషి నదీ పరివాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలతో 'నేపాల్ ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్' నుంచి అత్యవసర ఆర్థిక సహాయం కోరింది. వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేసేందుకు 2022లో ఈజిప్టులో జరిగిన COP27 లో ఈ నిధిని ఏర్పాటు చేశారు. 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 లో దాని నిర్వహణకు సంబంధించిన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, అటవీ, వ్యవసాయ శాఖ మంత్రి గీతా చౌదరి సంయుక్తంగా ఈ ఫండ్ బోర్డుకు లేఖ కూడా పంపారు. వరదల కారణంగా భారీ ప్రాణ నష్టం సహా ఇళ్లు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, ప్రజలు నిరాశ్రయులయ్యారని అందులో పేర్కొన్నారు.
తక్షణ సహాయం కావాలి
విపత్తు కారణంగా మొత్తం నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయలేదని నేపాల్ తెలిపింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం నష్టం భారీగా ఉందని, దేశం తక్షణమే స్పందించే అంతటి పరిస్థితుల్లో లేదని పేర్కొంది. తమకు తక్షణ సహాయం కావాలని లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డు సభ్యుడు, నేపాల్ అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ మహేశ్వర్ ధకాల్ చెప్పారు. ఆగస్ట్ 26న నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతంలో గ్లేసియర్ బద్ధలవ్వడం, కొండ చరియలు విరిగిపడటం వంటి కారణాలతో వరదలు ఉద్ధృతంగా ప్రవహించాయి. భోటెకోషి నది ద్వారా నీరు, శిథిలాలు, మట్టి కింది ప్రాంతాలవైపునకు దూసుకెళ్లడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఇప్పటికే 1000 దాటగా, సుమారు మరో 4 వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు నేపాల్ అధికారులు తెలిపారు.
1,127కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య- వరదలకు అదే కారణమని తేల్చిన ప్రధాని బాలేంద్ర షా
ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకపడిన అమెరికా- అతిపెద్ద దాడి ముందుందని ట్రంప్ వార్నింగ్

