ETV Bharat / international

నేపాల్ వరదలు- 1,003కు పెరిగిన మృతుల సంఖ్య- ఇంకా 4వేల మంది గల్లంతు!

నేపాల్ ఆకస్మిక వరదలు- 12వేల మందిని రక్షించిన సహాయక బృందాలు- ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్​

Nepal Floods
నేపాల్ ఆకస్మిక​ వరద బీభత్సం (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 4:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nepal Floods Death Toll : నేపాల్ ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 1000 దాటగా, మరో 4000 మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని అధికారులు తెలిపారు. "నేపాల్​లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించినవారి సంఖ్య మంగళవారం నాటికి 1,003కు చేరింది. కాగా, దేశంలోని ఎనిమిది జిల్లాల్లో భద్రతా దళాలు మరిన్ని మృతదేహాలను వెలికితీశాయి. సుమారు 4000 మంది గల్లంతు అయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 12వేల మందిని రక్షించాం" అని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​డీఆర్ఆర్​ఎంఏ) మంగళవారం తెలిపింది.

నేపాల్​-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, రాళ్లు విరిగిపడడం లేదా హిమపాతం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు భావిస్తున్నారు. ఆగస్టు 26న సంభవించిన ఈ ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్​లోని గ్రామాలను, పట్టణాలను అతలాకుతలం చేశాయి. హిమాలయ సరిహద్దు ప్రాంతం నుంచి దక్షిణ దిశగా ప్రవహించే భోటెకోశి నది వరద నీటిని దిగువకు తీసుకెళ్లింది. దీని ఈ భారీ వరద ధాటికి ఆ మార్గంలోని ఇళ్లు, వాహనాలు, రోడ్లు, వంతెనలు అన్నీ కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఎన్​డీఆర్​ఆర్​ఎంఏ తెలిపిన వివరాల ప్రకారం, నేపాల్​లోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 321 మృతదేహాలు లభించాయి. ఆ తర్వాత నవల్​పరాసి ఈస్ట్ జిల్లాలో 216, నవల్​పరాసి వెస్ట్​- 170, నువాకోట్​ -95, గోర్ఖా -65, ధాడింగ్-​ 57, రసువా- 41 , తనాహున్​ జిల్లా 38 చొప్పున మృతదేహాలు దొరికాయి.

ఒకే ఇంట్లో 24 మృతదేహాలు
వరద ప్రభావిత నువాకోట్​ జిల్లాలోని బెట్రావతిలో ఒక ఇంట్లో ఇప్పటి వరకు 24 మృతదేహాలను సహాయక సిబ్బంది సోమవారం వెలికితీశారు. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ బిపిన్ రెగ్మీ వెల్లడించారు. ఆ ఇంట్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అది పూర్తయ్యాక మృతుల వివరాలు తెలుస్తాయని అన్నారు.

డీఎన్​ఏ టెస్టింగ్ కోసం బారులు తీరుతున్న జనం
వరదల్లో చిక్కుకుని మరణించిన వారి మృతదేహాలను లేదా శరీర భాగాలను గుర్తించేందుకు, డీఎన్​ఏ ప్రొఫైలింగ్​ చేయించుకోవాలని నేపాల్​ పోలీసులు సోమవారం ప్రజలను కోరారు. విదేశాల్లో నివసిస్తున్నవారు ప్రామాణిక ల్యాబ్​ల్లో డీఎన్​ఏ ప్రొఫైలింగ్ చేయించుకొని, దాని సాఫ్ట్ కాపీని మెయిల్​ ద్వారా పంపాలని స్పష్టం చేశారు. దీనితో డీఎన్​ఏ సేకరణ కేంద్రాలకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకొంటున్నారు.

త్రిశూలి 3ఏ ప్లాంట్​- రెస్క్యూ ఆపరేషన్​
త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్​ క్రౌన్​ హెడ్​ను సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వద్ద నేపాల్ సైన్యం, సాయుధ పోలీసుల దళం, విద్యుత్ సిబ్బందితో కూడిన 90 మంది సభ్యుల బృందం గాలింపు చర్యలు చేపడుతోందని ప్రకటించింది. "జలవిద్యుత్ ప్లాంట్​ క్రౌన్​ హెడ్​ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. డ్రిల్లింగ్ చేసి 10 మీటర్ల లోతు బురద పొరను తొలగించి, ఒక ఇన్​లెట్​ ఏర్పాటు చేశారు. మరో ఇన్​లెట్​ ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని నేపాల్ హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.

మళ్లీ వరద హెచ్చరికలు
మరోవైపు నేపాల్​లోని అనేక జిల్లాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీనితో నేపాల్​ తాజాగా మరోసారి వరద హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే త్రిశూలిని, రసువాను కలిపే రహదారి కొట్టుకుపోయింది. త్రిశూలి వైపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తుండడంతో, రోడ్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ఆ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

ఉక్రెయిన్​పై రష్యా దాడి- భారతీయుడు సహా 12 మంది మృతి

ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉండకూడదు : SCO సదస్సులో ప్రధాని మోదీ