ETV Bharat / international

నేపాల్‌లో జలప్రళయం: 162కు చేరిన మృతులు- భారత్ చేయూత

విధ్వంసం సృష్టించిన భోటేకోశీ నది వరదలు- కొట్టుకుపోయిన వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు- రంగంలోకి దిగిన భారత సహాయక బృందాలు

Nepal Flash Floods
నేపాల్‌లో జలప్రళయం (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 7:40 AM IST

3 Min Read
Choose ETV Bharat

Nepal Flash Floods Update : హిమాలయ దేశం నేపాల్‌లో జల ప్రళయం విలయతాండవం చేసింది. భోటేకోశీ నదిలో బుధవారం అకస్మాత్తుగా సంభవించిన వరదలు పెను విషాదాన్ని నింపాయి. ప్రకృతి చేసిన విలయతాండవం వేలాది కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చాయి. రెప్పపాటులో జరిగిన ఈ పెను ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 162కి చేరుకుంది. విదేశీయులు, భద్రతా సిబ్బందితో సహా సుమారు 400 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్ చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఇది ఒకటిగా 'ది కాఠ్మండు పోస్ట్' పత్రిక రాసుకొచ్చింది.

చైనా సరిహద్దు సమీపంలోని తిమురే ప్రాంతంలో 'ల్హెండే' నది ప్రవాహాన్ని ఒక భారీ హిమపాతం అడ్డుకుంది. అక్కడ కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహం ఆగిపోవడంతో ఒక పెద్ద మంచు సరస్సు ఏర్పడింది. ఆ తర్వాత ఆ సరస్సు అకస్మాత్తుగా పగిలిపోవడంతో ఒక్కసారిగా పెను వరద ముంచుకొచ్చింది. క్షణాల వ్యవధిలో భారీగా నీరు ఉప్పొంగి కింద ఉన్న సియాఫ్రూబేసి తదితర గ్రామాలను ముంచెత్తింది. దీంతో కంటికి రెప్పపాటులో ఇళ్లు, వాహనాలు, రోడ్లు అన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో గల్లంతయిన వారిలో భారీ సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నట్లు నేపాల్ పీఎంఓ తెలిపింది. సుమారు 391 మంది విదేశీయులు, 44 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొంది. వరదల తీవ్రతకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ నష్టం
ఈ ఆకస్మిక వరదలు నేపాల్‌లో తీవ్ర ఆస్తినష్టాన్ని మిగిల్చాయి. దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 9 జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 9 వాణిజ్య బ్యాంకు శాఖలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 19 మోటరబుల్ వంతెనలు, దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.

భారత్ చేయూత
నేపాల్‌ను కష్టకాలంలో ఆదుకునేందుకు భారత్ తక్షణమే స్పందించింది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నేపాల్‌కు అవసరమైన అత్యవసర సహాయం, వైద్య బృందాలు ఖాఠ్మండు చేరుకున్నాయని తెలిపారు. భారత వాయుసేనకు చెందిన 'సీ-130జే' రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామగ్రిని అత్యవసరంగా నేపాల్‌కు తరలించారు. ఇందులో టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ లాంతర్లు, ప్రాణాలను రక్షించే ముఖ్యమైన మందులు ఉన్నాయి.

బాలెన్ షాకు ప్రధాని మోదీ ఫోన్
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నేపాల్‌కు అన్ని విధాలా మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. నేపాల్- భారత్ బృందాలు సహాయక చర్యల్లో సమన్వయంతో పనిచేస్తున్నాయని మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

అమెరికా రాయబారి సంతాపం
నేపాల్‌లో సంభవించిన జలవిలయంపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేపాల్‌లో ఉన్న అమెరికా పౌరులు స్థానిక అమెరికా రాయబారి కార్యాలయ సోషల్ మీడియా అప్‌డేట్స్ గమనించాలని, 'స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్' (STEP)లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

అండగా ఉంటాం: బంగ్లాదేశ్
నేపాల్‌లో సంభవించిన భీకర ఆకస్మిక వరదలపై బంగ్లాదేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వానికి, ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ కష్టకాలంలో వారికి అన్నివిధాలా అండగా నిలుస్తామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సహాయక చర్యల్లో నేపాల్‌కు ఏ విధంగానైనా సాయం చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

హెచ్​-1బీ ఫీజు పెంపు- అమెరికా ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం!

ఖమేనీ చనిపోలేదు- కానీ తీవ్రంగా గాయపడ్డాడు: ఇరాన్ సుప్రీంలీడర్​పై ట్రంప్ కామెంట్స్