ETV Bharat / international

ఇరాన్​కు కొత్త సుప్రీం లీడర్‌- ఖమేనీ కుమారుడు ముజ్తబా నియామకం!

ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని నియమించే అవకాశం- 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' మండలి ప్రతిపాదన

Iran New Supreme Leader
Iranian Supreme Leader Ayatollah Ali Khamenei, Mojtaba Khamenei (AP File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 7:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran New Supreme Leader : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ (56) నియామకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమారుడే తదుపరి సుప్రీం లీడర్ అవుతారని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 88 మంది మత గురువులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' మండలి ముజ్తబా ఖమేనీను సుప్రీం లీడర్‌గా ఎనుకున్నట్లు తెలిసింది. ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం, ముజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాావాల్సి ఉంది. ఈ నియామకంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైనిక నాయకత్వం నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరమనే కారణంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఇరాక్ యుద్ధంలో ఐఆర్‌జీసీ సైన్యంలో సేవలు
ముజ్తబా ఖమేనీ 1969లో మషాద్ నగరంలో జన్మించారు. ఆయన అలీ ఖమేనీకి రెండో కుమారుడు. తన తండ్రి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న సమయంలో పరిపాలన, అత్యున్నత నిర్ణయాల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా స్వయంగా పాల్గొని సైనికుడిగా సేవలు అందించారు. దీనివల్ల ఆయనకు ఐఆర్‌జీసీ కమాండర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక మధ్యస్థాయి షియా మత గురువు. అయితే, సుప్రీం లీడర్ కావడానికి అవసరమైన అత్యున్నత మతపరమైన హోదా (అయతొల్లా) ఆయనకు ఇవ్వడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముజ్తబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. తన తండ్రి తరపున అనధికారికంగా పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రెండోసారి
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ చరిత్రలో ఇది రెండో నాయకత్వ మార్పు మాత్రమే కావడం గమనార్హం. 1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ మరణం తర్వాత ఈ నియామకం జరిగింది. ఇరాన్ సైనిక విభాగమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్‌జీసీ) ఒత్తిడి మేరకే ముజ్తబా ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా షియా మత సంప్రదాయంలో తండ్రి తర్వాత కుమారుడు పీఠం ఎక్కడాన్ని మతపెద్దలు అంతగా ఇష్టపడరు. 'వారసత్వ పాలన'కు వ్యతిరేకంగా ఇరాన్ ఇస్లామిక్ విప్లవం వచ్చింది. రాచరిక వ్యవస్థను అంతం చేయడానికి 1979లో విప్లవం జరిగింది. ఖమేనీ కుమారుడికి పట్టం కట్టడం అనేది విప్లవ ఆశయాలకు విరుద్ధమని 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' మండలిలోని కొందరు మతపెద్దలు ముజ్తబా ఎన్నికను వ్యతిరేకించినట్లు తలుస్తోంది. వాస్తవానికి ఖమేనీ కూడా తన కుమారుడి పేరును వారసుల జాబితాలో చేర్చలేదు. అయితే ప్రస్తుత ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, అయితే ఐఆర్‌జీసీ ఒత్తిడి మేరకు ఇరాన్ మెజార్టీ మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు పక్కా ప్రణాళికతో జరిపిన దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సలహాదారులు మరణించారు. అయితే ముజ్తబా ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడటం గమనార్హం. సుప్రీం లీడర్ మరణాన్ని ఇరాన్ తేలికగా తీసుకోలేదు. ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను బలంగా ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికా,ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది.