ETV Bharat / international

మహాశక్తిగా కాదు విశ్వగురువుగా భారత్‌- సేవే మన బలం: మోహన్‌ భాగవత్‌

టొరంటోలో హిందూ విశ్వ బంధు కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రసంగం- భారత్‌ ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోలేదని ప్రపంచానికి జ్ఞానం, సేవ అందించిందని వ్యాఖ్య- వసుధైవ కుటుంబకం భారతీయ జీవన విధానంలో భాగమని వెల్లడి

Mohan Bhagwat Toronto Speech
మోహన్‌ భాగవత్‌ (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 7:07 AM IST

4 Min Read
Choose ETV Bharat

Mohan Bhagwat Toronto Speech : భారత్‌ ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదగడం కంటే తన సేవా గుణం, మానవతా విలువలతో విశ్వగురువుగా గుర్తింపు పొందిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. భారత్‌ ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించలేదని, ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవతా విలువలను అందించిందని తెలిపారు. కెనడాలోని టొరంటోలో నిర్వహించిన హిందూ విశ్వ బంధు- ఎంబ్రేస్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఫ్రెండ్‌షిప్‌ కార్యక్రమంలో భాగవత్‌ ప్రసంగించారు.

భారత్‌ను మహాశక్తిగా కాకుండా విశ్వగురువుగా చూడాలని ఆయన పేర్కొన్నారు. 'భారత్‌ను ఒకప్పుడు సూపర్‌పవర్‌ అని పిలవొచ్చు. కానీ అది సూపర్‌పవర్‌గా వ్యవహరించలేదు. ప్రపంచానికి సేవ చేసింది. తన స్వభావం, సంస్కృతి కారణంగా విశ్వగురువుగా ఎదిగింది. మహాశక్తిగా కాదు' అని వ్యాఖ్యానించారు. భారత్‌ ఎదుగుదల అంటే కేవలం దేశ శక్తి పెరగడం కాదని, మరింత ఐక్యమైన, స్వేచ్ఛాయుత మానవాళి ఆవిర్భావమని చెప్పారు.

'శరణార్థులకు భారత్‌ ఆశ్రయం'
ప్రపంచంలో ఎక్కడైనా కష్టాల్లో ఉన్నవారికి భారత్‌ అండగా నిలిచిందని మోహన్ భాగవత్‌ గుర్తుచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌కు చెందిన శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, జామ్‌నగర్‌ మహారాజా వారికి ఆశ్రయం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. వారు సురక్షితంగా తిరిగి వెళ్లే వరకు రక్షణ కల్పించారని తెలిపారు. రత్‌ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత సైనిక విమానాలు అక్కడ చిక్కుకున్న భారతీయులను మాత్రమే కాకుండా మరో ఏడు దేశాలకు చెందిన పౌరులను కూడా సురక్షితంగా తరలించాయని పేర్కొన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, పార్సీలు సహా వివిధ మతాలకు చెందిన ప్రజలు చరిత్రలో భారత్‌లో ప్రశాంతంగా ఆశ్రయం పొందారని భగవత్‌ అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా హింస, వివక్ష, వేధింపులు ఎదుర్కొన్నవారికి భారత్‌ ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు.

'ఆక్రమణ కాదు- జ్ఞాన విస్తరణ'
భారతీయ నాగరికత ఇతర దేశాలను జయించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదని మోహన్ భాగవత్‌ చెప్పారు. ప్రాచీన కాలంలో రహదారులు, విమానాలు, ఆధునిక రవాణా సౌకర్యాలు లేని సమయంలోనే భారతీయులు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వెళ్లారని వివరించారు. మెక్సికో నుంచి సైబీరియా వరకు, చైనా, మంగోలియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు భారతీయులు ప్రయాణించారని చెప్పారు. హిమాలయాలను కాలినడకన దాటారని.. చిన్న పడవలతో ఆగ్నేయాసియాకు వెళ్లారని తెలిపారు. అయితే ఎక్కడికెళ్లినా ఏ దేశాన్నీ ఆక్రమించలేదని, అక్కడి ప్రజలను బలవంతంగా మతం మార్చలేదని అన్నారు. 'వారు వెళ్లిన చోట జ్ఞానాన్ని పంచారు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, నాగరికతకు సంబంధించిన విలువలను అందించారు' అని వివరించారు. భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడాన్ని కాకుండా, మానవాళికి ఉపయోగపడే జ్ఞానాన్ని పంచడాన్నే ప్రాధాన్యంగా చూసిందని చెప్పారు.

'ఇదే భారతీయుల డీఎన్‌ఏ'
అవసరంలో ఉన్నవారు భారత్‌ను సాయం కోసం ఆశ్రయించినప్పుడు ఎప్పుడూ తిరస్కరించలేదని భాగవత్‌ అన్నారు. కొన్ని సందర్భాల్లో అడగకుండానే సాయం చేయడం భారతీయుల సంప్రదాయమని పేర్కొన్నారు. 'ఇదే మన సంప్రదాయం. ఇదే భారత్‌ డీఎన్‌ఏ. అందుకే హిందువులు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుందనే మాట ఉంది' అని అన్నారు. ప్రపంచంలోని ప్రజలందరినీ ఒకే కుటుంబంగా చూడాలనే భావన భారతీయ తత్వంలో ఉందని చెప్పారు. వసుధైవ కుటుంబకం సూత్రాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనుషుల రూపం, రంగు, శరీర నిర్మాణం వేర్వేరుగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా అందరూ ఒక్కటేనని పేర్కొన్నారు. ఇతరులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.

'వైవిధ్యమే ఏకత్వానికి అలంకారం'
భారతీయ సంస్కృతిలో భిన్నత్వానికి ప్రత్యేక స్థానం ఉందని మోహన్ భాగవత్‌ వివరించారు. అనేక కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ అవన్నీ భారతీయ సమాజంలో భాగంగానే ఉన్నాయని చెప్పారు. 'ప్రకృతి, వాస్తవికత వ్యక్తీకరణలో వైవిధ్యం సహజం. కానీ ఏకత్వమే అసలైన వాస్తవం. సహజమైన వైవిధ్యాన్ని గౌరవిస్తూ అంతర్లీన ఏకత్వాన్ని గుర్తించడం భారతీయుల ప్రాచీన ఆలోచనా విధానం' అని అన్నారు. జీవం ఉన్నవాటినే కాకుండా జీవం లేని వాటినీ తమవిగా భావించే తత్వం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఉందని చెప్పారు. అందుకే వైవిధ్యం భారతదేశంలో ఏకత్వానికి అడ్డంకి కాదన్నారు. వైవిధ్యాన్ని గౌరవించి, అంగీకరించి, సేవ చేయాలని పిలుపునిచ్చారు.

కెనడా-భారత్‌ బంధంపై జేసన్‌ కెనీ వ్యాఖ్యలు
టొరంటోలో జరిగిన ఆ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కెనడా నాయకులు కూడా పాల్గొన్నారు. కెనడా మాజీ రక్షణ మంత్రి, అల్బెర్టా మాజీ ప్రీమియర్‌ జేసన్‌ కెనీ భారత్‌-కెనడా సంబంధాలపై మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మళ్లీ సానుకూల వేగం కనిపిస్తోందని అన్నారు. 2026లో ప్రధాని నరేంద్ర మోదీ కెనడాను సందర్శించనున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జూన్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానాన్ని మోదీ స్వీకరించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇరు దేశాలు దౌత్య మార్గాల్లో సంప్రదింపులు కొనసాగిస్తూ పరస్పర అనుకూలమైన తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ వెల్లడించింది.

మోదీ కెనడా పర్యటన అంశాన్ని జేసన్‌ కెనీ ప్రస్తావించగానే కార్యక్రమానికి హాజరైనవారు ఉత్సాహంగా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. కెనడాలోని హిందూ ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం ప్రారంభమైంది. శాంతి, సాంస్కృతిక విలువలు, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ తత్వంలోని సేవ, సోదరభావం, వైవిధ్యంలో ఏకత్వం వంటి విలువలను ప్రపంచానికి చాటడమే తన సందేశమని మోహన్‌ భగవత్‌ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.

ప్రవాస భారతీయులు కర్మభూమికి విధేయులుగా ఉండాలి: మోహన్ భాగవత్

భాగవత్‌ అమెరికా పర్యటనపై వివాదం- వీసా రద్దు చేయాలన్న USCIRF