ETV Bharat / international

మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం- బ్రహ్మోస్​తో సహా 20 కీలక ఒప్పందాలు ఖరారు

ఇండోనేసియా రాజధాని జకార్తాలో ప్రధాని మోదీకి గౌరవ వందనం- అధ్యక్షుడు ప్రబోవో సుబియాం ద్వైపాక్షిక చర్చలు- ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

PM Modi Indonesia Visit
PM Modi holds bilateral meeting with Indonesian President Subianto (Youtube/@NarendraModi)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 11:25 AM IST

4 Min Read
Choose ETV Bharat

PM Modi Indonesia Visit : భారత్‌, ఇండోనేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య జకార్తాలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండోనేషియా సైన్యానికి భారత్‌ అత్యాధునిక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సరఫరా చేయడంతో పాటు సముద్ర భద్రత, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది. ప్రధానికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు.

20 ఒప్పందాలపై సంతకాలు
సమావేశం అనంతరం ఇరు దేశాలు దాదాపు 20 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధ రంగం, సముద్ర భద్రత, వాణిజ్యం, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేయనున్నాయి. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగానికి అవసరమైన ఉక్కు, నికెల్‌, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ఇండోనేషియా కీలక దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉక్కు, నికెల్‌, రేర్‌ ఎర్త్‌ శాశ్వత అయస్కాంతాల తయారీ రంగాల్లో భారత్‌ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల భారత పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరా మరింత బలపడనుంది.

బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణులపై సహకారం
భారత్‌ తయారు చేసిన బ్రహ్మోస్‌ క్షిపణులను ఇండోనేషియాకు సరఫరా చేయాలని నిర్ణయించారు. అలాగే 'ఆపరేషన్‌ సిందూర్‌' సందర్భంగా భారత్‌ అభివృద్ధి చేసిన 'అస్త్ర' గగనతల క్షిపణుల పనితీరుతో ఆకర్షితమైన ఇండోనేషియా వాటిని కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొత్త దశలోకి అడుగుపెట్టనుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్‌ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్‌, ఇండోనేషియా నిర్ణయించాయి. మలక్కా జలసంధిని ఆనుకుని ఉన్న ఈ పోర్టు, భారత్‌ గ్రేట్‌ నికోబార్‌ పోర్టు ప్రాజెక్టుకు సుమారు 100 మైళ్ల దూరంలో ఉండటంతో వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్య రవాణా బలోపేతానికి ఇది ఉపయోగపడనుంది.

యూపీఐ అనుసంధానం- ఐఐఎం క్యాంపస్‌
ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీని వల్ల వ్యాపార లావాదేవీలు, పర్యాటకుల చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. అలాగే ఇండోనేషియాలో భారతీయ నిర్వహణ విద్యాసంస్థ ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సమావేశంలో పశ్చిమాసియా పరిస్థితులతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరు నేతలు చర్చించారు. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో సంభాషణ, దౌత్యానికి మరింత ప్రాధాన్యం పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారానికే భారత్‌ మద్దతు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.

'స్వర్ణయుగానికి నాంది'
ఇటీవలి కాలంలో భారత్‌, ఇండోనేషియా మధ్య పరస్పర విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో రక్షణ, భద్రత, సముద్ర సహకారం మరింత బలపడుతోందని చెప్పారు. రక్షణ రంగ పరస్పర మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు కొత్త శిఖరాలకు చేరుకుందని అన్నారు. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, విద్య, సంస్కృతి తదితర అన్ని రంగాల్లో కొత్త అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌-ఇండోనేషియా సంబంధాల్లో నేటి నుంచే స్వర్ణయుగానికి నాంది పలుకుతున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే బ్లూ ఎకానమీ, సముద్ర వాణిజ్యం, పోర్టుల అభివృద్ధి రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

'ఇది కోట్లాది భారతీయుల గౌరవం'
ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్‌ ఆదిపుర్ణ' (స్టార్‌ ఆఫ్‌ ఇండోనేషియా)ను ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రదానం చేశారు. పురస్కారం స్వీకరించిన అనంతరం మోదీ ఈ గౌరవాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆప్యాయత, గౌరవంతో అందుకున్నానని అన్నారు. ఇది ఇండోనేషియా ప్రజల ప్రేమాభిమానాలకు, మన రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి ప్రతీక అని తెలిపారు. ఈ గౌరవం అందించిన అధ్యక్షుడు ప్రబోవో, ఇండోనేషియా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

చర్చలకు ముందు ప్రధాని మోదీకి జకార్తాలో మంగళవారం అద్భుత స్వాగతం లభించింది. గుర్రాలపై భద్రతా దళాల ఎస్కార్ట్‌, గౌరవ వందనం, సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ప్రధాని మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం ఘనంగా ఆహ్వానం పలికింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా మోదీకి స్వాగతం పలికి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి.

జకార్తాలో మోదీకి ఘన స్వాగతం- ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో ఆతిథ్యానికి భారత ప్రధాని ఫిదా

'మాకు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మద్దతు ఉంది'- జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్