అమెరికాలో అర్థరాత్రి హత్యాకాండ- ఒకే వ్యక్తి చేతుల్లో ఆరుగురు బలి
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు- ఒక రైఫిల్, ఒక హ్యాండ్‌గన్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు

Published : January 11, 2026 at 8:46 AM IST
Mississippi Rampage : అమెరికాలోని మిసిసిప్పీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. 24 ఏళ్ల యువకుడు ఒకే రాత్రిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపి ఆరుగురిని హత్య చేశాడు. మృతుల్లో అతని తండ్రి, సోదరుడు, మామ, ఏడేళ్ల చిన్నారి, ఒక చర్చ్ పాస్టర్‌తో పాటు ఆయన సోదరుడు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు డారికా ఎం. మూర్ (Daricka M. Moore). ఘటన అనంతరం మిసిసిప్పీ రాష్ట్రంలోని సీడర్‌బ్లఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ రోడ్డుబ్లాక్ వద్ద శనివారం అర్ధరాత్రి ముందు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
మొదట కుటుంబ సభ్యులపై దాడి
క్లే కౌంటీ షెరీఫ్ ఎడ్డి స్కాట్ తెలిపిన వివరాల ప్రకారం, మూర్ మొదట పశ్చిమ క్లే కౌంటీలోని ఓ మట్టి రోడ్డుపై ఉన్న తన కుటుంబ మొబైల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ తన తండ్రి గ్లెన్ మూర్ (67), సోదరుడు క్వింటన్ మూర్ (33), మామ విల్లీ ఎడ్ గైన్స్ (55)లను కాల్చి చంపాడు. ఈ ఘటనే మొత్తం హత్యాకాండకు ఆరంభమని పోలీసులు భావిస్తున్నారు.
చిన్నారి హత్యతో అమానుషత్వం
అనంతరం మూర్ తన సోదరుడి ట్రక్కును దొంగిలించి కొద్ది మైళ్ల దూరంలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏడేళ్ల చిన్నారిని తుపాకీతో బెదిరించి కాల్చి చంపినట్లు షెరీఫ్ వెల్లడించారు. మరో చిన్నారిపై కూడా తుపాకీ గురిపెట్టినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడింది. తుపాకీ పనిచేయలేదా, లేక నిందితుడు కాల్చలేదా అన్నది ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో ఆ ఇంట్లో చిన్నారి తల్లి, మరో బిడ్డ కూడా ఉన్నారని తెలిపారు. ఏడేళ్ల చిన్నారిని చంపడానికి ఏ రకమైన మనస్తత్వం అవసరమో అర్థం కావడం లేదని షెరీఫ్ ఎడ్డి స్కాట్ ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చ్ వద్ద మరో రెండు హత్యలు
ఇక్కడితో ఆగని మూర్, ఆ తర్వాత అపోస్టోలిక్ చర్చ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ అనే చిన్న చర్చ్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న నివాసంలోకి చొరబడి పాస్టర్ రెవ. బ్యారీ బ్రాడ్లీ, ఆయన సోదరుడు శామ్యూల్ బ్రాడ్లీని కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి మరో వాహనాన్ని దొంగిలించాడు. ఈ ఇద్దరూ సాధారణంగా కొలంబస్ ప్రాంతంలో నివసిస్తూ, వారాంతాల్లో చర్చ్ ప్రాంగణంలో ఉండేవారని పోలీసులు తెలిపారు.
నిందితుడి అరెస్ట్, దర్యాప్తు కొనసాగింపు
మొత్తం ఘటనలపై మొదటి కాల్ వచ్చిన నాలుగు గంటలన్నర తర్వాత, రాత్రి 11:24 గంటలకు మూర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఒక రైఫిల్, ఒక హ్యాండ్‌గన్ ఉన్నట్లు జిల్లా అటార్నీ స్కాట్ కొలమ్ తెలిపారు. ఆయుధాలు అతడు ఎక్కడ నుంచి తెచ్చుకున్నాడన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.
మూర్ ప్రస్తుతం వెస్ట్ పాయింట్‌లోని క్లే కౌంటీ జైలులో బెయిల్ లేకుండా రిమాండ్‌లో ఉన్నాడు. సోమవారం కోర్టులో అతడిని హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరింత తీవ్రమైన క్యాపిటల్ మర్డర్ ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలా జరిగితే మూర్‌కు బెయిల్ అవకాశం ఉండదని చట్టం స్పష్టం చేస్తోంది.
మరణశిక్ష కోరనున్న ప్రభుత్వం
ఈ కేసులో మరణశిక్ష కోరనున్నట్లు జిల్లా అటార్నీ స్కాట్ కొలమ్ వెల్లడించారు. "ఒకే రాత్రిలో ఆరు హత్యలు, మూడు వేర్వేరు ప్రాంతాలు… ఇది అత్యంత ఘోరమైన నేరం" అని ఆయన వ్యాఖ్యానించారు. మూర్‌కు కోర్టు ద్వారా పబ్లిక్ డిఫెండర్‌ను నియమించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనతో క్లే కౌంటీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలు తీవ్ర వేదనలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

