ETV Bharat / international

UN హెడ్ క్వార్టర్ ఎదుట టిబెట్ జెండాతో వ్యక్తి ఆత్మాహుతి- చైనా టిబెట్‌ను వీడాలంటూ నినాదం!

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సమీపంలో విషాద ఘటన- టిబెట్ జెండాతో నిరసన చేపట్టి నిప్పంటించుకున్న వ్యక్తి

Tibetan Self Immolation At Un
The symbol of the United Nations (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : July 3, 2026 at 12:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tibetan Self Immolation At UN : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రధాన కార్యాలయం సమీపంలో విషాదకర ఘటన జరిగింది. టిబెట్ జెండా చేతబట్టి నిరసన చేపట్టిన ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ నిరసన టిబెట్ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించినదిగా పోలీసులు భావిస్తున్నారు.

ఐరాస కార్యాలయం సమీపంలో ఘటన
స్థానిక మీడియా కథనాల ప్రకారం, గురువారం సాయంత్రం మన్‌హాటన్‌లోని ఈస్ట్ 43వ వీధి, ఫస్ట్ అవెన్యూ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 42 ఏళ్ల లోబ్గా రంగ్జెన్‌గా గుర్తించారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన అమెరికాలో నివసిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటల సమయంలో రంగ్జెన్ టిబెట్ జెండాతో అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఒంటిపై మండే ద్రవం పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న అతడు కొద్ది సేపటికే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడుగా వెళ్తున్న వారు భయాందోళనకు గురికాగా, అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలంలో 'చైనా టిబెట్‌ను వీడాలి' నినాదం
ఘటన అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ టిబెట్ జెండాతో పాటు "చైనా టిబెట్‌ను వీడాలి" అనే నినాదంతో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నినాదం టిబెట్ స్వాతంత్ర్య ఉద్యమానికి, 'ఫ్రీ టిబెట్' ప్రచారానికి ప్రతీకగా భావిస్తారు. ఘటన వెనుక ఉన్న ఉద్దేశాలు, బాధితుడు వదిలిన ఇతర ఆధారాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఐరాసలో సమావేశాల షెడ్యూళ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగిందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి తెలిపారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న టిబెట్ ఉద్యమం
టిబెట్ సమస్యపై దశాబ్దాలుగా అంతర్జాతీయ చర్చ నడుస్తోంది. టిబెట్‌పై చైనా పాలనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజల్లో కొంతమంది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2009 మార్చి నుంచి టిబెట్‌లో 150 మందికి పైగా నిరసనకారులు ఆత్మాహుతికి పాల్పడినట్లు పలు అంతర్జాతీయ సంస్థలు నమోదు చేశాయి. ఈ చర్యల ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని టిబెట్ పరిస్థితులపైకి మళ్లించాలని వారు ప్రయత్నించినట్లు చెబుతుంటారు. ఉద్యమకారులు టిబెట్‌కు అధిక స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కల్పించాలని కోరుతున్నారు. అలాగే టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా తిరిగి టిబెట్‌కు రావడానికి అవకాశం కల్పించాలని, టిబెట్ ప్రజల హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చైనా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, మానవ హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ వంటి అంశాలు కూడా ఈ ఉద్యమంలో ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

టిబెట్ వివాదం
13వ శతాబ్ధం నుంచి టిబెట్‌ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. 1951లో కుదిరిన "పదిహేడు సూత్రాల ఒప్పందం" అనంతరం టిబెట్ చైనాలో విలీనమైంది. అయితే ఆ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు టిబెటన్ సంస్థలు ఇప్పటికీ ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. 1990 దశకంలో అమెరికాలో నిర్వహించిన 'టిబెటన్ ఫ్రీడమ్ కాన్సర్ట్స్' ద్వారా టిబెట్ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది. పలువురు ప్రముఖ అంతర్జాతీయ సంగీత బృందాలు, కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని టిబెట్ సమస్యపై అవగాహన కల్పించారు. అప్పటి నుంచి టిబెట్ అంశం అంతర్జాతీయ మానవ హక్కుల చర్చల్లో తరచూ ప్రస్తావనకు వస్తోంది.

ఖమేనీ అంతిమయాత్రకు ఇరాన్ సిద్ధం- ట్రెహాన్​కు భౌతికకాయం తరలింపు- వీడ్కోలుకు మొజ్తబా దూరం

ఇరాన్ ప్రతినిధులను హతమార్చేందుకు ఇజ్రాయెల్​ స్కెచ్​! చర్చల వేళ అమెరికాకు భయాలు