ETV Bharat / international

'మేం ఎలాంటి తప్పు చేయలేదు'- కోర్టులో మదురో దంపతుల వాదన- స్విట్జర్లాండ్ బిగ్ షాక్!

వెనెజువెలా అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను కోర్టులో ప్రవేశపెట్టిన అమెరికా ప్రభుత్వం- తాము నిర్దోషులమని వాదన

Maduro Court Appearance
Maduro Court Appearance (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 7:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Maduro Court Appearance : ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకొచ్చిన వెనెజువెలా అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అమెరికా ప్రభుత్వం సోమవారం న్యూయార్క్‌లోని మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. డ్రగ్స్ రావాణాకు పాల్పడలేదని పేర్కొన్నారు.

మదురో ఆయన భార్య సిలియాపై డ్రగ్‌ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న అభియోగాలను మోపిన అమెరికా, సోమవారం బ్రూక్లిన్‌ జైలు నుంచి మన్‌హటన్ ఫెడరల్ కోర్టుకు తరలించింది. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మదురో దంపతులను తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. వారు హెలికాప్టర్ ఎక్కాక అది న్యూయార్క్‌ హార్బర్ మీదుగా మన్‌హటన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి సాయుధ శకటంతో మదురో దంపతులను కోర్టు వద్దకు తరలించారు.

నీలం రంగు జైలు దుస్తుల్లో మదురో దంపతులను తీసుకెళ్లారు. వాస్తవానికి మదురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికొలస్ మదురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు.

తాను నిర్దోషినని, ఏ తప్పూ చేయలేదని మదురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుడినని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మదురో దంపతులు స్పానిష్‌లో మాట్లాడగా న్యాయస్థానంలోని ట్రాన్స్‌లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు. వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది.

అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణ విధానమే మదురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మదురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. దీన్ని కోర్టులో వాదించనున్నట్టు పేర్కొన్నారు. మదురో దంపతుల విచారణ సందర్భంగా కోర్టు సమీపంలో కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు వచ్చారు. పోలీసులు వారిని నిలువరించారు.

మదురోకు స్విస్ షాక్
మరోవైపు, స్విట్జర్లాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మదురోకు సంబంధించిన స్విస్‌ ఆధారిత ఆస్తులన్నింటినీ తక్షణమే ఫ్రీజ్‌ చేస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్విస్‌ ఫెడరల్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ (X) వేదికగా స్విస్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మదురోకు లేదా ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులకు స్విట్జర్లాండ్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో జరిగే న్యాయ ప్రక్రియల్లో ఆ ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా తేలితే, అవి వెనిజువెలా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇదే విషయాన్ని వివరంగా తెలియజేస్తూ స్విస్‌ ప్రభుత్వం అధికారిక ప్రెస్‌ రిలీజ్‌ కూడా జారీ చేసింది. జనవరి 5, 2026 (స్థానిక కాలమానం ప్రకారం) న ఫెడరల్‌ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మదురోతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇతర వ్యక్తులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న ఆస్తులన్నింటినీ తక్షణమే ఫ్రీజ్‌ చేస్తున్నామని పేర్కొంది. ఆస్తులు దేశం వెలుపలికి తరలిపోకుండా నిరోధించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. అయితే ఈ ఆస్తుల ఫ్రీజ్‌ నిర్ణయం ప్రస్తుత వెనిజువెలా ప్రభుత్వ సభ్యులకు వర్తించదని స్విస్‌ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే 2018 నుంచి వెనిజువెలాపై అమలులో ఉన్న ఆంక్షలకు ఇది అదనమని వివరించింది. ఈ చర్యలు స్విట్జర్లాండ్‌ యొక్క ఎంబార్గో చట్టం కింద అమలవుతున్నాయని తెలిపింది.