ఫ్రాన్స్ సంచలన నిర్ణయం- అణ్వాయుధాల సంఖ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్
30ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ కీలక నిర్ణయం- మిత్రదేశాల్లో అణు యుద్ధ విమానాల మోహరింపు- అణ్వాయుధాల సంఖ్యను పెంచుకోనున్నట్లు మేక్రాన్ ప్రకటన

Published : March 2, 2026 at 9:57 PM IST
France Increase Nuclear Warheads : ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అనుసరిస్తున్న అణు నిరాయుధీకరణ విధానానికి స్వస్తి పలుకుతూ, ఫ్రాన్స్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్ నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గాముల ప్రధాన కేంద్రం 'లీల్ లాంగ్' సందర్శన సందర్భంగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. తమ వద్ద ఉన్న అణు వార్‌హెడ్‌ల సంఖ్యను పెంచబోతున్నట్లు వెల్లడించారు. 1992లో కోల్డ్ వార్ తర్వాత ఫ్రాన్స్ తన అణ్వాయుధాలను పెంచుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ప్రస్తుతం ఫ్రాన్స్ వద్ద సుమారు 300 లోపు అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, శాంతి చర్చల నేపథ్యంలో గత మూడు దశాబ్దాలుగా ఫ్రాన్స్ తన అణు నిల్వలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. అయితే, మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఈ సంఖ్యను పెంచడం అనివార్యమని మాక్రాన్ స్పష్టం చేశారు. అయితే వార్‌హెడ్‌ల సంఖ్యను ఎంత వరకు పెంచుబోతున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
అలాగే, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరో కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన అణ్వాయుధాలను మోయగల సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలను తాత్కాలికంగా మిత్రదేశాల్లో మోహరించాలని ఆయన నిర్ణయించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఐరోపా ఖండంలో మారుతున్న భద్రతా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, ఫ్రాన్స్ తన అణు వ్యూహాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలతో ఈ దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా ఐరోపా ఖండం మొత్తం ఒకే గొడుగు కిందకు వస్తుందని మెక్రాన్ ఆకాంక్షించారు. అణ్వాయుధాలను ఇతర దేశాల్లో మోహరించినప్పటికీ, వాటి ప్రయోగంపై పూర్తి నియంత్రణ ఫ్రాన్స్ వద్దే ఉండనుంది. వేరే ఏ దేశంతోనూ ఈ నిర్ణయాధికారాన్ని పంచుకోబోమని మాక్రాన్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'నాటో' పట్ల ఉదాసీనతగా ఉండటం, ఐరోపా రక్షణ బాధ్యతల నుంచి తప్పుకుంటామన్న ఆయన సంకేతాలు ఇవ్వడంతో ఫ్రాన్స్‌ను అప్రమత్తమైంది. అమెరికాపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని భావించిన మేక్రాన్, ఐరోపా తనను తాను రక్షించుకునే స్థాయికి ఫ్రాన్స్ భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అణు ముప్పు పెరిగింది. ఫలితంగా తూర్పు ఐరోపా దేశాలు నిరంతరం భయం నీడలో బతుకుతున్నాయి. అణు సామర్థ్యం పెంచుకోవడం ద్వారా రష్యాకు గట్టి హెచ్చరిక పంపాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అందులో భాగంగానే మేక్రాన్ తాజా ప్రకటన చేశారు.
బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి తప్పుకున్న తర్వాత, అణు ఆయుధాలు కలిగిన ఏకైక ఈయూ దేశంగా ఫ్రాన్స్ మిగిలింది. ఇప్పుడు తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ ఒక తిరుగులేని సైనిక శక్తిగా ఎదగాలని వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. మొదటి నుంచి జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు అణు ఆయుధాలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. యూరప్‌లో అనిశ్చితి నేపథ్యంలో ఇప్పుడు ఫ్రాన్స్ ఇస్తున్న ఈ 'అణు భరోసా'ను ఆ దేశాలు ఎలా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. పోలాండ్ వంటి దేశాలు మాత్రం మేక్రాన్ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశం ఉంది.
ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను పెంచుకునే అంశం తెరపైకి వస్తుందన్న చర్చ నడుస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలు దీనిని సాకుగా చూపి తమ అణు నిల్వలను మరింత పెంచుకునే అవకాశమూ లేకపోలేదు. ఫ్రాన్స్ తన సరిహద్దు దేశాలైన పోలాండ్ వంటి చోట్ల అణు విమానాలను మోహరిస్తే, రష్యా దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పటికే బెలారస్‌లో రష్యా అణు ఆయుధాలను మోహరించి ఉంచింది, ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాట పట్టడం యూరప్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

