నేపాల్ వరదలు- 1924 మంది గల్లంతు- 579కి పెరిగిన మృతుల సంఖ్య!

Published : August 28, 2026 at 9:00 AM IST
|Updated : August 28, 2026 at 10:34 PM IST
Nepal Floods Live Updates : నేపాల్‌లో రసువా జిల్లాలో కొన్ని అడుగుల ఎత్తున మొదలైన వరద, బురద ప్రవాహం పోటెత్తి దిగువకు ప్రవహించి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. పరుగెత్తుతున్న ప్రజలను వరద కమ్మేసింది. జంతువులు, చెట్లు వరదలో కలిసిపోయాయి. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నదిలో ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. అడ్డంకి తొలగిపోగానే అది ఉప్పెనై భారీగా వరద, బురద దిగువకు పోటెత్తింది. అది భోటే కోశీ, త్రిశూలి నదుల ప్రవాహాన్ని బీభత్సం చేసింది. టిబెట్‌లోనూ వరద భారీ విధ్వంసం సృష్టించింది. భవనాలకు భవనాలే నేలమట్టమయ్యాయి.
LIVE FEED
చైనా నుంచి నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయుల జాబితాను విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో 149 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
!
నేపాల్‌లో వరదల్లో మృతుల సంఖ్య 579కి చేరగా, ఏకంగా 1,924 మంది గల్లంతు అయ్యారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విదేశీ సాయాన్ని తిరస్కరించలేదన్న నేపాల్
నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న సాయంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్నేహపూర్వక దేశాలు, అంతర్జాతీయ సమాజం అందించేందుకు ముందుకొచ్చిన సహాయాన్ని తిరస్కరించలేదని నేపాల్ స్పష్టం చేసింది. అయితే విపత్తు సంభవించిన తొలి దశలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న తమ సొంత భద్రతా బలగాలను గరిష్ఠంగా వినియోగించడానికే ప్రాధాన్యం ఇచ్చామని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.
నేపాల్‌లో ప్రాణాలతో బయటపడిన పర్యటకులను కలిసిన భారత రాయబారి
నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బయటపడిన భారత పర్యటకులను, ఆ దేశంలోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ త్రిభువన్ శుక్రవారం కలుసుకున్నారు. కాఠ్మండు నుంచి ఇండిగో విమానంలో భారత్‌కు తిరుగు ప్రయాణమైన భారతీయ పౌరులకు ఆయన వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు: విదేశాంగశాఖ
నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు 320 మంది భారతీయులు గల్లంతు అయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. అలాగే, చైనాలో ఉన్న 400 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది.
నేపాల్ వరదల్లో 538 మంది మృతి
నేపాల్‌ను వరదలు శవాల దిబ్బగా మార్చేశాయి. సహాయక చర్యలు మూడో రోజుకు చేరేసరికి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. మృతులసంఖ్య అంతకంతకూ పెరుగుతూ 538కి చేరింది. వందల మంది విదేశీ పర్యాటకులు, భద్రతా సిబ్బంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇది చాలదన్నట్లు టిబెట్ సరిహద్దుల్లో ఏర్పడిన బారియర్ లేక్ డ్యామ్ మళ్లీ బద్దలవడంతో నేపాల్‌కు రెండో విడత వరద ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. రెండో విడత వరద ముప్పు వేళ కొన్ని గంటల సేపు సహాయక చర్యలను చైనా, నేపాల్ నిలిపివేసి తర్వాత మళ్లీ ప్రారంభించాయి.
సరిహద్దు వాణిజ్యానికి దెబ్బ
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా భారత్ -పొరుగు దేశం మధ్య సరిహద్దు వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ మీదుగా కాఠ్మండు, నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాల రాకపోకలకు, దెబ్బతిన్న, వరద నీటితో నిండిన రహదారుల వల్ల అంతరాయం ఏర్పడింది. నేపాల్‌లోకి ప్రవేశించడానికి ట్రక్కులు వేచి ఉండటంతో, మహారాజ్‌గంజ్‌లోని సోనౌలి సరిహద్దుకు భారత వైపున సుమారు 16 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు తమ ఒక నెల జీతాన్ని 'ప్రధాని విపత్తు సహాయ నిధి'కి జమ చేయాలని శుక్రవారం నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం, ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఆ నిర్ణయాన్ని ప్రకటించింది.
చైనా అధ్యక్షుడు షీ సమావేశం
నేపాల్ వరదల పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
నేపాల్ వరదల్లో 475 మంది మృతి
నేపాల్ జల ప్రళయంలో చనిపోయినవారి సంఖ్య 475కు చేరింది. 667 మంది గల్లంతయ్యారని నేపాల్ పర్యాటక బోర్డు తెలిపింది. శుక్రవారం ఉదయం 1,545 మంది రక్షించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.
నేపాల్‌లో మళ్లీ వరద హెచ్చరికలు
నేపాల్‌కు జలప్రళయం ముప్పు ఉన్నట్లు పోలీస్‌శాఖ హెచ్చరిక జారీ చేసింది. టిబెట్ వైపు ఆనకట్ట తెగిపోయినట్లు ట్వీట్ చేసింది. రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. అలాగే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాని కోరింది.
టిబెట్‌లో సహాయక చర్యలను నిలిపివేసిన చైనా
టిబెట్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అందుకే సహాయక చర్యలను నిలిపివేసినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రెస్క్యూ సిబ్బందిని వేచి ఉండాలని సూచించింది.
వరద నష్టంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం
నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సింఘా దర్బార్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రారంభమైంది. 10వ తేదీన రసువాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వినాశకరమైన వరదల వల్ల కలిగిన నష్టం, అలాగే సహాయక, పునరావాస, పునర్నిర్మాణ ప్రయత్నాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరిన నేపాల్ పోలీస్‌శాఖ
నేపాల్‌కు మరో జలప్రళయం ముప్పు ఉన్నట్లు నేపాల్ పోలీస్‌శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆనకట్ట తెగిపోవడంతో జలప్రళయం ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. టిబెట్ వైపు ఆనకట్ట తెగిపోయినట్లు ట్వీట్ చేసిన నేపాల్ పోలీస్‌శాఖ వెల్లడించింది. రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన
నేపాల్ పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. టిబెట్ వైపు నుంచి నేపాల్ రసువాలోని భోటేకోషి నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరుతున్నందున, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతంలోని నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అన్నారు.
నేపాల్ వరదల వల్ల ప్రభావితమైన భారతీయులకు మద్దతు తెలిపిన మమ్దానీ
నేపాల్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా ప్రభావితమైన భారతీయులకు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. టిబెటన్ భాషలో రాసిన ఒక సందేశం ద్వారా మద్దతును తెలియజేశారు. వందలాది మంది ప్రాణాలను బలిగొని, అనేక మందిని నిరాశ్రయులను చేసిన విపత్కర వరదల వల్ల ప్రభావితమైన నేపాలీ, టిబెటన్ ప్రజలకు మద్దతు ప్రకటించిన కొద్ది గంటలకే ఆయన ఆ సందేశాన్ని విడుదల చేశారు.
"న్యూయార్క్ నగరంలోని చాలా మంది నివాసితులు తమ స్వదేశాల నుంచి బాధాకరమైన వార్తలను విన్నారు. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత ప్రాంతాలకు ఇంకా చేరుకోని వారు ప్రాణాలను కాపాడుకునే మార్గం కోసం అన్వేషిస్తున్నారు" అని మమ్దానీ పోస్ట్ చేశారు. "భారత్, టిబెట్‌కు చెందిన ప్రజలారా, మీ హృదయాల్లో ఉన్న బాధను మా నగరంలోని మేం అర్థం చేసుకోగలం. ఈ క్లిష్ట సమయంలో మీరు ఒంటరి వారు కాదు. మీకు అండగా న్యూయార్క్ నగరం కూడా ఉంది" అని చెప్పారు.
వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు ఆస్ట్రేలియా అత్యవసర సహాయం
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంతాపం తెలిపారు. "వినాశకరమైన వరదల తర్వాత సహాయం చేయడానికి ఆస్ట్రేలియా సంక్షోభ, మానవతా ప్రతిస్పందన నిపుణులను పంపుతోంది. మేం ఆహారం, అత్యవసర ఆశ్రయం, వైద్య సహాయంతో సహా మానవతా సహాయాన్ని కూడా అందిస్తున్నాం" అని చెప్పారు. "గల్లంతైన ఆస్ట్రేలియన్ల క్షేమాన్ని నిర్ధరించడానికి మేం అత్యవసరంగా కృషి చేస్తున్నందున, వరద బాధితుల ప్రియజనులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అంటూ పోస్ట్ చేశారు.
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన జలప్రళయానికి సంబంధించి ఆందోళన కలిగించే కారణాలు వెలుగులోకి వచ్చాయి. భూకంపం కారణంగా కాకుండా దాదాపు 5,200 మీటర్ల ఎత్తులోని భారీ గ్లేసియర్లు విరిగిపడటం వల్లే సునామీల వరదలు పోటెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విశ్లేషించిన శాటిలైట్ చిత్రాలు ఈ విపత్తు ఎలా జరిగిందో కళ్లకు కట్టాయి.
సహాయక చర్యల్లో యాపిల్ కంపెనీ
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో ప్రాణనష్టం జరగడం పట్ల యాపిల్ సీఈవో టిమ్ కుక్ విచారం వ్యక్తం చేశారు. "నేపాల్, టిబెట్‌లలో సంభవించిన విషాదకరమైన ఆకస్మిక వరదలు, కొండచరియల విపత్తుల వల్ల ప్రభావితమైన వారందరితో మా ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సహాయక, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతుగా యాపిల్ విరాళం అందిస్తోంది" అని ఆయన తెలిపారు.
అమెరికా, డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు
నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలు, కొండచరియల విపత్తుల నేపథ్యంలో, అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆ దేశానికి తమ మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. వాషింగ్టన్ 500,000 డాలర్ల సహాయాన్ని ప్రకటించగా, డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వైద్య సామగ్రిని పంపిస్తోంది.
భారీగా పెరిగిన మృతుల సంఖ్య
నేపాల్‌లో బుధవారం సంభవించిన విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. గురువారంనాటికి మరణాలు 392గా, గల్లంతైనవారు 1,468గా తేలారు. నేపాల్‌లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. ఇందులో తెలుగువారూ ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని తెలిపింది.

