ETV Bharat / international

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు- అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల ప్రయత్నం- కువైట్, బహ్రెయిన్ వైపు దూసుకొచ్చిన క్షిపణులను అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాల హెచ్చరిక

Iran Us War
Iran Us War (AP File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 6:56 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Us War : పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ మధ్య మళ్లీ యుద్ధం మెుదలైంది. ఇరుదేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లింది. కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తమ మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా ప్రకటించింది. అదే సమయంలో ఇరాన్‌కు చెందిన ఖేశ్మ్ దీవిపై రక్షణాత్మక ప్రతిదాడులు చేపట్టినట్లు వెల్లడించింది. దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు జారీ చేసింది.

కువైట్‌, బహ్రెయిన్‌లోని యూఎస్ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. కువైట్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున కువైట్‌పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్‌ సైన్యం వెల్లడించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయని కువైట్‌ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి.

ప్రజలకు హెచ్చరికలు జారీ
దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. నేలపై పడిన క్షిపణి అవశేషాలు, లోహపు ముక్కలు లేదా గుర్తు తెలియని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించింది. అవి ప్రమాదకరంగా ఉండే అవకాశమున్నందున వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దులజీజ్ అల్ ఒతైబీ ప్రజలు అత్యవసర సేవల హెల్ప్‌లైన్ 112కు సమాచారం అందించాలని కోరారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మకుండా అధికారిక వర్గాల సమాచారాన్నే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బహ్రెయిన్ ప్రభుత్వం కూడా అత్యవసర భద్రతా చర్యలను అమలు చేసింది. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు ప్రజలు ప్రశాంతంగా ఉండి సమీప సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికార యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అవసరమైన అన్ని రక్షణ చర్యలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.

అమెరికా ఎదురుదాడులు
ఇరాన్‌ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఎదురుదాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్‌లోని ఖేశ్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఖేశ్మ్ దీవిపై చేపట్టిన ప్రతిదాడులు పూర్తిగా రక్షణాత్మక చర్యలేనని, ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు మాత్రమే అవి నిర్వహించబడినట్లు పేర్కొంది. తమ సైనిక స్థావరాల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తలేదని స్పష్టం చేసింది. కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన రెండు ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. అమెరికా ఇటీవల పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఖేశ్మ్ దీవి పరిసరాల్లో చేపట్టిన చర్యలకు ప్రతీకారంగానే కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అమెరికా దూకుడు చర్యలకు సమాధానంగా తమ దాడులు జరిగాయని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ వెల్లడించింది.

ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల నెలకొన్న ప్రత్యక్ష సైనిక ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. వరుస క్షిపణి, డ్రోన్ దాడులు, వాటికి ప్రతిస్పందనగా జరుగుతున్న సైనిక చర్యలు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందన్న అంశంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌ నినో ముప్పు- యూఎన్​ వార్నింగ్​

'ఇరాన్ పూర్తిగా లొంగిపోయినా- అమెరికాపై టెహ్రాన్​దే విజయం అంటారు'- డెమొక్రాట్లు, మీడియాపై ట్రంప్ ఫైర్​