ETV Bharat / international

ఖమేనీది ఒక దారుణమైన హత్య- ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది: పుతిన్‌

అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించిన రష్యా- అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్‌ దాడి చేసిందని ఆగ్రహం

Russian President Vladimir Putin
Russian President Vladimir Putin (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 6:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Putin On Killing Of Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను రష్యా తీవ్రంగా ఖండించింది. ఖమేనీ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు తన ప్రగాఢ సంతాప సందేశాన్ని పంపించారు. ఖమేనీ మరణం ఒక దారుణమైన హత్య అని, ఇది మానవ నైతికతకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్‌ దాడి చేసిందని పుతిన్‌ మండిపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో శనివారం పుతిన్​ జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తమ పౌరుల భద్రత గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.

యూఏఈ విమానాశ్రమం మూత- ఇబ్బందుల్లో ప్రయాణికులు
దాడులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్, గల్ఫ్ దేశాలు తమ వైమానిక ప్రాంతాలను మూసివేసినట్లు ప్రకటించాయి. దీంతో మధ్యప్రాచ్యంలో దాదాపు 2 లక్షల మందికి పైగా రష్యన్లు చిక్కుకుపోయినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, ప్రతీకార దాడులతో రష్యా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యూఏఈ విమానాశ్రయం మూసివేయడంతో పర్యాటకులు, వ్యాపారవేత్తలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, డ్రోన్, క్షిపణి దాడులు యూఏఈలోని అత్యంత ప్రసిద్ధ హోటళ్లతో సహా కీలకమైన పర్యాటక ప్రదేశాలను తాకినట్లు తెలుస్తోంది.

ఇరాన్​పై దాడి- స్పందించిన న్యూయార్క్ నగర మేయర్
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులను న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్రంగా ఖండించారు. ఆ దాడులను చట్టవిరుద్ధమని అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో స్పందించారు.

"అమెరికా, ఇజ్రాయెల్​ సంయుక్తంగా ఇరాన్​పై దాడి చేశాయి. నగరాలపై బాంబు దాడి చేయడం, పౌరులను చంపడం, కొత్త యుద్ధం సృష్టించడం వంటివి అమెరికన్లు కోరుకోవడం లేదు. వారు పాలనాపరమైన మార్పు కోరుకుంటున్నారు కానీ, అందుకు మరొక యుద్ధాన్ని కోరుకోవడం లేదు. వారు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కోరుకుంటున్నారు. అలాగే వారు శాంతిని కోరుకుంటున్నారు" అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

అలాగే, న్యూయార్క్ వాసుల భద్రతపై తాను దృష్టి సారించానని మమ్దానీ పేర్కొన్నారు. ప్రతి న్యూయార్క్ వాసి సురక్షితంగా ఉండేలా చూసుకోవడంపై తాను దృష్టి సారించానన్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్, అత్యవసర భద్రతా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంచడం, సున్నితమైన ప్రదేశాల్లో మెరుగైన గస్తీతో సహా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు
మరోవైపు, ఈ పరిణామాల దృష్ట్యా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌సిసి కూడా స్పందించారు. ప్రస్తుత పరిణామాలతో పశ్చిమాసియా గందరగోళంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, తమ దేశంపైకి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు కువైట్‌, ఖతర్‌, బహ్రెయిన్‌లు వెల్లడించాయి. యూఏఈలోని అబుధాబీలో డ్రోన్‌ శకలాలు పడి ఓ మహిళ, ఆమె బిడ్డకు స్వల్ప గాయాలయ్యాయని వార్తా కథనాలు తెలిపాయి. గల్ఫ్ దేశాలపై దాడులతో ఇరాన్ తప్పుడు లక్ష్యాలను ఎంచుకుందని యూఏఈ అధ్యక్షుడి సలహాదారుడు అన్వర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, ఇరాన్​ దాడుల కారణంగా దుబాయ్​లో అత్యంత రద్దీగా ఉండే జబిల్​ అలీ పోర్టులో భారీ మంటలు ఎగిసిపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖ బుర్జ్​ అల్​ అరబ్​ హోటల్ దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో విమానాశ్రయంలోని పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అదేవిధంగా, ఇరాన్​ ప్రయోగించిన డ్రోన్​ శిథిలాలు పడడంతో బుర్జ్​ అల్​ అరబ్​ హోటల్​ ముందు భాగంలో మంటలు చెలరేగినట్లు పేర్కొంది.

ఇరాన్​ 'గుండెకాయ' లక్ష్యం​- టెహ్రాన్​పై ఇజ్రాయెల్ భీకరదాడులు

ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్​లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి