ట్రంప్‌నకు మరోసారి ఎదురుదెబ్బ- జన్మతః పౌరసత్వ ఆంక్షల ఆదేశాలు నిలిపివేసిన కోర్టు
'బర్త్ టూరిజం'ను అడ్డుకోవడంతో పాటు, అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై పరిమితులు- సుప్రీంకోర్టులోనూ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

Published : September 3, 2026 at 8:34 AM IST
US Court On Birthright Citizenship : జన్మతః పౌరసత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. అమెరికాలో జన్మించే విదేశీ వలసదారుల పిల్లలకు సహజంగా లభించే పౌరసత్వంపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల అమలును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. 'బర్త్ టూరిజం'ను అడ్డుకోవడంతో పాటు, అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించకుండా పరిమితులు తీసుకురావాలని ట్రంప్ ఇటీవల కొత్త ఉత్తర్వులపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఇదే అంశంపై ఇటీవల ట్రంప్‌నకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా పౌరసత్వ హక్కు కల్పించే రాజ్యాంగ నిబంధనలను ట్రంప్ పరిమితం చేయాలని ప్రయత్నించారు. అయితే ఆంక్షలపై న్యాయపరమైన వివాదం కొనసాగుతుండగా, ఆయన తీసుకొచ్చిన తాజా ఉత్తర్వులపైనా కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని నిరాకరించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాలకు మరోసారి అడ్డంకి ఏర్పడింది.
కొత్త విధానానికి కోర్టు బ్రేక్
వాషింగ్టన్ డిసి ఫెడరల్ కోర్టులో జరిగిన ఈ విచారణలో జడ్జి డెబోరా బోర్డ్‌మన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం గత వేసవిలో అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఈ తాజా ఉత్తర్వులు ఉన్నాయని, ఇవి రాజ్యాంగబద్ధంగా నిలబడే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ తీర్పులో కోర్టు ఒక వెసులుబాటు కూడా కల్పించింది. భవిష్యత్తులో విధానాల అమలుపై ఫెడరల్ ఏజెన్సీలు తమ అంతర్గత మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవడానికి మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఈ నిలుపుదల ఉత్తర్వులు ఈ కేసులో పిటిషనర్లుగా పోరాడుతున్న అర్హులైన వర్గానికి మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఉత్తర్వులను నిలిపివేయకపోతే, సుప్రీంకోర్టు గతంలో పౌరులుగా గుర్తించిన చిన్నారులు సైతం జన్మహక్కు పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ జడ్జిని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించడం గమనార్హం.
అమెరికాలో జన్మించే ప్రతి ఒక్కరికీ పౌరసత్వం కల్పించే 14వ సవరణ నిబంధనలను పరిమితం చేయాలన్నది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాల్లో అజెండాలో ప్రధానాంశంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల వలసదారుల హోదాతో సంబంధం లేకుండా అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ శిశువుకు పౌరసత్వం లభించే ఈ చట్టానికి పరిమితులు విధించాలని ట్రంప్ మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక వసలదారులపై కఠినంగా వ్యవహరిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై వచ్చి సంతానం కన్నట్లయితే, ఆ పిల్లలకు పౌరసత్వం ఇవ్వబోమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన యూఎస్ సుప్రీంకోర్టు ఈ ఏడాది వేసవిలో వాటిని కొట్టివేసింది. ఆ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఆగస్టులో మరో రూపంలో అదే కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కానప్పుడు, ఒకవేళ ఆ తల్లిదండ్రులలో ఎవరైనా 'శత్రు దేశ వలసదారులు' , 'విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు' లేదా చట్టవిరుద్ధమైన 'బర్త్ టూరిజం' కింద అమెరికాకు వచ్చినవారైతే, ఆ పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని నిరాకరించాలని నిబంధనల్లో చేర్చారు. తొలి ఉత్తర్వులతో పోలిస్తే పరిధిని తగ్గించినప్పటికీ, ఇది కూడా పరోక్షంగా 14వ సవరణను ఉల్లంఘించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
హర్మూజ్ పేరును 'ట్రంప్' జలసంధిగా మారుస్తాం- అది అమెరికా కంట్రోల్లోనే ఉంది : డొనాల్డ్ ట్రంప్
భారత్-ఇరాన్ వాణిజ్య ఒప్పందం జరుగుతుందని అనుకోవడం లేదు : అమెరికా

