ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు- భారతీయులకు అడ్వైజరీ జారీ
ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణమంత్రి- తమ దేశంలోని పౌరులను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ సైన్యం- యుద్ధ సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

Published : February 28, 2026 at 12:19 PM IST
Israel Attack Iran : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి ఈ దాడులు చేశాయి. ఆయా కార్యాలయాల సమీపంలోనే పేలుళ్లు జరిగాయి. ఈ దాడులు జరిగిన టైంలో కార్యాలయంలో ఖమేనీ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. అమెరికాతో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు.
ఇరాన్‌లో నిలిచిపోయిన మొబైల్ సేవలు
మరోవైపు టెహ్రాన్‌పై ఎటాక్ జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. ప్రస్తుతం టెహ్రాన్ నగరమంతటా సైరన్లు మోగుతున్నాయని, బాంబు పేలుడు శబ్దాలను విన్నామని తమ కథనాల్లో పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ వెంటనే గగనతలాన్ని మూసివేసింది. దీంతోపాటు తమ దేశంలో మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించింది.
Israel Defense Forces tweets, " in the last few minutes, sirens were sounded all throughout israel, with an advance instruction alert directly to cellular devices to stay within proximity to protected spaces. this is a proactive alert to prepare the public for the possibility of… pic.twitter.com/KWc1pDlFAo
— ANI (@ANI) February 28, 2026
ఇరాన్‌పై ఎటాక్ చేశాం : ఇజ్రాయెల్
తాము ఇరాన్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పులను తొలగించేందుకే ఈ ఎటాక్స్ చేశామని స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై తాము చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు.
In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times. Indian nationals are strongly advised to strictly adhere to the safety guidelines and instructions issued by the… pic.twitter.com/xFKQG2doTl
— ANI (@ANI) February 28, 2026
ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి
ఈనేపథ్యంలో యావత్ ఇజ్రాయెల్‌లో ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుందనే ఆందోళనలతో ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారు. అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. బంకర్లలో దాక్కోవాలి అంటూ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపుతోంది. వెంటనే ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుందా ? చేయదా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ దేశంపై దాడి జరిగితే, ఊరుకునేది లేదని బలంగా ప్రతిఘటిస్తామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ఈనేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడి తప్పక చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అడ్వైజరీ
ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పిలుపునిచ్చింది. అత్యంత అప్రమత్తంగా, ముందుజాగ్రత్త చర్యలతో వ్యవహరించాలని వారికి సూచించింది. ఇజ్రాయెల్ అధికార వర్గాలు, హోం ఫ్రంట్ కమాండ్ ఎప్పటికప్పుడు జారీచేసే భద్రతా మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని కోరింది.
ట్రంప్ టార్గెట్ : మార్చి 2 వియన్నా చర్చలు
ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలనే పట్టుదలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ అంశంపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఫిబ్రవరి 26 వరకు ఇరాన్, అమెరికా పరోక్ష చర్చలు జరిపాయి. ఈ చర్చలకు ఒమన్ దేశం మధ్యవర్తిత్వం వహించింది. ఇందులో ట్రంప్ ఆశించిన ఫలితమేదీ రాలేదు. ట్రంప్ సర్కారు పెట్టిన చాలా షరతులకు ఒప్పుకోవడానికి ఇరాన్ ససేమిరా చెప్పింది. దీంతో తదుపరి దశ చర్చలను మార్చి 2న ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిర్వహించాలని ఇరాన్, అమెరికా నిర్ణయించాయి. ఈనేపథ్యంలో ఇరాన్‌పై ఒత్తిడిని పెంచి, తన షరతులను అమల్లోకి తేవాలనే సంకల్పంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు. ఈక్రమంలో పశ్చిమాసియా ప్రాంతంలోని 19 సైనిక స్థావరాల్లో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు, యుద్ధ విమానాలను మోహరించారు. ఇరాన్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లోనూ భారీ యుద్ధ నౌకల మోహరింపును ట్రంప్ పూర్తి చేశారు. మార్చి 2వ తేదీకి మరో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. వియన్నాలో రెండోదశ చర్చలు మొదలయ్యేలోగా, దాడుల ద్వారా ఇరాన్‌పై ఒత్తిడిని పెంచాలనే వ్యూహంతో ట్రంప్ ఉన్నారు.

