'ఇరాన్ ప్రతినిధుల హత్యకు కుట్ర'- ఆ కథనాన్ని ఖండించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధుల గురించి న్యూయార్క్ టైమ్స్ నకిలీ కథనం ప్రచురించిందని పేర్కొన్న ఇజ్రాయెల్- ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం

Published : July 4, 2026 at 8:51 AM IST
Israeli PMO Rejects Threat Of Iranian : పాకిస్థాన్‌లో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా మీడియా కథనంలో పేర్కొనడాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఎప్పటిలాగే ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధుల గురించి న్యూయార్క్ టైమ్స్ నకిలీ కథనం ప్రచురించిందని పేర్కొంది. ఆ కథనం పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది. ఆ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చడానికి అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబఫ్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు అగ్రరాజ్య మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాదు, వారిపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నాయి. ఆ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను అమెరికా కోరినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ అధికారులపై హత్యాయత్నం జరిగితే శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయి, ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు భావించినట్లు వార్తలొచ్చాయి.
The Prime Minister’s Office:
— Prime Minister of Israel (@IsraeliPM) July 3, 2026
As usual, The New York Times' latest story about Israel and the Iranian negotiators is fake news.
A complete fabrication of reality.
అమెరికా- ఇజ్రాయెల్ మధ్య దూరం
ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఏకాభిప్రాయంతోనే ప్రారంభించినప్పటికీ, కొద్దిరోజులకు వివిధ అంశాల్లో వీరి మధ్య దూరం ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వం శాంతి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్‌లో తొలుత రెండువారాల పాటు కాల్పుల విరమణ జరిగింది. దానికి ఇజ్రాయెల్ అయిష్టంగానే ఓకే చెప్పింది. అంతేగాకుండా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తొందరపడుతోందనే ఆందోళనా ఇజ్రాయెల్‌లో వ్యక్తమైందని కథనాలు తెలిపాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, ఇజ్రాయెల్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ శిక్షకు అర్హుడని పేర్కొనడం, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు టెహ్రాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అగ్గి రాజేసింది. దీంతో, అమెరికా తన పెంపుడు శక్తులను అదుపులో ఉంచుకోవాలంటూ ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న దాడులు మొదలుపెట్టాయి. దాడుల సమయంలో ఇరాన్ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను ట్రంప్ సైన్యం లక్ష్యంగా చేసుకోగా, కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. దాడులు మొదలుపెట్టిన తొలి రోజే సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించారు. అనంతరం, ఇరాన్ ఉన్నతస్థాయి నేతలు అలీ లారిజానీ, కమాల్ ఖరాజీ మృతిచెందారు. వీరిద్దరితోనే అమెరికా చర్చలు జరపాలని భావించింది. ఆ తర్వాత చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న అరాగ్చీ, ఘాలిబఫ్‌లను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందని అమెరికా అనుమానించింది. వీరిద్దరూ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమైన తర్వాత యూఎస్ ఒత్తిడితో వారిని జాబితా నుంచి పక్కనపెట్టిందని సమాచారం.
టార్గెట్ లిస్ట్‌లో ఘాలిబఫ్
గతంలో కూడా, 2025 జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో, అనంతరం ఈ ఫిబ్రవరిలో ఘర్షణల సమయంలో ఘాలిబఫ్ చావు నుంచి తృటిలో తప్పించుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌తో చర్చల అనంతరం టెహ్రాన్‌కు బయల్దేరినప్పుడు ఆయన హత్యకు ప్లాన్ జరిగినట్లు సమాచారం. దాంతో పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇరాన్ ఎయిర్‌పోర్ట్ మషదలో ఆయన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని, అక్కడి నుంచి టెహ్రాన్‌కు రోడ్డు మార్గంలో చేరుకున్నారని ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఇక, అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ఇటీవల దోహాలో రెండు రోజుల పాటు పరోక్ష చర్చలు జరిపారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇక తదుపరి విడత చర్చలు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నిర్వహించనున్నట్లు ఖతార్ విదేశాంగ శాఖ పేర్కొంది. దోహాలో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ధ విరమణ ఒప్పందం అమలుకు సంబంధించిన అంశాల్లో కొంత పురోగతి వచ్చిందని ఖతార్ తెలిపింది.
'తీస్తా' ప్రాజెక్ట్ విషయంలో అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటాం: భారత్
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్- ఓట్లు, సీట్లు, విరాళాల దొంగతనంలో నిమగ్నమైంది: జైరాం రమేశ్

