ETV Bharat / international

ప్రపంచ భద్రతకు ఇరాన్‌పై దాడులు అవసరం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

మతం పేరుతో హింసను ఎగుమతి చేసే శక్తులను అరికట్టడం తప్పు కాదన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి- మానవాళిని రక్షించే చర్య అంటూ వ్యాఖ్య

Netanyahu
Netanyahu (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 9:30 AM IST

3 Min Read
Choose ETV Bharat

Netanyahu On US Israel Attacks : అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలకు పూర్తి మద్దతు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్‌పై జరుగుతున్న దాడులు ప్రపంచ భద్రత కోసం అవసరమని స్పష్టం చేశారు. మతం పేరుతో హింసను ఎగుమతి చేసే శక్తులను అరికట్టడం తప్పు కాదని, ఇది మానవాళిని రక్షించే చర్య అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

హింసను వ్యాప్తి చేస్తున్నారన్న నెతన్యాహు
ఈ మేరకు అమెరికా మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు కేవలం ఇజ్రాయెల్, అమెరికా దేశాల రక్షణకే కాకుండా స్వేచ్ఛా ప్రపంచం మొత్తాన్ని కాపాడేందుకు అవసరమని చెప్పారు. ఇరాన్ పాలకులు మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా హింసను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని!
ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాకు వ్యతిరేకంగా డెత్ టు అమెరికా అంటూ నినాదాలు ఇస్తోందని, వేలాది మంది అమెరికన్లను చంపిందని, అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులు చేసిందని ఆయన విమర్శించారు. అంతేకాక అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నాలకు కూడా ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ పాలక వ్యవస్థ ఉగ్రవాదాన్ని పెంచి ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని నెతన్యాహూ ఆరోపించారు.

ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచే నాయకత్వం ఆయనదే
ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నాయకత్వాన్ని నెతన్యాహు ప్రశంసించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు స్పష్టమైనవని, అవసరమైన చోట కఠిన చర్యలకు వెనుకాడరని అన్నారు. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచే నాయకత్వం ఆయనదేనని కొనియాడారు. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​ కూడా ఇరాన్‌పై చర్యల్ని సమర్థించారు. దేశ భద్రతే ప్రధానం కావడంతోనే ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు పొందకూడదనే లక్ష్యంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అమెరికా ఎదురుచూస్తున్న కీలక దశ ఇదే!
అమెరికా రక్షణ వ్యవహారాల మంత్రి పెటె హెగెత్సత్​ సైన్యానికి పంపిన వీడియో సందేశంలో ఇది చరిత్రాత్మక మలుపు అని అభివర్ణించారు. 1979 తర్వాత అమెరికా ఎదురుచూస్తున్న కీలక దశ ఇదేనని పేర్కొంటూ బలంతోనే శాంతి సాధ్యం అన్న నినాదాన్ని పునరుద్ఘాటించారు. ఇక అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్​ను కలిశారు. ఈ సమావేశం యూనిటైడ్ నేషన్స్​ సెక్యూరిటీ కౌన్సిల్​ సమావేశానికి ముందు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల మైత్రి బలంగా కొనసాగుతుందని డానన్ వెల్లడించారు.

పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా!
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ/రోరింగ్ లయన్ పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక కేంద్రాలు, అణు సంబంధిత మౌలిక సదుపాయాలు, నాయకత్వ స్థావరాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.

ఇరాన్ దాడుల ప్రభావం పలు దేశాలపై పడింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్​లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు యుద్ధం మరింత విస్తరించకుండా శాంతి చర్చలు ప్రారంభించాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఇరుపక్షాలూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. నెతన్యాహూ వ్యాఖ్యల ప్రకారం ఇది అంతులేని యుద్ధం కాదని, శాంతికి దారి తీసే గేట్వే అని చెప్పినా, ప్రస్తుత పరిస్థితులు మాత్రం మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలనే సూచిస్తున్నాయి.

అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి- ఆ దేశాలను విడిచి వెళ్లాలని పౌరులకు అగ్రరాజ్యం అడ్వైజరీ

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం- ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్