హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు- 31 మంది మృతి
రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి- ఇజ్రాయెల్‌పై దాడి చేసినట్లు హెజ్బొల్లా విభాగం ప్రకటించిన కొద్ది గంటలకే చర్యలు

Published : March 2, 2026 at 8:24 AM IST
|Updated : March 2, 2026 at 11:34 AM IST
Israel Attack Lebanon Hezbollah : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సోమవారం మరింత పెరిగాయి. లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతిచెందారు. మరో 149 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజధాని బీరుట్‌లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్, లెబనాన్‌పై ప్రతి దాడులకు దిగింది.
హెజ్బొల్లా నేతలపై లక్ష్యంగా దాడులు
లెబనాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) ఎక్స్‌లో వరుస పోస్టులు చేసింది. 'కొద్దిసేపటి క్రితం వైమానిక దళం బీరూట్ ప్రాంతంలో హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేపట్టాం. అదే సమయంలో, దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా చెందిన ఒక కీలక ఉగ్రవాదిని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని ఐఏఎఫ్ తెలిపింది. మరో పోస్ట్‌లో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి పలు డ్రోన్లు క్షిపణులు దూసుకొచ్చాయని ఐఏఎఫ్ తెలిపింది. వాటిలో కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడ్డాయని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో హెచ్చరిక సైరన్లు మోగించలేదని స్పష్టం చేసింది. ఎలాంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది.
Israel Defence Forces posts, " in response to projectile fire toward northern israel, the idf is striking hezbollah targets across lebanon. hezbollah is operating on behalf of the iranian regime, opening fire against the israeli civilians, and bringing ruin to lebanon. idf troops… pic.twitter.com/7IdMihXjl9
— Press Trust of India (@PTI_News) March 2, 2026
ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగింపు
మరోవైపు దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. లెబనాన్ అంతటా హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ రాష్ట్రానికి ముప్పు లేదా ఉత్తర ప్రాంత నివాసులకు హాని కలిగించడానికి అనుమతించదని పేర్కొంది. హెజ్‌బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని ప్రకటించింది. ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్‌లోని బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలకు హెచ్చరించింది.
Official account of IDF (@idfonline) posts, " idf launches another wave of strikes in lebanon the idf has now begun striking additional targets of the hezbollah terror organization in lebanon. among the targets struck are warehouses of combat equipment and additional… pic.twitter.com/ESHT9dJfGt
— Press Trust of India (@PTI_News) March 2, 2026
'ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతిస్పందనగా, లెబనాన్ అంతటా హెజ్బొల్లా లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా ఇరాన్ పాలన తరఫున పనిచేస్తూ, ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులు జరిపి లెబనాన్‌ను విధ్వంస దిశగా నడిపిస్తోంది. ఆపరేషన్ రోరింగ్ లయన్‌లో భాగంగా ఇలాంటి పరిస్థితులకు మా బలగాలు సిద్ధమయ్యాయి. అన్ని దిశలుగా జరిగే యుద్ధ పరిస్థితులకు సన్నద్ధంగా ఉన్నాం' అని ఐడీఎఫ్ పోస్టులో పేర్కొంది. లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగాలు జరిగిన తరువాత ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగినట్లు ధృవీకరించింది. పూర్తి వివరాలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించింది.
హెజ్‌బొల్లా విభాగం ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ దాడులకు దిగింది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులను ప్రయోగించినట్లు అల్ మనార్ నెట్వర్క్ తెలిపింది. సోమవారం తెల్లవారుజూమున ఈ విషయాన్ని వెల్లడించింది. హెజ్‌బొల్లా విభాగం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే దక్షిణ బీరుట్‌లోని అనేక గ్రామాలు సహా హెజ్‌బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ విరుచుకుపడింది. ఇంకా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతునే ఉన్నాయి.

