ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు సాధ్యమేనా? ఆ టాప్-5 లీడర్స్‌ను అమెరికా, ఇజ్రాయెల్ అంతం చేయగలవా?
అగ్రనేతలను అంతం చేసి అస్థిరతను సృష్టించే కుట్ర- ఫిబ్రవరి 28 దాడిలో ఖమేనీ, మరో ఐదుగురు మృతి- మరింత మంది కీలక నేతలు, సైనిక అధికారులను టార్గెట్ చేసే ఛాన్స్

Published : March 1, 2026 at 8:38 PM IST
Iran Regime Change : ఈ సారి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల లక్ష్యం పూర్తి భిన్నంగా ఉంది. 2025 సంవత్సరం జూన్ 13 నుంచి 24 మధ్య ఇరాన్‌పై చేసిన దాడుల లక్ష్యం ఆ దేశంలోని అణుకేంద్రాలను దెబ్బతీయడం. కానీ 2026 ఫిబ్రవరి 28న ఏకంగా ఇరాన్‌లోని ప్రభుత్వాన్ని పెకిలించే ప్లాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నగారాను మోగించాయి. అందుకే పక్కా సమాచారంతో తొలి దాడిని నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక నివాసంపై చేశాయి.
ఈ దాడి నుంచి ఖమేనీ, ఆయన సన్నిహితులు, ప్రభుత్వ పెద్దలు తప్పించుకోలేకపోయారు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చాలనే అమెరికా లక్ష్యానికి అడ్డుగా 10 మంది దిగ్గజ నేతలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఇప్పటికే వైమానిక దాడుల్లో చనిపోయారు. మిగతా ఐదుగురు ఇరాన్ కీలక నేతలు, సైనిక అధికారులనూ రాబోయే రోజుల్లో టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా వరుసపెట్టి అగ్రనేతలను చంపితే ఇరాన్‌లో ప్రభుత్వం మారిపోతుందా? అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు సిద్ధిస్తాయా? హిట్ లిస్టులో ఉన్న మిగతా ఇరాన్ దిగ్గజ నేతలు ఎవరు? ఈ కథనంలో చూద్దాం.
ఖమేనీ, మరో ఐదుగురు ముఖ్యుల మృతి!
శనివారం ఉదయం టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అధికారిక నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ ఆకస్మిక ఎటాక్‌లో ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదే, ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ మహ్మద్ పాక్పౌర్, ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ, ఆర్మీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ బాఘేరీ చనిపోయారు. వీరంతా ఖమేనీకి అత్యంత సన్నిహితులు. ఇరాన్ తరఫున సైనిక వ్యూహాల అమలులోనూ వీరిదే కీలక పాత్ర. అటువంటి వ్యక్తులంతా ఏకకాలంలో చనిపోవడం ఇరాన్‌కు పెద్ద నష్టం. ఇది పాలనాపరమైన సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌పైనా ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. కానీ ఆయనను ఇరాన్ ఆర్మీ వేగంగా సురక్షిత ప్రదేశానికి తరలించింది. పెజెష్కియాన్ మితవాదే అయినప్పటికీ, హిజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ ప్రభుత్వ సహకారాన్ని అందించడాన్ని సమర్థిస్తున్నారు. అందుకే ఆయన పేరునూ హిట్ లిస్టులో ఇజ్రాయెల్ చేర్చింది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌లపై పెజెష్కియాన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమేనీని చంపడం అంటే ముస్లింలపై యుద్ధాన్ని ప్రకటించినట్టే అని ఆయన అంటున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ నియామకం జరిగే వరకు, దేశాన్ని పాలించే తాత్కాలిక నాయకత్వ మండలిలో పెజెష్కియాన్ కూడా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా ఆయన మరింత కఠిన వైఖరిని తీసుకునే అవకాశం ఉంది.
అలీ లారిజాని
అలీ లారిజాని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి. ఆయన విదేశాంగ విధానం, భద్రతా నిర్ణయాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఖమేనీ సన్నిహితుల్లో లారిజాని ఒకరు. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటుపై మార్చి 1న ఉదయం ఆయనే ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజుల్లో ఖమేనీ ఆలోచనలను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌తో అమలు చేయించే దిశగా లారిజాని చొరవ చూపే అవకాశం ఉంది.
ముజ్తబా ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడే ముజ్తబా ఖమేనీ. ఈయనను రాజకీయ వారసుడిగా తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ అవకాశం దొరకకున్నా ఇరాన్ ప్రభుత్వంలో ముజ్తబా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఐఆర్‌జీసీ దళాల ఉన్నతాధికారులు, ఇరాన్ రాజకీయ వర్గాల్లో ఈయనకు పెద్దఎత్తున పరిచయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాజకీయ ప్రభావశీల శక్తిగా ముజ్తబా ఎదగొచ్చు.
అబ్బాస్ అరాగ్చి
అబ్బాస్ అరాగ్చి ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల తరుణంలో ఇరాన్ అంతర్జాతీయ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఈయనే ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా చేసిన ఆకస్మిక దాడులను అరాగ్చి తీవ్రంగా ఖండించారు. ఇక ఆ రెండుదేశాలను నమ్మలేమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్, అమెరికాలతో ఇరాన్‌కు మరింత గ్యాప్ పెరుగుతుందని ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది.
సాదిఖ్ లారిజాని
సాదిఖ్ లారిజాని ఇరాన్‌కు చెందిన ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్ అధిపతి. ఈ విభాగం ఇరాన్ సుప్రీం లీడరుకు, పార్లమెంటుకు వారధిగా పనిచేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ రేసులో ఈయన కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఖమేనీకి న్యాయపరమైన అంశాల్లో సాదిఖ్ లారిజాని సలహాలను ఇచ్చారు.
మహ్మద్ బఘర్ గాలిబాఫ్
మహ్మద్ బఘర్ గాలిబాఫ్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు సైనిక నేపథ్యం ఉంది. సైనిక అంశాలపైనా మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధకాల కమాండర్‌కు వాస్తవ డిప్యూటీగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌లో కొత్తగా ఎంపికయ్యే సుప్రీం లీడర్‌ను ఈయన ప్రభావితం చేయగలరు. ఖమేనీ భావజాలానికి అనుగుణంగా భావి నిర్ణయాలను తీసుకోవడంలో కీలక పాత్ర పోషించగలరు.
అగ్ర నేతలను చంపితే లక్ష్యం నెరవేరుతుందా?
ఈ లెక్కన ఇరాన్‌లో దివంగత సుప్రీం లీడర్ ఖమేనీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే నేతలు ఇంకా పెద్దసంఖ్యలోనే మిగిలి ఉన్నారు. మరెంతో మంది యువతరం రాజకీయ నాయకులూ ఖమేనీని ఫాలో అవుతున్నారు. ఇరాన్‌ను ఏకాకి చేసి, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వాళ్లంతా నెగెటివ్ కోణంలో చూసే అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే భావితరం ఇరాన్ రాజకీయ నాయకుల్లోనూ చాలామంది ఖమేనీ తరహా ఆలోచనా విధానంతోనే ముందుకు రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
దీన్నిబట్టి ఇజ్రాయెల్, అమెరికాలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం అగ్ర నేతలను చంపినంత మాత్రాన ఇరాన్‌లో ప్రభుత్వం మారిపోదని అవి గ్రహించాలి. ఇరాన్ అనేది వెనెజువెలా కాదని తెలుసుకోవాలి. ఇరాన్‌కు స్పష్టమైన సైద్దాంతికత ఉంది. కనీస స్థాయిలోనైనా దేశాన్ని రక్షించుకునే వ్యూహాలు ఉన్నాయి. రాజకీయ వారసత్వాన్ని ఎంపిక చేసే పకడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా, కేవలం నేతల అంతం ద్వారా ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్ 'గుండెకాయ' లక్ష్యం- టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు
తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? రేసులో ఉన్నదెవరు? నియామకం ఎలా జరుగుతుంది?

