అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం : ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై వార్తలు- ఖమేనీ చనిపోయినట్లు ప్రకటించిన టంప్- ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరానీయన్లకు పిలుపు

Published : February 28, 2026 at 9:16 PM IST
|Updated : March 1, 2026 at 6:54 AM IST
Trump On Khamenei Death : అమెరికా-ఇజ్రాయెల్ సేనలు జరిపిన మెరుపదాడిలో ఇరాన్ సుప్రం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు 'ది జెరూసలేం పోస్ట్' కథనం వెల్లడించింది. మరోవైపు ఖమేనీ మరణవార్తను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఖమేనీ హతమైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా 'ట్రూత్ సోషల్'లో పోస్టు పెట్టారు. అత్యున్నత స్థాయి నిఘా వ్యవస్థలు, అత్యాధునిక ట్రాకింగ్ పరికరాల సాయంతో ఖమేనీ కదలికలను కనిపెట్టినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఖమేనీ గానీ, అతనితో పాటు ఉన్న ఇతర నాయకులు గానీ తప్పించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది అతిపెద్ద అవకాశంగా ట్రంప్ పిలుపునిచ్చారు.
"చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఒకడైన ఖమేనీ మరణించాడు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ, అతని రౌడీ మూకల చేతిలో ప్రాణాలు కోల్పోయిన లేదా వికలాంగులైన గొప్ప అమెరికన్లకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలకు దక్కిన న్యాయం. అతను మా నిఘా వర్గాల నుంచి, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇజ్రాయెల్‌తో కలిసి మేము చేసిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీ, అతని అనుచరులు తప్పించుకోలేకపోయారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని ట్రంప్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
US President Donald J. Trump posts, " khamenei, one of the most evil people in history, is dead. this is not only justice for the people of iran, but for all great americans, and those people from many countries throughout the world, that have been killed or mutilated by khamenei… pic.twitter.com/JkUKxkKmQP
— ANI (@ANI) February 28, 2026
అలాగే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)తో పాటు ఇరాన్ సైన్యంపై కూడా ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఐఆర్‌జీసీ, సైన్యం, ఇతర భద్రతా, పోలీసు దళాలు ఇకపై తమతో పోరాడటానికి ఇష్టపడటం లేదన్నారు. ఇరాన్ దళాలు తమ నుంచి రక్షణ కోరుకుంటున్నాయని మాకు సమాచారం అందుతోందన్నారు. తాను నిన్న రాత్రి చెప్పినట్లుగానే, 'ఇప్పుడైతే మీకు రక్షణ లభిస్తుంది, ఆలస్యమైతే చావు తప్పదు' మరోసారి ట్రంప్ వారిని హెచ్చరించారు.
ఐఆర్‌జీసీ, పోలీసులు శాంతియుతంగా ఇరాన్ దేశభక్తులతో కలిసిపోయి, ఆ దేశానికి గొప్పతనాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక యూనిట్‌గా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యంలో, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలనే తమ లక్ష్యం నెరవేరే వరకు, ఈ దాడులు ఈ వారం అంతా లేదా అవసరమైనంత కాలం నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.
బలమైన సంకేతాలు ఉన్నాయ్: నెతన్యాహు వీడియో సందేశం
ఖమేనీ మరణంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఈమేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఖమేనీ మరణాన్ని నేరుగా ఆయన ధృవీకరించనప్పటికీ, దానికి బలమైన సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఖమేనీ నివాస కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైందని, ఈ దాడిలో రివల్యూషనరీ గార్డ్ కమాండర్లు, ఇరాన్ అణుశాస్త్రవేత్తలు కూడా హతమయ్యారు" అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అగ్రనేతలు, కీలక రక్షణ విభాగాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు నెతన్యాహు స్పష్టం చేశారు.
ఖమేనీ నివాసం నేలమట్టం
అమెరికా- ఇజ్రాయెల్ దళాలు ఖమేనీ అధికారిక నివాసం, కార్యాలయ సముదాయమే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున దాడులు చేసింది. ఏకంగా 30 భారీ బాంబులను ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. దాడి సమయంలో ఖమేనీ భూగర్భ బంకర్‌లో ఉన్నారని సమాచారం. అయితే, బాంబుల తీవ్రతకు ఆ బంకర్ కూడా తట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన 'బిఫోర్ అండ్ ఆఫ్టర్' శాటిలైట్ చిత్రాలు టెహ్రాన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌కు జరిగిన నష్టాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం శిథిలాల కుప్పగా మారింది.
ఇంకా ధృవీకరించని ఇరాన్
ఖమేనీ మరణవార్తను ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు, ఇరాన్ విదేశాంగ మంత్రి ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ "నాకు తెలిసినంత వరకు ఆయన బ్రతికే ఉన్నారు" అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖాయీ బీబీసీతో మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను దేనినీ ధృవీకరించలేను. దేశమంతా ఇప్పుడు జాతీయ సమగ్రతను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది’ అని ఆయన చెప్పడం గమనార్హం. ఇద్దరు నాయకులు ఖమేనీ మరణవార్తను ఖండించకపోవడంపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

