ETV Bharat / international

అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం- హర్మూజ్​పై మాకే పూర్తి అధికారం ఉంది : ఇరాన్​

తమ గగనతలంలోకి వచ్చిన అమెరికా డ్రోన్‌ను కూల్చేశామని ఐఆర్‌జీసీ ప్రకటన- హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ఇరాన్ హెచ్చరిక- నౌకలు, ట్యాంకర్లు ఇరాన్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం

US And Iran
US And Iran (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2026 at 8:48 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Vs US War : ఇరాన్- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఎంక్యూ-1 (MQ-1) డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.

ఇరాన్‌కు చెందిన ఓ వార్తా కథనం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ గగనతలంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించిందని ఐఆర్‌జీసీ పేర్కొంది. అయితే, డ్రోన్‌ను తమ నిఘా వ్యవస్థలు వెంటనే గుర్తించి, ఆధునిక క్షిపణి వ్యవస్థతో కూల్చివేశామని తెలిపింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ డ్రోన్ శత్రుత్వ కార్యకలాపాల కోసం తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఐఆర్‌జీసీ ఆరోపించింది. దేశ భద్రతను కాపాడటంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామని వెల్లడించింది. అయితే డ్రోన్ కూల్చివేతపై అమెరికా నుంచి తక్షణ అధికారిక స్పందన వెలువడలేదు.

'నిర్దేశిత మార్గాల్లోనే ఆ నౌకలు ప్రయాణించాలి'
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిపై అధికారాన్ని ఇరాన్ పునరుద్ఘాటించింది. తమ సాయుధ దళాల ఆధీనంలోనే హర్మూజ్ జలసంధి నిర్వహణ కొనసాగుతుందని ఇరాన్ సాయుధ దళాల ప్రధాన కార్యాలయం ప్రకటించింది. ఈ కీలక సముద్ర మార్గంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని ఐఆర్​జీసీ ఆదేశించింది. అంతేకాకుండా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే నౌకలు ప్రయాణించాలంటూ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించే ఏ చర్యైనా సముద్ర రవాణా భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న విదేశీ నౌకాదళాలకు కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల నిర్వహణకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది.

'తప్పనిసరి అనే పదానికి ఇరాన్ వీడ్కోలు పలికింది'
ఇక, అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా, ఇరాన్​ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకూడదని, అలాగే హర్మూజ్ జలసంధి పూర్తిగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా తెరవాలని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. భవిష్యత్ దౌత్య ఒప్పందాలకు ఇవే ప్రధాన షరతులని ఆయన చెప్పారు. అయితే అమెరికా షరతులను ఇరాన్ తిరస్కరించింది. "47 ఏళ్ల క్రితమే 'తప్పనిసరి' అనే పదానికి ఇరాన్ వీడ్కోలు పలికింది" అని ఇరాన్​ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, టెహ్రాన్ మైన్-క్లియరెన్స్ ఆపరేషన్లను చేపడుతుందని, టోల్స్ లేకుండా సాధారణ షిప్పింగ్ ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తుందని ట్రంప్​ పేర్కొన్నారు. అలాగే, సుసంపన్నమైన యురేనియం నిల్వలను నిర్మూలించడంలో సహాయపడుతుందని ఆయన నొక్కిచెప్పారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక చెల్లింపులు జరగబోవని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మీడియా మాత్రం ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. ఏదైనా దౌత్యపరమైన ముందడుగు వేయాలంటే ముందుగా 12 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోందని ఓ వార్తా సంస్థ పేర్కొంది. అలాగే హర్మూజ్ జలసంధిలో టోల్ రహిత రాకపోకలకు సంబంధించిన నిబంధన ఏ ఒప్పందంలోనూ లేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి మరింత దిగజారకుండా దౌత్యపరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా న్యాయవ్యవస్థ మోసపూరితంగా తయారైంది: ట్రంప్​

వలసదారుల్లో తీవ్ర ఆందోళన- గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా యూటర్న్