ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్- మరో ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నిక!
ఖమేనీ స్థానంలో నూతన నాయకత్వ మండలి- అధికారికంగా ప్రకటించిన ఇరాన్ అధ్యక్షుడు- అధికార శూన్యత ఏర్పడకుండా చర్యలు!

Published : March 1, 2026 at 7:48 PM IST
Iran New Leadership Council : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను మరో ఒకటి రెండు రోజుల్లో ఎన్నుకోనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఆదివారం ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ నాయకత్వంలో శూన్యత ఏర్పడకుండా ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
విధులు ప్రారంభించిన కొత్త నాయకత్వ మండలి
మరోవైపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో, ఇరాన్లో ఒక కొత్త నాయకత్వ మండలి తన విధులను ప్రారంభించింది. ఆదివారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఆ దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నూతన నాయకత్వ మండలిలో సభ్యులుగా ఉన్న ముగ్గురు కీలక అధికారులలో పెజెష్కియాన్ ఒకరు. మిగిలిన ఇద్దరు సభ్యులుగా ఇరాన్ న్యాయశాఖాధిపతి ఘోలం హుస్సేన్ మొహ్సేని ఎజేహీ, అయతుల్లా అలీ రెజ్ అరాఫీ బాధ్యతలు చేపట్టారు. ఖమేనీ మరణం తర్వాత దేశంలో అధికార శూన్యత ఏర్పడకుండా ఈ మండలి తక్షణమే పాలనాపరమైన చర్యలు చేపట్టింది. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పు అని చెప్పుకోవచ్చు.
పశ్చిమాసియాలో మారణహోమం
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌లోని బీట్ షెమెష్‌లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందగా దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు క్షిపణులను సమర్థంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పించుకుని పలు భవనాలను తగిలినట్టు తెలుస్తోంది. ఈ దాడుల కోసం ఇరాన్ తొలిసారి హైపర్ సోనిక్ క్షిపణిని వాడినట్టు సమాచారం. మరోవైపు 4 బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిపై నౌకలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.
ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా, దుబాయ్‌లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ దాడులపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఇరాన్ దాడి ప్రారంభమైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇప్పటివరకు 165 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు 541 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ తెలిపింది.
ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్- అమెరికా, ఇజ్రాయెల్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే దాడులను తీవ్రతరం చేసింది. మిడిల్‌ఈస్ట్‌లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్‌పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చిచెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్‌లలో సైరన్లు మోగుతున్నాయి.
చమురు ట్యాంకర్లపై దాడి
ఇరాన్ తన ప్రతీకార చర్యలను సముద్ర మార్గాలకు కూడా విస్తరించింది. తాజాగా ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి వద్ద ఒక చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పానికి సమీపంలో, ఖసాబ్ పోర్ట్ నుంచి కేవలం 5 నాటికల్ మైళ్ల దూరంలో పలావు దేశపు జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్‌పై ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో చమురు ట్యాంకర్‌లో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానియన్లు ఉన్నారు. సిబ్బంది అందరినీ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంఎస్ఈ విజయవంతంగా ఖాళీ చేయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, నలుగురు సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ నేవీ రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చాలా నౌకలు ఈ మార్గాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కీలక మార్గం మూసుకుపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.

