ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు- బరిలోకి హుతీలు కూడా- 30 క్షిపణులతో కౌంటర్ ఎటాక్!
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించిన ఇరాన్

Published : February 28, 2026 at 2:45 PM IST
Iran Attack On Israel : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగాయి. స్థానిక కాలమానం ప్రకారం, శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేయగా, ప్రతీగా ఇరాన్ కూడా స్పందించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు 30 క్షిపణులు దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణుల ప్రయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రయోగించి క్షిపణులను గుర్తించామని, వాటిలో చాలా వాటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.
మరోవైపు ఇరాన్ మద్దతుగల హుతీలు ఇజ్రాయెల్‌పై, నౌక మార్గాలపై తిరిగి క్షిపణి, డ్రోన్ దాడులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హుతీ నాయకత్వానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి నుంచే దాడులు జరగవచ్చని తెలిపారు. అయితే దీని గురించి హుతీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్ర సముద్రంలో వెళ్లే నౌకలపై దాడులను నిలిపారు. గాజా వ్యవహారంలో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై కూడా దాడులు చేయడం ఆపారు. మళ్లీ ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఎర్రసముద్రం నౌక మార్గాల్లో తిరిగి తమ దాడులను ప్రారంభించాలని హుతీలు భావిస్తున్నారు.

