ETV Bharat / international

40 క్షిపణులు, 230 డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై IRGC భీకర దాడులు

అమెరికా, ఇజ్రాయెల్​పై IRGC 17వ విడత దాడులు - అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడి

IRGC On Hormuz Strait
IRGC On Hormuz Strait (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 1:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

IRGC On Hormuz Strait : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్​జీసీ) బుధవారం దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై 17వ విడత దాడులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్ని 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4' గా ఇరాన్ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ ఇంధన జీవనాడి హర్మూజ్​పై కూడా కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిలో చమురు నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్​నకు ఐఆర్​జీసీ కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకు ఉన్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ​ప్రకటించింది. అంతేకాకుండా ఈ జలసంధి నుంచి ఏమైనా నౌకలు ప్రయాణిస్తే ధ్వంసం చేస్తామని హెచ్చిరించింది. ఐఆర్​జీసీ ఈ ప్రకటనతో ట్రంప్​నకు కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.

'అమెరికా యుద్ధనౌకపై దాడి చేశాం'
హిందూ మహాసముద్రంలో ఒక అమెరికన్ యుద్ధనౌకపై దాడి జరిపినట్లు ఐఆర్​జీసీ తెలిపింది. దాడి సమయంలో ఒక అమెరికన్ ట్యాంకర్ నుంచి ఇంధనం నింపుకుంటోందని, ఈ దాడి కారణంగా రెండు నౌకలలోనూ మంటలు చెలరేగినట్లు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల్లోని అనేక సున్నిత, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేశామని, అలాగే ఖతార్, యూఏఈ, కువైట్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు నిర్వహించామని తెలిపింది. కువైట్, ఖతార్ , ఇరాక్​లోని అగ్రరాజ్య స్థావరాలపై 230 డ్రోన్లతో దాడులు తెలిపింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా 40 క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. ఇక ఇరాన్ చేసిన దాడుల్లో గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు.

680 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు: ఐఆర్‌జీసీ
ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడిలో 680మందికిపైగా అమెరికన్ సైనికులు చనిపోయారని తమ నిఘా వర్గాలు తెలిపాయని ఐర్​జీసీ తెలిపింది. బహ్రెయిన్‌లోని ఒక కీలకమైన అమెరికా వైమానిక స్థావరం ఈ దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్నదని, అక్కడి కమాండ్ సెంటర్లు ధ్వంసం కావడంతో ఆ బేస్ ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుందని ఇరాన్ స్పష్టం చేసింది.

దాడులు ఆపే ఉద్దేశం లేదు : యూఎస్ సెంట్రల్ కమాండ్
మరోవైపు అమెరికా కూడా ఈ దాడులను ఆపే ఉద్దేశం లేదని యూఎస్ కమాండ్ ఆడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌లో నిరంతరం దాడులు నిర్వహించాయని చెప్పారు. ,

'మా బీ-2, బీ-1 బాంబర్లు ఇరాన్‌లోని పలు క్షిపణి కేంద్రాలపై కచ్చితమైన దాడులు జరిపాయి. గత రాత్రి బీ-52 బాంబర్ దళం బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులపై దాడి చేసింది. ఇప్పటివరకు 17 ఇరానీ నౌకలను ధ్వంసం చేశాం. అరేబియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క ఇరానీ నౌక కూడా సముద్రయానంలో లేదు. మేం ఇరాన్ మిగిలిన మొబైల్ బాలిస్టిక్ లాంచర్లను వెంబడిస్తున్నాం. ఇరాన్ ఇప్పటికే 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఇరాన్ ప్రతిదాడి సామర్థ్యం క్షీణిస్తోంది. మా సైనిక శక్తి పెరుగుతోంది' అన్నారు.

ఐదో రోజుకు చేరిన ఘర్షణ
అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా పలువురు కీలక నేతలు మరణించారు. ఆ తర్వాత ప్రారంభమైన పశ్చిమాసియా ఘర్షణ ఐదో రోజుకు చేరింది. ప్రతీకారంగా టెహ్రాన్ అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ ఆస్తులపై ప్రాంతవ్యాప్తంగా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయెల్- అమెరికా కూడా దాడులను కొనసాగిస్తూనే ఉంది.