ETV Bharat / international

'ట్రంప్‌ను సంతోషపరిచేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారు'-​ సుప్రీం ఖమేనీ ప్రసంగం

ఇరాన్​లో ఆందోళనలు ఉద్ధృతం- 45మంది మృతి- ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం ఇంటర్‌నెట్‌, టెలిఫోన్‌ సేవలు బంద్​

iran supreme speech
iran supreme speech (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 4:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Supreme Leader Khamenei Speech : ఇరాన్‌వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సంతోషపరిచేందుకు ఆందోళనకారులు తమ సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు ఆందోళనలు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాయో ఖమేనీ ప్రసంగంతో వెల్లడైంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం ఇంటర్‌నెట్‌, టెలిఫోన్‌ సేవలను నిలిపివేసింది. ఇరాన్‌ బహిష్కృత యువరాజు పిలుపు మేరకు గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఉగ్రవాద ఏజెంట్లు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతోపాటు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఇరాన్‌ అధికారిక టీవీ ఛానల్‌ పేర్కొంది. ఈ ఘటనల్లో కొంతమంది చనిపోయినట్లు తెలిపింది.

ప్రభుత్వ వాహనాలు దహనం
మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ప్రస్తుత పాలనకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. గత వారం రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ఈ ఆందోళనల్లో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. అమెరికాలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావి పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు.

45మంది మృతి- 2వేల 270 మందికి గాయాలు
ఈ క్రమంలో ఇస్ఫాహాన్‌లోని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. కొన్నిచోట్ల రోడ్లను నిర్బంధించారు. ఈ నిరసనల్లో ఓ మహిళ నోటి నుంచి రక్తం కారుతున్నా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇరానియన్- అమెరికన్‌ జర్నలిస్ట్‌ మాసిహ్‌ అలీనేజాద్‌ ఈ వీడియోను పంచుకున్నారు. ప్రభుత్వానికి తాను భయపడనని గత 47 ఏళ్లుగా జీవచ్ఛవంలా బతుకుతున్నట్లు మహిళ ఆ వీడియోలో చెబుతున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 45 మంది ప్రాణాలు కోల్పోగా 2వేల 270 మందికి పైగా నిరసనకారులను భద్రతాధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌, అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను నిలిపివేసింది.

ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాలకు నిప్పు
తమ భవనంపై జరిగిన దాడిపై ఇరాన్‌ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఉగ్రవాదులు తమ భవనానికి నిప్పంటించారని ఆరోపించింది. నిరసనకారులను వారే రెచ్చగొడుతున్నారని ఆక్షేపించింది. ఆందోళనల్లో ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారని మండిపడింది. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పతనం కావడంతో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ర్యాలీల్లో ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
అంతకుముందు ఈ అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. ఆందోళనలు అణిచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరాన్‌లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం సాధారణమన్న ట్రంప్‌, ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుంటామన్నారు. ఈ ఆందోళనలు కారణంగా సంభవించిన మరణాలను ప్రస్తావించిన ట్రంప్‌, అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. ఇందుకు ఎవరినీ బాధ్యులను చేయలేమని వెల్లడించారు.