అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో కుటుంబ సభ్యులతో సహా ఖమేనీ మృతి : ధ్రువీకరించిన ఇరాన్
ఇజ్రాయెల్- అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్ల వెల్లడించిన ఇరాన్

Published : March 1, 2026 at 7:10 AM IST
Iran on Khamenei Death: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఈ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆయనతో పాటు కుటుం సభ్యులు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్లు ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఖమేనీ టార్గెట్‌తోనే దాడి
ఇజ్రాయెల్, అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్లుగా సమాచారం. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి సంయుక్త దాడులకు దిగినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిదని ఇరాన్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఆయన మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్, నెతన్యాహు చూశారని వెల్లడించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహ్మద్ పక్పూర్ కూడా మరణించినట్లు సమాచారం.
'ఖమేనీ మృతికి సమాధానం చెబుతాం'
ఖమేనీని అమరవీరుడిగా ఇరాన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఇరాన్ గొప్పనాయకుడు, పండితుడిని కోల్పోయినట్లు పేర్కొంది. ఖమేనీ హత్య, నిరంకుశులపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది. ఈ పెద్ద నేరానికి సమాధానం చెప్పకుండా వదలబోమని ఇరాన్ క్యాబినెట్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రాఛ్యంలో ఇరాన్‌ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. 1989లో ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాటకీయంగా మార్చేశారు. షియా ముస్లిం మతాధికారుల పాలనను పరిపుష్టం చేశారు. పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ను తన పాలనకు ఆధారమైన అతి ముఖ్యమైన సంస్థగా నిర్మించారు.
కొనసాగుతున్న భీకర యుద్ధం
ఆపరేషన్ తొలిరోజే ఖమేనీ మృతిచెందినప్పటికీ పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్ అంతటా యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతానికి భిన్నంగా ఈసారి పగటి వెలుగులోనే అమెరికా దాడులకు దిగింది.
శనివారం ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయమే లక్ష్యంగా దాడులు చేశాయి. అయితే ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేరని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై పోరాటాన్ని ప్రారంభించామని పేర్కొనగా, పెంటగాన్ దీనికి 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది. మరోవైపు ఇరాన్ నుంచి ఎదురవుతున్న అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తాము దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
40 మంది విద్యార్థులు మృతి!
మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో 86 మంది విద్యార్థులు మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ నగరంలో ఈ దాడి జరిగిందని ఐఆర్ఎన్ఏ పేర్కంది. వాస్తవానికి ఈ సిటీలో ఇరాన్ పారామిలిటరీ లివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఒక స్థావరం ఉంది. టెహ్రాన్‌లోని నిఘా కార్యాలయం సమీపంలో మూడు పేలుళ్లు సంభవించాయి. 200 యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని 500 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇరాన్ ప్రతీకార దాడులు
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్‌పై 200కుపైగా డ్రోన్లు, క్షిపణులు దూసుకెళ్లాయి. అందులో 35 ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ దాడుల్లో 94 మందికి.. గాయాలయ్యాయి. తర్వాత బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడుల చేసింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్, యూఏఈ, ఇరాక్‌తో పాటు పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఖతార్, యూఏఈ, ఇజ్రాయెల్‌లలోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.

