కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ భీకర దాడి- భారతీయుడు మృతి
పశ్చిమాసియాలో మళ్లీ మెుదలైన యుద్ధం- ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా- దాడుల్లో భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడి- దాడులను తీవ్రంగా ఖండించిన భారత్

Published : June 3, 2026 at 7:05 PM IST
Iranian Drone Attack Kuwait Airport : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.
Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…
— India in Kuwait (@indembkwt) June 3, 2026
MEA says - " we condemn the attack on the kuwait international airport today in which an indian national has died and several of our nationals are injured. since the onset of the conflict in west asia, we have strongly urged that civilian population and civilian infrastructure… pic.twitter.com/gjkYmG7d9J
— ANI (@ANI) June 3, 2026
Our statement on the attack on Kuwait International Airport ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) June 3, 2026
🔗 https://t.co/VIT2uy96YX pic.twitter.com/SBce0RNmTe
దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
మరోవైపు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా జరిగే దాడులను విరమించుకోవాలని తెలిపింది. "కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. ఈ దాడిలో ఒక భారత జాతీయుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియాలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి, పౌర జనాభాను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి దాడులను విరమించుకోవాలని మేము సంబంధిత పక్షాలకు మరోసారి పిలుపునిస్తున్నాం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.
మరోవైపు, కువైట్, బహ్రెయిన్‌లోని US స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.
తీవ్రంగా దెబ్బతిన్న కువైట్ విమానాశ్రయ ఆస్తులు
ఇక, కువైట్‌పై ఇరాన్ జరిపిన దాడిలో విమానాశ్రయ ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశామన్నారు. అనంతరం 4వ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించామని చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గెరుక్, ఖేష్మ్ ద్వీపంపై శని, ఆదివారాల్లో అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్‌లోని అల్ సలేమ్ వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా చర్యల వల్ల హర్మూజ్ జలసంధి భద్రతకు భంగం కలిగితే అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రతీకార దాడులు అమెరికాకు ఓ గుణపాఠం కావాలని పేర్కొంది.
అమెరికా దాడులకు ప్రతీకారంగానే
తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహ్రాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ ప్రకటించింది. అటు ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని అమెరికా తెలిపింది. ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్‌లోని ఓ సైనిక స్థావరంపైనా దాడులు చేసినట్లు పేర్కొంది. అయితే అది ఏ ప్రాంతంలో అనేది మాత్రం వెల్లడించలేదు.
ఫీజు పెంచినా H-1Bకి తగ్గని డిమాండ్ - ఏడాదిలోనే 2 లక్షల దరఖాస్తులు
భారత్‌తో సహా 60 దేశాలపై అమెరికా ఆంక్షలు- 12శాతం అదనపు సుంకాలకు ప్లాన్- కారణమిదే!

