'త్వరలో చూస్తారు'- అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్- సరికొత్త వ్యూహంతో భారీ దాడులకు సిద్ధం
అమెరికాతో యుద్ధంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తామని హెచ్చరించిన ఇరాన్- సమీప దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు వెల్లడించిన IRGC- ఇరాన్ ప్రతిదాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న ట్రంప్

Published : September 2, 2026 at 8:57 PM IST
US Iran War అమెరికా- ఇరాన్ మధ్య 6 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవల రెండు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. అమెరికాను దెబ్బతీసేందుకు తాము త్వరలోనే ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. యుద్ధ రంగంలో, దౌత్యంలో అలాగే ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ అనుసరించబోయే సరికొత్త వ్యూహం అమెరికా పునాదుల్ని కదిలిస్తుందని ఆయన తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పష్టం చేశారు. ఇరాన్ త్వరలోనే తమ కొత్త వ్యూహాన్ని చూపిస్తుందని అన్నారు.
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
తాజా ఉద్రిక్తతల మధ్య ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC) అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు ప్రకటించింది. జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, బహ్రెయిన్ సహా ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు టెహ్రాన్ పేర్కొంది. అమెరికా దాడుల్లో సుమారు 18 మంది మరణించినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ బలగాలు జోర్డాన్, యూఏఈలోని అమెరికా సైనికులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాక్‌లోని ఎర్బిల్‌లో అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. జోర్డాన్‌లోని అమెరికా మెరైన్ శిక్షణా శిబిరంపై కూడా దాడి చేసినట్లు ప్రకటించాయి.
با این دست و پا زدنها، نه تنها از قعر جهنمی که برای خود ساختهاید بیرون نخواهید آمد، بلکه به زودی خواهید دید راهبرد جدید ایران در میدان جنگ، دیپلماسی و مقابله با محاصره اقتصادی، بنیانتان را درهم خواهد شکست.
— محسن رضایی (@ir_rezaee) September 2, 2026
కువైట్, బహ్రెయిన్‌లో హై అలర్ట్
ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్‌లో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు వినిపించాయి. కువైట్ అధికారుల ప్రకారం- ఇరాన్‌కు చెందిన డ్రోన్ ఒక రెసిడెన్షియల్ హౌస్‌లో మంటలకు కారణమైంది. ఇదే సమయంలో రెండు చమురు ట్యాంకర్లను కూడా ప్రొజెక్టైల్స్ తాకాయి. అయితే ఈ దాడులకు మాత్రం ఎవరు బాధ్యలన్నది వెంటనే తెలియలేదు. ఒక ట్యాంకర్ ఘటనలో ఇక్కడ ఇద్దరు ఫిలిప్పీన్స్ నావికులు మరణించినట్లు సౌదీ అరేబియా నేషనల్ షిప్పింగ్ సంస్థ తెలిపింది.
దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ నగరంలో పెళ్లి వేడుక జరుగుతున్న ప్రాంతంపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి అమెరికానే కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిని యుద్ధనేరంగా అభివర్ణించింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రకారం- ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా నలుగురు మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. పెళ్లి వేడుక జరిగిన ప్రాంతంలో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వానికి చెందిన సంస్థ ఒకటి ప్రసారం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ దాడిని అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా విమర్శించారు. అయితే పెళ్లి వేదికపై జరిగిన దాడిపై అమెరికా సైన్యం నేరుగా స్పందించలేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ మాత్రం అమెరికా సైన్యం పౌరులను ఎన్నడూ లక్ష్యంగా చేసుకోదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ యుద్ధంలో హర్మూజ్ జలసంధి కీలకంగా మారింది. ఇరాన్ ఈ ప్రాంతంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని, అమెరికా సిబ్బందిపై దాడులు చేసిందని వాషింగ్టన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే ఆదివారం ఇరాన్‌ను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య వరుస దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి.
ట్రంప్ వార్నింగ్- పెజెష్కియాన్ మాత్రం దౌత్య పరిష్కారానికి ఓకే!
ఇరాన్ మరిన్ని ప్రతిదాడులకు పాల్పడితే అమెరికా మరింత భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే- 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్' లో చాలా తక్కువే మిగులుతుంది' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం దౌత్య పరిష్కారానికి అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఘర్షణను ముగించేందుకు అమెరికా దౌత్యపరమైన ఒప్పందానికి ముందుకొస్తే ఇరాన్ కూడా దానికి స్పందిస్తుందని తెలిపారు. దీంతో ఒకవైపు పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు దౌత్య చర్చల ద్వారా 6 నెలలుగా కొనసాగుతున్న ఇరాన్- అమెరికా ఘర్షణకు ముగింపు పలికే అవకాశం ఇంకా ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకపడిన అమెరికా- అతిపెద్ద దాడి ముందుందని ట్రంప్ వార్నింగ్
పూర్తిగా దెబ్బతిన్న ఇరాన్‌పై అణ్వాయుధం వాడాల్సిన అవసరం లేదు : డొనాల్డ్ ట్రంప్

