హర్ముజ్ తెరుచుకునే దిశగా కీలక అడుగు- తుది దశలో 'ఇరాన్-ఒమన్' ఒప్పందం
హర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ఒమన్‌తో చర్చలు చివరి దశలో ఉన్నాయని ఇరాన్ వెల్లడి- ఇరాన్ షరతులకు అమెరికా అడ్డుకాకపోతే సంయుక్త ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం- ఖమేనీ తుది ఆమోదంతో ఒప్పందంపై స్పష్టత

Published : August 6, 2026 at 7:29 AM IST
Iran On Hormuz Deal : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ తిరిగి తెరుచుకునే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ జలసంధి పునఃప్రారంభానికి సంబంధించి ఒమన్‌తో జరుగుతున్న ముసాయిదా ఒప్పందం తుది దశకు చేరిందని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ఈ వారంలోనే హర్ముజ్ పునఃప్రారంభంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తెలిపారు. ఈ పరిణామంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య రంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఒమాన్‌తో ఒప్పంద ముసాయిదా చివరి దశలో ఉందన్నారు. కొన్ని వర్గాలు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించకపోతే త్వరలోనే ఉమ్మడి ప్రకటన వెలువడుతుందని తెలిపారు. అయితే ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ కోరుతోంది. కానీ హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు శాశ్వత ఆధిపత్యాన్ని కల్పించే ఒప్పందాన్ని అమెరికా గతంలోనే తిరస్కరించింది. యుద్ధానికి ముందు మాదిరిగా ఈ జలసంధిని పూర్తిగా అంతర్జాతీయ జలమార్గంగా మార్చే ప్రతిపాదనను కూడా ఇరాన్ వ్యతిరేకిస్తోంది. జలసంధిపై తమకు కొంత మేర నియంత్రణ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది.
ఖమేనీ ఆమోదం కోసం ఎదురుచూపులు
ప్రాంతీయ అధికారుల సమాచారం ప్రకారం, ఇరాన్, ఒమాన్ ప్రతినిధులు ఒప్పంద ముసాయిదాను ఖరారు చేశారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఒప్పందాన్ని తాత్కాలిక పరిష్కారంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. జూన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చల ఆధారంగా ఈ ముసాయిదా రూపొందించినప్పటికీ, అప్పటి ఒప్పందం అమల్లోకి రాలేదని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ నియంత్రణలోని సముద్ర మార్గాన్ని వినియోగిస్తాయి. బయటకు వెళ్లే సమయంలో ఒమన్ ఆధీనంలోని మార్గాన్ని ఉపయోగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే భద్రతా ఏర్పాట్లు, సముద్ర పర్యావరణ పరిరక్షణ పేరుతో నౌకల నుంచి సేవా రుసుము వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80 డాలర్ల
హర్ముజ్ జలసంధికి సంబంధించిన కీలక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు రోజుల్లో ఎప్పుడైనా కావొచ్చని, ఈ అంశంలో గణనీయమైన పురోగతి సాధించమని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తొలుత తగ్గి, అనంతరం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక మార్గంగా ఉంది. ఒకప్పుడు ప్రపంచంలో వాణిజ్యపరంగా రవాణా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా వెళ్లేది. యుద్ధం, నౌకలపై దాడుల కారణంగా రవాణా దాదాపు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు, ఇంధన ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలపై కూడా దీని ప్రభావం పడింది. తాజా ఒప్పందం కుదిరితే జలసంధిలో రాకపోకలు పునరుద్ధరై ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభించే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా- ఇరాన్ అణు చర్చలకు కూడా కొత్త ఊపిరి లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో కుదిరిన తాత్కాలిక అవగాహన అమలు కాకపోయినా, తాజా ఒప్పందం ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలకు మార్గం సుగమం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అణ్వాయుధాల విషయంలో తగ్గేదేలే- అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్నంత వరకు తయారు చేస్తాం: ఇరాన్
వెనెజువెలాలో చేసినట్లే ఇరాన్‌లో చేస్తున్నాం- ఒప్పందానికే అమెరికా మొగ్గు : డొనాల్డ్ ట్రంప్

