ETV Bharat / international

అమెరికా, ఇజ్రాయెల్​ దాడులు- ఇరాన్​లో 555 మంది మృతి- నతాంజ్‌ యురేనియం శుద్ధి కేంద్రంపై దాడి?

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు- దెబ్బతిన్న నివాస భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులు-

Iran Death Toll
Iran Death Toll (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 3:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Death Toll : ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ సంయుక్త వైమానిక దాడులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 555 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 131 నగరాలు దాడులకు గురయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

సంయుక్తంగా అమెరికా, ఇజ్రాయెల్​ బలగాలు ఇరాన్‌లో కీలక సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరుపుతున్నాయని సమాచారం. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో కువైట్‌లోని అమెరికా రాయబారి కార్యాలయ సముదాయంపై కూడా క్షిపణి దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నతాంజ్‌ యురేనియం శుద్ధి కేంద్రంపై దాడి?
అయితే తమ దేశంలో అణు కార్యక్రమానికి కేంద్రంగా భావించే నతాంజ్‌ యురేనియం శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ఇరాన్‌ ఆరోపించింది. ఆ విషయాన్ని అంతర్జాతీయ అణు సంస్థకు ఇరాన్‌ రాయబారి రెజా నజాఫీ (Reza Najafi) తెలిపారు. "శాంతియుత అణు కేంద్రాలపై అమెరికా–ఇజ్రాయెల్‌ అక్రమ దాడులు జరుపుతున్నాయి. అణ్వస్త్రాలు తయారు చేస్తున్నామని చెప్పడం పూర్తిగా అబద్ధం" అని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి గురైన కేంద్రంగా నతాంజ్ ఇన్​రిచ్​మెంట్​ ఫెసిలిటీగా స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున ప్రజలను తరలించాల్సి వచ్చే ప్రమాదం
అయితే, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఇప్పటివరకు అణు కేంద్రాలకు నష్టం జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ మాట్లాడుతూ, "ఏ అణు స్థావరానికీ దెబ్బ తగిలిందనే నిర్ధారణ లేదు. సరిహద్దు దేశాల్లో రేడియేషన్‌ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయి" అని చెప్పారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రేడియేషన్‌ లీకేజీ జరిగితే పెద్ద ఎత్తున ప్రజలను తరలించాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

యుద్ధం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రాంతీయంగా విస్తరిస్తోంది. దక్షిణ లెబనాన్​లో కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ కనీసం 31 మంది మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం ఇంకా ఎన్నో రోజులపాటు యుద్ధం కొనసాగొచ్చని హెచ్చరించింది. అమెరికా బలగాలు కూడా ఈ యుద్ధంలో నేరుగా పాల్గొంటున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, తాజా ఘర్షణల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఈ ఆపరేషన్‌ను ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సైనిక చర్యల్లో ఒకటిగా అభివర్ణించారు. లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్‌ మాత్రం చర్చలకు తావులేదని ప్రకటించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రకటనలతో దౌత్యపరమైన పరిష్కారం దూరమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది. సూయిజ్ కెనాల్​ మార్గంలో నౌకాయానాన్ని కొన్ని సంస్థలు నిలిపివేశాయి. పలు పశ్చిమాసియా దేశాల్లో గగనతలాన్ని మూసివేయడంతో వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన స్ట్రయిట్ ఆఫ్ హార్మూజ్​ వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ఆయిల్‌ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే, అమెరికా– ఇజ్రాయెల్‌ దాడులు, ఇరాన్‌ ప్రతీకార చర్యలు, ప్రాంతీయ మిలీషియా దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ప్రాణనష్టం పెరుగుతుండగా, అణు కేంద్రాల భద్రతపై ప్రపంచం ఆందోళన చెందుతోంది. తక్షణమే దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం- కువైట్‌లో కూలిన ఎఫ్-15, యూఎస్ ఎంబసీపై ఎటాక్​

బీ-2 బాంబర్స్, సూసైడ్ డ్రోన్స్ - ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ఇంకా ఆయుధాలు వాడిందంటే!