ఖమేనీ తర్వాత కౌన్సిల్ చేతిలోకి ఇరాన్ పగ్గాలు- ముగ్గురు సభ్యులకు తాత్కాలిక బాధ్యతలు
ఇరాన్లో మారిన పాలన పగ్గాలు- సుప్రీం లీడర్ చేతి నుంచి కౌన్సిల్‌కు

Published : March 1, 2026 at 10:27 AM IST
Iran Administration After Kamenei Death : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో పాలన పగ్గాలు మారాయి. సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్‌కు మారింది. అందుకోసం తాత్కాలికంగా ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇందులో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, న్యాయవ్యవస్థ అధిపతి హొస్సేన్ మొహ్‌సెని ఎజెయ్, గార్డియన్ కౌన్సిల్ నుంచి ఒకరు ఉండనున్నారు. కొత్త సుప్రీం నేతను నియమించేవరకు ఈ కౌన్సిల్ తాత్కాలికంగా పాలనా బాధ్యతలను చూసుకోనుంది.
సుప్రీం లీడర్ ఎంపికలో కౌన్సిల్‌దే కీలక పాత్ర
ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తిమంతమైన విభాగాల్లో గార్డియన్ కౌన్సిల్ ఒకటిగా ఉంది. ఈ కౌన్సిల్లో మొత్తం 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఇరాన్ చట్టం ప్రకారం సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం వీరికే ఉంది. ఇందులో ఎనిమిదేళ్ల పదవీకాలం కోసం ఎంపికై వచ్చిన షియా మతగురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా చూస్తుంది.
అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ఇజ్రాయెల్- అమెరికా దాడులను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఖమేనీ హత్య, నిరంకుశులపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది. ఈ మహా నేరానికి సమాధానం చెప్పకుండా వదలబోమని హెచ్చిరించింది. మరోవైపు ఇదిలా ఉండగా, ఖమేనీ మృతి పట్ల ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం తెలిపింది. సుప్రీం లీడర్ ఖమేనీని చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని తెలిపింది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సిద్ధమైనట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ఐఆర్జీసీ చీఫ్‌గా మాజీ రక్షణ మంత్రి
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి మహ్మద్ పాక్‌పౌర్ కూడా మరణించారు. ఆయన స్థానంలో మాజీ రక్షణ మంత్రి, అనుభవజ్ఞుడైన సైనిక అధికారి అహ్మద్ వాహిదిని కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించారు.
ఖమేనీ మృతి వార్త చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్
ఖమేనీ మృతి పట్ల ఇరాన్లో కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వాని మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారనే వార్తను చదువుతున్న టీవీ యాంకర్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణ వార్తను చదువుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ దేశానికి ఇది తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH | Iran: People gather in front of Tehran University in Tehran after the death of Iran's Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei in the US-Israeli strikes
— ANI (@ANI) March 1, 2026
(Video source: Islamic Republic of Iran Broadcasting) pic.twitter.com/5JEAUAm7TB
This is how Iranian television announced the death of Khamenei.
— Parody Jeff (@BackupJeffx) March 1, 2026
The journalist couldn’t even manage to speak from the pain.
They truly loved their leader. pic.twitter.com/QfOIA5wCUs
ఇరాన్‌పై భీకర దాడులు
శనివారం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇరాన్ సంయుక్త దాడులు చేశాయి. ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేపట్టాయి. ఈ ఘటనల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్లు ప్రకటించింది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఖమేనీ హతమార్చాలనే పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి సంయుక్త దాడులకు దిగినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా 200 యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని 500 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

