ఇరాన్ ప్రతీకార దాడులు- దుబాయ్ బుర్జ్ ఖలీపాపై మిసైల్ ఎటాక్?
ఇరాన్ మిస్సైల్ దాడుల్లో బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు వార్త కథనాలు- ఏడు దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

Published : March 1, 2026 at 3:16 PM IST
Iran Attack Burj Khalifa : పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తారా స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. అదే విధంగా ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, దుబాయ్, అబుదాబి, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్‌తో సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే, ఈ దాడుల్లో ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి
అందులో భవనంలోని ఓ అంతస్తు వద్ద మంటలు చెలరేగుతున్నట్లు, పొగలు వ్యాపిస్తున్నట్లు ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా, సమీపంలో దాడులు జరిగాయా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు, ఇరాన్ దాడుల కారణంగా దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీ మంటలు ఎగిసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటల్ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో విమానాశ్రయంలోని పలువురు వ్యక్తులు గాయపడినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. అదేవిధంగా, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ శిథిలాలు పడడంతో బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముందు భాగంలో స్వల్పంగా మంటలు వ్యాపించినట్లు పేర్కొంది.
:rotating_light:#BREAKING: The world's iconic Burj Al Arab hotel in Dubai, widely known as the world’s only seven-star rating hotel, has been hit by an Iranian drone, with footage showing flames rising from the property. pic.twitter.com/jhbXS2cgbB
— R A W S A L E R T S (@rawsalerts) February 28, 2026
దాడుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సైరన్ల మోత
ఇదిలా ఉండగా, ఇరాన్ క్షిపణి దాడులకు దుబాయ్, దోహా, అబుదాబి, కువైట్, బహ్రెయిన్‌లోని హోటళ్లు, విమానాశ్రయాలు ప్రభావితం అవుతున్నాయని స్థానిక వార్తా కథనాలు తెలుపుతున్నాయి. దాడుల కారణంగా పౌర, నివాస ప్రాంతాల్లో తీవ్ర అలజడి చెలరేగుతుందని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని చెబుతున్నాయి. అదేవిధంగా, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తదాడిని ఎదుర్కోవడానికి ఇరాన్ వద్ద తగిన సైనిక శక్తి లేదని తెలుస్తోంది. మరోవైపు, ఇజ్రాయెల్‌లో కూడా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. సైరన్లు మోతతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్తున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఆ దాడులను సమర్థంగా అడ్డుకున్నాం!
ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణి, డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ దాడులను చాలా వరకు సమర్థంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదేవిధంగా, ఇరాన్ క్షిపణి దాడిలో టెల్ అవీవ్ ప్రాంతంలో ఒక మహిళ మరణించిందని స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడుల కారణంగా మధ్యప్రాచ్యం అంతటా విమానయాన సేవలకు అంతరాయం కలిగిందని వార్త కథనాలు పేర్కొన్నాయి. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య రాజధాని దుబాయ్ మీదుగా వైమానిక రక్షణ కాల్పులు జరిగాయని పేర్కొన్నాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపాయి. కాగా, యూఏఈ రాజధానిపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో ఒక వ్యక్తి మరణించాడని, వైమానిక దాడుల నుంచి వచ్చిన శిథిలాలు నగరంలోని ప్రధాన ఓడరేవు, ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముఖభాగంలో మంటలకు కారణమయ్యాయని వార్తలు వచ్చాయి. మరోవైపు, ఇరాన్ తన రాజధాని, తూర్పు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆయన మృతికి 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి
వామ్మో! ఖమేనీకి అంత సంపద ఉందా? ట్రంప్, నెతన్యాహూల కంటే సంపన్నుడా?

