ETV Bharat / international

ఇరాన్‌ దాడుల్లో 20కి పైగా అమెరికా స్థావరాలు ధ్వంసం- US నష్టాలను బయటపెట్టిన శాటిలైట్‌ చిత్రాలు

8 పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు- ఇరాన్‌ దాడుల్లో ధ్వంసమైన అమెరికా రక్షణ వ్యవస్థలు, రాడార్లు- 'ప్లానెట్' సంస్థపై ఒత్తిడి తెచ్చి పశ్చిమాసియా ప్రాంత ఫొటోలు నిలిపివేత

US Attack On Iran
US Attack On Iran (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : June 1, 2026 at 3:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

US Attack On Iran : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మొదలైన ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడింది. ఎనిమిది పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్‌లోని అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు వర్షం కురిపించింది. ఇరాన్‌ దాడుల్లో అమెరికాకు చెందిన రక్షణ వ్యవస్థలు, రాడార్లు, యుద్ధ విమానాలకు ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. ఆ తీవ్రమైన నష్టాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు అమెరికా ప్రయత్నించింది. ప్రముఖ శాటిలైట్ ఇమేజ్ సంస్థ అయిన 'ప్లానెట్' పై ఒత్తిడి తెచ్చి, మిడిల్ ఈస్ట్ ప్రాంత ఫోటోలను నిలిపివేయించింది. అయితే ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా బయటపడ్డ శాటిలైట్ చిత్రాలు అమెరికా నష్టాలను బయటపెట్టాయి. పశ్చిమాసియా దేశాల్లో దెబ్బతిన్న అమెరికా సైనిక స్థావరాల సంఖ్య 28 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికాకు కోలుకోలేని దెబ్బ!
ఇరాన్ దాడుల్లో అమెరికా అత్యంత ఖరీదైన సైనిక సంపదను కోల్పోయినట్లు తెలుస్తోంది. యూఏఈలోని అల్ రువైస్, అల్ సాదర్ ఎయిర్ బేస్‌లతో పాటు జోర్డాన్ లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్​లో ఉన్న మూడు అత్యాధునిక 'థాడ్' యాంటీ-బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వద్ద ఎనిమిది థాడ్‌ క్షిపణి వ్యవస్థలే ఉన్నాయి. ఒక్కో థాడ్‌ క్షిపణి వ్యవస్థ తయారీ వ్యయం దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేసేందుకు 100 మంది సైనికులు కావాలి. ఇందులోని ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 12.7 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంతటి ఖరీదైన, సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థలను కోల్పోవడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

42 ఆయుధ పరికరాలు ధ్వంసం
అమెరికా నష్టం అక్కడితో ఆగలేదు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా విమానాలపై కూడా ఇరాన్ గురిచూసి కొట్టింది. సుమారు 700 మిలియన్ డాలర్ల విలువ చేసే అత్యంత ఖరీదైన 'ఈ-3 సెంట్రీ' నిఘా విమానం ఒకటి దాడుల్లో ధ్వంసమైంది. కువైట్ లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్‌తో పాటు క్యాంప్ అరిఫ్ జాన్ లపై పలుమార్లు ఇరాన్‌ దాడులు చేసింది. అక్కడ ఇంధన నిల్వ కేంద్రాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన ఎఫ్-15, ఎఫ్-35 ఫైటర్ జెట్లు, 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఒక ఏ-10 అటాక్ విమానం సహా కనీసం 42 ఆయుధ పరికరాలు ధ్వంసమయ్యాయి

మే నెల నాటికే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అమెరికా, 2.7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పెంటగాన్‌ అంచనా వేసింది. ఇందులో అత్యధిక భాగం దెబ్బతిన్న పరికరాల మరమ్మతులకే సరిపోయినట్లు తెలుస్తోంది. ఓ పక్క అమెరికా బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను వాడుతుంటే ఇరాన్ మాత్రం చాలా చౌకైన, సులభంగా తయారుచేయగల డ్రోన్లను ఉపయోగించి అమెరికా ఆస్తులను ధ్వంసం చేసింది. ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చితే, అమెరికా స్థావరాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాడులను అడ్డుకోవడానికి అవసరమైన ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు.

అమెరికాతో రాజీకి ఇరాన్ ససేమిరా- హర్మూజ్​ యథాస్థితిపై ఐఆర్‌జీసీ సరికొత్త ప్రతిపాదన- థింక్‌ట్యాంక్ కీలక నివేదిక

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: పరువు కోసం పాక్ లాబీయింగ్- అమెరికా సంస్థతో 1.2 మిలియన్‌ డాలర్ల డీల్