స్టూడెంట్ వీసాతో ఎంట్రీ- క్రిప్టోతో నేరాలు: యూఎస్, కెనడాల్లో ఉంటూ భారత్‌లో నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్లు
హత్యలు, డ్రగ్స్, ఉగ్రవాదం- అంతర్జాతీయ గ్యాంగ్స్టర్లకు రక్షణ కవచంగా మారిన అమెరికా, కెనడా చట్టాలు!

Published : June 9, 2026 at 1:56 PM IST
Indian Gangsters In America : భారత్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లుగా ఉన్నవారు, ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో ఆశ్రయం పొందుతున్నారని న్యూస్‌వీక్ సంచలనాత్మక నివేదికను ప్రచురించింది. పరారీలో ఉన్న ఈ నేరగాళ్లు, వ్యవస్థీకృత నేర ముఠాల సభ్యులు మొదట స్టూడెంట్ వీసాల ద్వారా, రాజకీయ ఆశ్రయం కోరడం ద్వారా లేదా అక్రమ వలస మార్గాల ద్వారా యూఎస్, కెనడాలకు వెళుతున్నారని సదరు నివేదిక పేర్కొంది.
"భారతదేశంలో హత్యలు, బలవంతపు వసూళ్లు, డ్రగ్ స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యకలాపాలు లాంటి పలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు అమెరికా, యూఎస్‌ల్లో తమ నేర నెట్‌వర్క్‌లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లు కూడా ఇదే పంథా అనుసరిస్తున్నారు. వీరు స్టూడెంట్ వీసా, రాజకీయ ఆశ్రయం, అక్రమ వలస మార్గాల ద్వారా ఉత్తర అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత, వాళ్లు అక్కడే స్థిరపడి పలు దేశాల్లో విస్తరించిన తమ పాత నేర ముఠాలను, నెట్‌వర్క్‌లను మళ్లీ బలోపేతం చేసుకుంటున్నారు" అని సదరు నివేదిక స్పష్టం చేసింది.
అమెరికా అంతర్గత భద్రతా శాఖ (డీహెచ్ఎస్) మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ, "ఈ అంతర్జాతీయ నేర ముఠాలు మొదట్లో అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రాలేదు. తమ దేశాల్లో నేరాలకు పాల్పడేందుకు అమెరికా, కెనడాలు సురక్షితమైన స్థావరాలుగా భావించి ఇక్కడికి వచ్చారు" అని తెలిపారు.
వెంటనే అరెస్టు చేయరని వాళ్లకు తెలుసు!
"కాలిఫోర్నియాలోని సెంట్రల్ వ్యాలీలో లేదా వాంకోవర్ శివార్లలోని ఒక అపార్ట్మెంట్లో కూర్చొని, సదరు అంతర్జాతీయ ముఠాలు, గ్యాంగ్స్టర్లు భారతదేశంలో హత్యలు చేయమని ఆదేశాలు జారీ చేయగలరు. ఎందుకంటే, ఒక దేశం నుంచి మరో దేశానికి నేరస్థులను అప్పగించే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. రాజకీయ ఆశ్రయం కోరుతూ పెట్టుకునే దరఖాస్తుల విచారణ వెంటనే జరగదు. కేవలం భారత పోలీసులు ఇచ్చే నోటీసుల ఆధారంగా అమెరికా, కెనడా పోలీసులు వారిని అరెస్టు చేయరు. ఇవన్నీ సదరు అంతర్జాతీయ ముఠాలకు, గ్యాంగ్స్టర్లకు బాగా తెలుసు" అని సదరు నివేదిక పేర్కొంది.
ఇప్పుడు అమెరికా వాళ్లనూ బెదిరిస్తున్నారు!
మొదట్లో భారత్‌లోని వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడిన ఈ నేర ముఠాలు, ఇప్పుడు అమెరికాలోని శాక్రమెంటోలో ఉన్న దుకాణదారులను కూడా అదే రీతిలో బెదిరించడం ప్రారంభించాయి. గతంలో ఆయుధాలు, నగదును రవాణా చేయడానికి ఉపయోగించిన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లను, ఇప్పుడు కొకైన్, ఫెంటానిల్ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలను స్మగ్లింగ్ చేయడానికి వినియోగిస్తున్నారు.
భారత్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పిన వివరాలు, పరారీలో ఉన్న నేరస్థుల సమాచారం, ఫెడరల్ కోర్టు అభియోగాలు, ఇంటర్‌పోల్ నోటీసులు, భారతదేశానికి చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పత్రాలు, వివిధ రాష్ట్రాల పోలీసులు చేసిన ప్రకటనలు, కెనడా ప్రభుత్వ బహిరంగ రికార్డుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు న్యూస్‌వీక్ తెలిపింది. అంతేకాదు ఈ నివేదికలో పబ్లిక్ ఛార్జ్, చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న పలువురి నిందితుల పేర్లను కూడా ప్రస్తావించింది. అయితే కోర్టులు వీరి నేరాలను నిర్ధరించే వరకు ఇవన్నీ ఆరోపణలుగా పరిగణించాల్సి ఉంటుందని సదరు నివేదిక స్పష్టం చేసింది.
వీరే ఆ గ్యాంగ్స్టర్స్!
ఈ నివేదికలో పేర్కొన్న ప్రధాన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, అర్ష్ దలా, భాను రాణా, అరవింద్ కుమార్, సునీల్ కుమార్, చరంజిత్ సింగ్, ధర్మన్జోత్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరంతా భారతదేశంలో హత్యలు, డ్రగ్స్ స్మగ్లింగ్, బలవంతపు వసూళ్ల నుంచి ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద మోపబడిన తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు.
నేరాలకు క్రిప్టో కరెన్సీ వాడుతున్నారు!
'ఈ అంతర్జాతీయ ముఠాలు, గ్యాంగ్స్టర్లు తమ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి, గ్యాంగ్ లీడర్లకు నేరుగా సంబంధం లేకుండా చూసుకోవడానికి ఎక్కువగా ఎన్క్రిప్టెడ్ యాప్‌లు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నాయి. ఇందుకోసం విదేశాల్లో ఉండే హ్యాండర్లను వాడుకుంటున్నాయని భారత్, కెనడా, అమెరికా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ బి. సతీశ్ బాలన్ మాట్లాడుతూ, "ఇప్పుడు ఒక గ్యాంగ్‌స్టర్ హరియాణాలో కూర్చొని డబ్బులు వసూలు చేయమని, కాల్పులు జరపమని లేదా ఒకరిని బెదిరించమని ఆదేశాంచాల్సిన అవసరం లేదు. వారు విదేశాల్లో ఉండే ఇవన్నీ చేసేస్తున్నారు. ఈ ముఠాలు ఓవర్సీస్ కమాండ్, డిజిటల్ అనోనిమిటీ, లోకల్ ఎగ్జిక్యూషన్, సైకలాజికల్ వార్ఫేర్లతో కూడిన ఒక హైబ్రిడ్ మోడల్లో పనిచేస్తున్నాయి" అని చెప్పారు.
కాగా ఇప్పుడు ఈ అంతర్జాతీయ నేర ముఠాల్లో యువకులు చిన్నవయస్సులోనే చేరుతున్నారని సదరు నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ కెనడా, అమెరికాల్లో నివసిస్తున్న పలువురు నిందితులను తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నప్పటికీ, అక్కడి చట్టపరమైన, సాంకేతిక పరమైన అడ్డంకుల వల్ల ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని పేర్కొంది.
సగం తిన్న యాపిల్స్‌ను జనాల్లోకి విసిరిన డీకే శివకుమార్- కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు
'అమిత్ షా ఫోన్ రాగానే నైతికత మాయమవుతుందా?'- పార్టీ మారుతున్న నేతలపై TMC ఎంపీ ఫైర్

