ETV Bharat / international

అమెరికా-భారత్‌ బంధంపై భాగవత్‌కు 'అన్‌షేకబుల్‌ కాన్ఫిడెన్స్‌'- న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ రౌండ్‌టేబుల్‌ భేటీ

భారత యువతపై భాగవత్‌కు అపారమైన నమ్మకం ఉందన్న ఇండియన్‌-అమెరికన్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌- భారత్‌లో పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటులో ఉన్న అధికారిక ప్రక్రియలపై చర్చ- ఆగస్టు 29న న్యూయార్క్‌లో యూనివర్సల్‌ వన్‌నెస్‌ సెలబ్రేషన్‌

Mohan Bhagwat New York Visit
మోహన్ భాగవత్ (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 7:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mohan Bhagwat New York Visit : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెలికమ్యూనికేషన్స్‌, అంతరిక్షం, క్లీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర రంగాలకు చెందిన వారితో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

భారత యువత సామర్థ్యంపై భాగవత్‌కు అపారమైన విశ్వాసం ఉందని సమావేశంలో పాల్గొన్న సిలికాన్‌ వ్యాలీకి చెందిన భారత సంతతి వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఆశా జడేజా మోత్వానీ తెలిపారు. భాగవత్‌ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగానే ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మోహన్ భాగవత్‌ సమావేశమయ్యారు.

పలు రంగాలపై చర్చ
భాగవత్‌తో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆశా జడేజా మోత్వానీ ఎక్స్​లో వెల్లడించారు. టెలికమ్యూనికేషన్స్‌, స్పేస్‌, క్లీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సహా పలు రంగాలకు చెందినవారు భాగవత్‌ను ప్రశ్నలు అడిగారని తెలిపారు. భారత్‌లో కంపెనీలు ఏర్పాటు చేయడం, తయారీ ప్లాంట్లు నెలకొల్పడం వంటి అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్న విధానపరమైన ప్రక్రియలను ఎలా సులభతరం చేయవచ్చన్నదానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు చెప్పారు.

వివిధ అనుమతులు, అధికారిక ప్రక్రియల కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే జాప్యాన్ని ఎలా తగ్గించాలనే అంశాన్ని కూడా ప్రతినిధులు మోహన్ భాగవత్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తమ ప్రశ్నలకు భాగవత్‌ సమర్థంగా సమాధానాలు ఇచ్చారని మోత్వానీ పేర్కొన్నారు. అయితే తాను భారత ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడటం లేదన్న విషయాన్ని భగవత్‌ స్పష్టం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఆయన సమాధానాలు తమలో విశ్వాసాన్ని కలిగించాయని మోత్వానీ అన్నారు.

భారత యువతపై అపారమైన నమ్మకం
మోహన్‌ భాగవత్‌కు భారత యువతపై ఎంతో నమ్మకం ఉందని మోత్వానీ పేర్కొన్నారు. భారత యువత దేశంలో మార్పును తీసుకురావాలని కోరుకుంటోందని, ఆ మార్పుపై భాగవత్‌కు అచంచలమైన విశ్వాసం ఉన్నట్లు సమావేశంలో స్పష్టమైందని చెప్పారు. భారత యువతకు భాగవత్‌ అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకరిగా కనిపించారని ఆమె అభిప్రాయపడ్డారు. భారత యువత అపూర్వమైన మార్పులకు నాయకత్వం వహిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి అడ్డుగా ఉన్న పాత విధానాలు, వలస పాలన కాలం నాటి నిర్మాణాలను మార్చడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.

భారత్‌ పట్ల భాగవత్‌కు ఉన్న దృక్పథాన్ని కూడా మోత్వానీ వివరించారు. భిన్న మతాలు, వర్గాల మధ్య ఆయన ఎలాంటి తేడాను చూడరని చెప్పారు. అన్ని మతాలకు చెందిన భారతీయులను ఒకే కుటుంబంగా భావిస్తారని పేర్కొన్నారు. వసుధైవ కుటుంబకం భావనకు అనుగుణంగా సమాజాన్ని, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలన్న ఆలోచన భాగవత్‌ మాటల్లో కనిపించిందని ఆమె తెలిపారు. భగవత్‌ వ్యక్తిత్వంలో మానవత్వానికి ప్రాధాన్యం కనిపించిందని, భారతదేశం ఐక్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

అమెరికా-భారత్‌ స్నేహానికి మద్దతు
అమెరికా-భారత్‌ సంబంధాలపై కూడా భాగవత్‌ సానుకూలంగా ఉన్నారని మోత్వానీ తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహం, పరస్పర సహకారం, ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. భారత్‌, అమెరికా మధ్య మరింత బలమైన వారధులు నిర్మించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని భగవత్‌ వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికాను మరింత తరచుగా సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లో భగవత్‌ పాల్గొననున్న మరో కీలక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 29న మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో యూనివర్సల్‌ వన్‌నెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భగవత్‌ ప్రసంగించనున్నారు. సుమారు 6 వేల మంది భారతీయ సంతతి ప్రజలు, ఇతర వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అమెరికన్‌ హిందూస్‌ ఫర్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ డైలాగ్‌ (AHEAD) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దీనిని ల్యాండ్‌మార్క్‌ రక్షాబంధన్‌ గ్యాదరింగ్​గా నిర్వాహకులు అభివర్ణించారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న వందలాది హిందూ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కీలక ప్రసంగాలతో జరిగే ఈ వేడుకలో యూనివర్సల్‌ వన్‌నెస్‌ అనే అంశంపై చర్చించనున్నారు. హిందూ తత్వంలోని వసుధైవ కుటుంబం- ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

భాగవత్‌ అమెరికా పర్యటనపై వివాదం- వీసా రద్దు చేయాలన్న USCIRF

'ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధించాలి' - యూఎస్ కమిషన్ కామెంట్స్ ​