భారత్‌తో ట్రేడ్ డీల్‌కు చాలా దగ్గరగా ఉన్నాం- చివరి అడ్డంకినే అధిగమించాలి: అమెరికా
భారత్ వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు- చాలా దగ్గరగా ఉన్నామంటూ అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్య- ప్రపంచ వేదికపై భారత్ ప్రాధ్యానత గురించి ప్రస్తావన

Published : May 6, 2026 at 8:02 AM IST
US On India Trade Deal : భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ తెలిపారు. సంతకం చేయడానికి ఇరు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మిగిలింది ఒక్క చివరి అడ్డంకి మాత్రమే అని పేర్కొన్నారు. మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్ వద్ద జరిగిన సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాండౌ ఈ మేరుకు వ్యాఖ్యలు చేశారు.
'ఇప్పటికే చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నా. మేం చాలా దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నా. కానీ మనం చివరి అడ్డంకిని అధిగమించాలి. అంతేకాకుండా అజెండాలోని ఇతర ముఖ్య అంశాలపై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనే దానిపై అందించడానికి నా వద్ద పెద్దగా అంతర్గత సమాచారం ఏమీ లేదు. కానీ మనం చాలా చాలా దగ్గరగా ఉన్నామని నేను నమ్ముతున్నానని పునరుద్ఘాటించగలను' అని లాండౌ పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యం
ఇటీవల చేసిన భారత్ పర్యటన గురించి లాండౌ గుర్తు చేసుకున్నారు. 'భారత్ ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతోందని అనడంలో ఎటువంటి సందేహం లేదని నేను భావిస్తున్నా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. అంతేకాకుండా భారత్‌కు ఆర్థికంగా అద్భుతమైన అపార అవకాశాలు ఉన్నాయి. గతంలో తీసుకున్న ఆర్థిక విధానాల కారణంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కానీ ఇప్పుడు భారీ ఆర్థిక వృద్ధికి భారత్ సిద్ధంగా ఉంది. తద్వారా కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నా' అని లాండౌ వ్యాఖ్యానించారు.
నాటికి 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం
భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఈ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఇరు దేశాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 7న దాని పాఠ్యాన్ని విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా భారత్‌పై విధించిన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించింది. రష్యా చమురు కొనుగోలుకు సంబంధించిన 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించింది. మిగిలిన సుంకాలను కూడా 18 శాతానికి తగ్గించేందుకు ప్రణాళిక ఉంది.
సుప్రీంకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి
అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, కొత్త గ్లోబల్ టారిఫ్ విధానాలకు అనుగుణంగా ఒప్పందాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తోంది. దేశ ప్రయోజనాలు కాపాడేలా ఒప్పందాన్ని పునర్నిర్మించాలని చూస్తోంది.
కాగా, వాణిజ్య ఒప్పందంపై ఏప్రిల్ 20 నుంచి 22 వరకు వాషింగ్టన్ డీసీ వేదికగా భారత్, అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చలతో ముడిపడిన అంశాలపై అమెరికా సీనియర్ అధికారి ఒకరు మంగళవారం(ఏప్రిల్ 21న) కీలక ప్రకటన చేశారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశగా భారత్, అమెరికాలు పురోగతిని సాధించాయని ఆయన వెల్లడించారు. ఇరుదేశాల ప్రతినిధులు సానుకూల వాతావరణంలో, ఫలవంతంగా చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఈ చర్చల వివరాలు తెలిసిన మరో అమెరికన్ అధికారి మాట్లాడుతూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చాలా కీలకమైన సమస్యలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇరుపక్షాలు ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు దగ్గరలో ఉన్నాయన్నారు.
యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి- ముగ్గురు భారతీయులకు గాయాలు- ఖండించిన కేంద్రం
భారత్ అతి పెద్ద ఉపగ్రహం 'మిషన్ దృష్టి' విజయవంతం- మేఘాలున్నా పాక్, చైనాపై నిఘా!

