భారత్‌తో ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీనే కారణం: అమెరికా
భారత్, అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం- అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు

Published : January 9, 2026 at 11:57 AM IST
US India Trade Deal : భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇరు దేశాల మధ్య ట్రేడ్‌డీల్ కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు ఏవీ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఆగిపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో నేరుగా మాట్లాడేందుకు ముందుకు రాకపోవడమేనని లుట్నిక్ వ్యాఖ్యానించారు.
మోదీ కాల్ చేయకపోవడమే కారణం
తాజాగా ఒక ఇంటర్వ్యూలో లుట్నిక్ మాట్లాడుతూ, "సాధారణంగా చూస్తే భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తి దశకు వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే ఇది అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగతంగా ఆసక్తి చూపిన ఒప్పందం. దీనికి తుది ముద్ర పడాలంటే ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేయాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయలేదు. చివరకు మోదీ కాల్ చేయలేదు" అని పేర్కొన్నారు.
భారత్‌తో ఒప్పందంపై మేం ఆలోచించడం లేదు!
ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో అమెరికా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేసిన లుట్నిక్, "ఆ దేశాల కంటే ముందే భారత్‌తో ఒప్పందం జరుగుతుందని మేం భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో ఇంతకుముందు అంగీకరించిన ట్రేడ్‌డీల్‌ను అమెరికా వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఆ ఒప్పందంపై మేం ఆలోచించడం లేదు" అని స్పష్టం చేశారు.
బ్రిటన్‌తో భారత్‌కు పోలిక
అదే సమయంలో బ్రిటన్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన లుట్నిక్, "బ్రిటన్‌తో ట్రేడ్‌డీల్ చర్చలు తుది దశకు చేరుకున్నప్పుడు ఆ దేశ ప్రధాని కీర్‌స్టార్మర్ ట్రంప్‌కు నేరుగా ఫోన్ చేశారు. అదే రోజున ఒప్పందం ముగిసింది. మరుసటి రోజు మీడియా సమావేశంలో ఇరువురు నేతలు కలిసి దానిని ప్రకటించారు" అంటూ భారత్- బ్రిటన్ పరిస్థితులను పోల్చారు. అయితే మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ ఇంకా అవకాశం ఉందని లుట్నిక్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఓవైపు చర్చలు- మరోవైపు సుంకాలు
ఇదిలా ఉండగా, ఒకవైపు ట్రేడ్‌డీల్ చర్చలు జరుగుతూనే మరోవైపు భారత్‌పై అమెరికా సుంకాల బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే కొన్ని భారత ఉత్పత్తులపై సుంకాలు విధించిన అమెరికా, తాజాగా మరింత కఠిన వైఖరిని ప్రదర్శించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు భారీ సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లు అమెరికా చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ స్పందన ఇలా
అయితే అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. లుట్నిక్ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన ఆయన, "హగ్ హగ్ నా రహా, పోస్ట్ పోస్ట్ నా రహా" అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా "క్యా సే క్యా హో గయా, బేవఫా తేరీ దోస్తీ మే" అంటూ మరో బాలీవుడ్ సాంగ్‌ను ప్రస్తావిస్తూ మోదీపై విమర్శలు చేశారు. ఈ రెండు పాటలు సంగమ్ (1964), గైడ్ (1965) సినిమాల్లోనివి. ప్రస్తుతం ఫేమస్ సాంగ్స్‌తో కాంగ్రెస్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Hug हग ना रहा
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 9, 2026
Post पोस्ट ना रहा
क्या से क्या हो गया बेवफ़ा तेरे दोस्ती में pic.twitter.com/ofy0ML28bx
Core-5 గ్రూప్ ఏర్పాటుకు ట్రంప్ ప్లానింగ్- భారత్, చైనా, రష్యా, జపాన్‌తో జట్టు సాధ్యమేనా?
అమెరికా- భారత్ భాగస్వామ్యం వృద్ధే ట్రంప్ ఆకాంక్ష: యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

