ETV Bharat / international

ఒమన్‌ తీరంలో నౌకపై దాడి- ముగ్గురు భారతీయులు మిస్సింగ్‌- అమెరికా దౌత్యవేత్తకు సమన్లు

వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ- అమెరికా చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం

India Summons US Ambassador
India Summons US Ambassador (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 10, 2026 at 10:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

India Summons US Ambassador : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని భారత్‌ ఖండించింది. అమెరికా చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్‌ నాయుడు అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌కు సమన్లు జారీ చేశారు.

హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులున్న మరో నౌకపై బుధవారం దాడి జరిగింది. పలావు జెండాతో బయల్దేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారని, మరో ముగ్గురు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరికోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది. పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా పర్యవేక్షిస్తోందని, రెస్క్యూ ఆపరేషన్‌పై ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.

"ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండిస్తున్నాం. గల్లంతైన ముగ్గురు భారతీయులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నౌకా రవాణాపై నిరంతరం దాడులు జరుగుతుండటం ఆందోళన కలిస్తోంది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని కోరుతున్నాం. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే చర్యలకు ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి" అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతకుముందు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడిని తమ దేశమే చేసిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు రెండునెలలుగా హర్మూజ్‌లో యూఎస్‌ దిగ్బంధిస్తోంది. అందుకు విరుద్ధంగా ఇరాన్‌ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. పలావు జెండాతో బయల్దేరిన కార్గో నౌక ఎంటీ మారివెక్స్‌ హర్మూజ్ సమీపంలో ఒమన్ తీరంలో ఉండగా ఈ దాడి జరిగింది. అమెరికా ఆదేశాలు పాటించకపోవడంతో పశ్చిమాసియా జలాల్లో ఉన్న యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్ నుంచి ఈ దాడి చేసినట్లు చెప్పింది. దీంతో మారివెక్స్ ఇక ఇరాన్‌ను చేరుకోలేదని ఎక్స్‌ వేదికగా చెప్పింది. దాడి కారణంగా మంటలు చెలరేగడంతో నౌకలోని సిబ్బంది అత్యవసర సహాయం కోసం అభ్యర్థనలు పంపారు. వెంటనే అప్రమత్తమైన భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు, షిప్‌లోని వారిని సురక్షితంగా తరలించాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ 24 మంది భారతీయులను కాపాడింది.

ఇరాన్‌- అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖాయమైందని అనుకునేలోపే మరోసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దాంతో ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌లో అంతరాయాలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఏప్రిల్‌ 13 నుంచే అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. మానవతా సహాయం కోసం వెళ్తున్న 42 నౌకలు మాత్రమే హర్మూజ్ దాటేందుకు అనుమతించింది.

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు- అమెరికా F35 హ్యాంగర్లు ధ్వంసం చేశామన్న ఇరాన్

హర్మూజ్‌లో హైటెన్షన్‌- అపాచీ ఘటన ఎఫెక్ట్- ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు