'ఆ టారిఫ్‌లపై అమెరికా వైఖరి అస్థిరం- వారికి అవసరమైన ఉత్పత్తులకు మాత్రం మినహాయింపు'- US తీరుపై భారత్ అభ్యంతరం
వెట్టిచాకిరికి సంబంధించిన అమెరికా సుంకాల ప్రతిపాదనపై భారత్ అభ్యంతరం- అమెరికాకు అవసరమైన 1,600 ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టిన వాణిజ్య శాఖ

Published : July 9, 2026 at 11:07 AM IST
India On Us Labour Force Tariffs : వెట్టిచాకిరి చేసే కార్మికులతో తయారైన వస్తువులపై అదనపు దిగుమతి సుంకాలను విధించాలన్న అమెరికా ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికా వైఖరి అస్థిరంగా ఉందని విమర్శించింది. అమెరికాకు అవసరమైన 1,600 ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్) నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొన్న భారత ప్రతినిధులు, ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ, అమెరికాలో ఉత్పత్తి చేయలేని లేదా పండించలేని సుమారు 1,600 వస్తువులకు యూఎస్‌టీఆర్ ఫోర్స్డ్ లేబర్ పరిశీలన నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ మినహాయింపులు వెట్టిచాకిరిని అరికట్టాలన్న విధాన లక్ష్యాన్నే బలహీనపరుస్తున్నాయని, అలాగే నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నాలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వస్త్ర రంగంపై అభ్యంతరం
అమెరికా పత్తితో తయారైన ముడిసరుకును ఉపయోగించి తయారు చేసే వస్త్రాలపై తక్కువ సుంకాలు విధించడం కూడా సముచితం కాదని మిశ్రా పేర్కొన్నారు. ఈ విధానం విదేశీ తయారీదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని, అయితే బలవంతపు శ్రమ సమస్యను పూర్తిగా పరిష్కరించడం లేదని తెలిపారు. అమెరికాతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధిత అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏకపక్షంగా సెక్షన్ 301 కింద దర్యాప్తులు, సుంకాల విధానం కంటే పరస్పర చర్చలే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
ఫోర్స్డ్ లేబర్‌కు సంబంధించిన దిగుమతి నిషేధం లేకపోవడం ఒక్కటే అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగిస్తోందని నిరూపించే తగిన ఆధారాలను యూఎస్‌టీఆర్ సమర్పించలేదని భారత్ వాదించింది. అలాగే 60 దేశాల పరిస్థితులను విడివిడిగా పరిశీలించకుండా ఒకే తరహా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని పేర్కొంది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ప్రధాన ఎగుమతుల్లో బలవంతపు శ్రమతో తయారైన ముడిసరుకుల వినియోగానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
పరిశ్రమ సంఘాల ఆందోళన
మరోవైపు అమెరికా ప్రతిపాదించిన 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలపై భారత పరిశ్రమ సంఘాలు ఫిక్కీ, సీఐఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఫిక్కీ ప్రతినిధి పూర్ణిమా షెనాయ్ మాట్లాడుతూ, అదనపు సుంకాల వల్ల భారత ఎగుమతిదారులకే కాకుండా అమెరికా తయారీ సంస్థలు, దిగుమతిదారులు, రిటైల్ వ్యాపారులు, చివరకు అమెరికా వినియోగదారులపైనా అదనపు భారం మోపుతాయని చెప్పారు. నాణ్యత, విశ్వసనీయత, నిబంధనల అమలులో భారత సరఫరాదారులు ఇప్పటికే మంచి పేరు సంపాదించారని, అలాంటి సరఫరా గొలుసులను ఖరీదైనవిగా మార్చడం వల్ల బలవంతపు శ్రమతో తయారైన వస్తువులను గుర్తించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. భారత రాజ్యాంగం, చట్టాలు వెట్టిచాకిరిని అనుమతించవని సీఐఐ ప్రతినిధి సుచితా సోనాలిక స్పష్టం చేశారు. భారత కంపెనీలు ఫోర్స్డ్ లేబర్‌ను అమలు చేసే అవకాశం లేదని, అందువల్ల భారత విధానాలను అసమంజసం లేదా వివక్షపూరితంగా పేర్కొనడం సరికాదని అన్నారు.
వెట్టిచాకిరి నిర్మూలనలో విఫలమైననందుకు భారత్ సహా 60 దేశాలపై సుంకాలను వధఇంచాలని యూఎస్‌టీఆర్ ప్రతిపాదనలు చేసింది. ఇందులో అత్యధికంగా 54 దేశాలపై 12.5శాతం, మిగతా వాటిపై 10శాతం సుంకం విధించాలని సూచించింది. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా వెట్టిచాకిరి చేసే కార్మికులు తయారుచేసిన దిగుమతుల నిషేధంలో అరికట్టలేకపోయాయని గత నెలలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గ్రీర్ తెలిపారు. ఈ విషయం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. వెట్టిచాకిరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోందని చెప్పారు. అసమానతలను తాము ఇక సహించలేమని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి.
అణుఇంధనం నుంచి రక్షణ వరకు కీలక ఒప్పందాలు- భారత్-ఆస్ట్రేలియా ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు
'ఇది మన ఉమ్మడి విశ్వాసానికి ప్రతీక'- భారత్- ఆస్ట్రేలియా ఫోరమ్‌లో ప్రధాని మోదీ

