చైనా దూకుడు- POK, అఫ్గాన్ బార్డర్ వద్ద కొత్త కౌంటీ ఏర్పాటు- ఏడాదిలో మూడోది
పాక్ ఆక్రమిత కశ్మీర్, అఫ్గాన్ సరిహద్దుకు సమీపంలో జిన్‌జియాంగ్‌లో కొత్త కౌంటీని ఏర్పాటు చేసిన డ్రాగన్- ఉయ్ఘర్ వేర్పాటువాద మిలిటెంట్ల చొరబాట్లను అరికట్టడానికి ఈ నిర్ణయం

Published : April 12, 2026 at 4:56 PM IST
China New County : ఉయ్ఘర్ వేర్పాటువాద మిలిటెంట్ల చొరబాట్లను అరికట్టడానికి, ఇరుకైన వాఖాన్ కారిడార్ వెంబడి భద్రతను పటిష్ఠం చేసేందుకు భారత్ పొరుగు దేశం చైనా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అఫ్గానిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఒక కొత్త కౌంటీని ఏర్పాటు చేసింది. ఈ కౌంటీకి 'సెన్లింగ్' అని పేరు పెట్టింది. కారకోరం పర్వత శ్రేణికి సమీపంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, అఫ్గానిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఈ కౌంటీ ఉంది. ఇది డ్రాగన్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ప్రధానంగా ముస్లిం ఉయ్ఘర్ జనాభా ఉన్న ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో కేవలం ఏడాది కాలంలోనే చైనా ఏర్పాటు చేసిన మూడో కొత్త కౌంటీ ఇది కావడం గమనార్హం.
షిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 26న సెన్లింగ్ (కౌంటీ పేరు) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దాని పరిపాలనా విభాగాలు, కచ్చితమైన సరిహద్దుల వివరాలను వెల్లడించలేదు. కాగా, పురాతన సిల్క్ రోడ్‌పై ఉన్న చారిత్రక నగరమైన కాష్గర్ చైనాను దక్షిణ, మధ్య ఆసియాతో కలిపే ఒక వ్యూహాత్మక ముఖద్వారంగా ఉంది. ఇది వివాదాస్పదమైన 60 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కి ప్రారంభ స్థానం కూడా. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఏకే) గుండా వెళ్తుంది. అందుకే దీన్ని భారత్ వ్యతిరేకిస్తోంది.
నిపుణులు ఏమంటున్నారంటే?
సెన్లింగ్ కౌంటీ ఏర్పాటు సరిహద్దు భద్రత, పాలనపై బీజింగ్ దృష్టిని ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ కౌంటీ ఏర్పాటు ఆ ప్రాంత వ్యూహాత్మక ప్రాముఖ్యతను చైనా మరింత లోతుగా గుర్తించడాన్ని సూచిస్తుందని షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ ప్రొఫెసర్ అయిన లిన్ మిన్వాం అభిప్రాయపడ్డారు. విస్తృత స్థాయిలో ఈ నిర్ణయం చైనా తన సరిహద్దు ప్రాంతాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. ఈ కొత్త కౌంటీ భౌగోళికంగా అఫ్గానిస్థాన్‌కు చెందిన ఇరుకైన వఖాన్ కారిడార్‌తో అనుసంధానించి ఉందన్నారు. ఇది జిన్‌జియాంగ్‌కు సరిహద్దుగా ఉండి తజికిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లను వేరుచేసే 74 కిలోమీటర్ల పొడవైన ప్రాంతమని వెల్లడించారు. ఇది చైనా భద్రత, ఉగ్రవాద నిరోధక ఆందోళనలను హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన చైనా
తూర్పు తుర్కెస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం (ETIM)కు చెందిన ఉయ్ఘర్ మిలిటెంట్లు అఫ్గానిస్థాన్ నుంచి షిన్‌జియాంగ్‌లోకి ప్రవేశించడానికి వఖాన్ కారిడార్‌ను మార్గంగా ఉపయోగించుకోవడంపై గతంలో బీజింగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై వాషింగ్టన్‌లోని స్టిమ్సన్ సెంటర్‌లో సీనియర్ ఫెలో అయిన యున్ సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త కౌంటీ సమర్థవంతమైన పాలన, నియంత్రణ కోసం బలమైన క్షేత్రస్థాయి ప్రభుత్వ నిర్మాణం దిశగా ఒక ముందడుగును సూచిస్తుందని ఆమె అన్నారు. జాతిపరమైన అశాంతికి, మధ్య ఆసియా నుంచి విదేశీ మిలిటెంట్ల చొరబాటుకు ఎక్కువగా గురయ్యే సరిహద్దు ప్రాంతంలో చైనా ప్రభుత్వం చేపడుతున్న స్థిరీకరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
లద్దాఖ్‌లో రెండు కౌంటీలు ఏర్పాటు- భారత్ అభ్యంతరం
గతేడాది లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో చైనా రెండు కౌంటీలను (హీన్, హెకాంగ్) ఏర్పాటు చేసింది. ఈ స్థావరాలను ఏర్పాటు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎన్నడూ అంగీకరించబోమని పేర్కొంది. ఇటువంటి చట్ట విరుద్ధ, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల వాటికి చట్టబద్ధత కల్పించినట్లు కాదని స్పష్టం చేసింది. ఇదే అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో భారత్‌కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎటువంటి ప్రభావం చూపదని అభిప్రాయపడింది. ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

