ETV Bharat / international

మోదీ నా గ్రేట్ ఫ్రెండ్​- మాది నిజమైన స్నేహ బంధం: నెతన్యాహు

రెండురోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోదీ- పలు ద్వైపాక్షిక అంశాలపై భారత్‌-ఇజ్రాయెల్‌ ప్రధానుల మధ్య చర్చ

PM MODI AND Israel PM Benjamin Netanyahu
PM MODI AND Israel PM Benjamin Netanyahu (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 6:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Modi Visit Israel : ఇజ్రాయెల్‌కు ప్రధాన స్నేహితుడు మోదీ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు పేర్కొన్నారు. భారత్‌ను మోదీ అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారని, మోదీ తమకు స్నేహితుడి కంటే ఎక్కువ అని అభివర్ణించారు. 'భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఇరు దేశాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు. భారత్‌ 150 కోట్ల మంది ప్రజలున్న అతిపెద్ద దేశం. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయి. అదేవిధంగా భారత్‌తో సన్నిహిత సంబంధాలు మూడు రెట్లు పెరిగాయి. ఇరుదేశాలు ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. అనేక రంగాల్లో మన మధ్య సోదరభావం ఉంది. భారత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం' అని నెతన్యాహు పేర్కొన్నారు.

అంతకుముందు కూడా ఇజ్రాయెల్‌ పార్లమెంటు స్పీకర్‌ మోదీని ప్రశంసిస్తూ మాట్లాడారు. మోదీ పాలన భారత్‌కు స్ఫూర్తిదాయకమని, భారత్‌ను సమూలంగా మార్చాడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలపరంగా భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను నిలిపారని పేర్కొన్నారు.

రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. టెల్‌ అవీవ్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ పక్కనపెట్టి మరీ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్‌ కార్పెట్‌తో సైనిక గౌరవ వందనం సమర్పించింది.

పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
అనంతరం విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొంత సేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఇరువురు నేతలు కారులో హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు కొద్దిసేపు ముచ్చటించారు. కాసేపట్లో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌కు మోదీ వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు అక్కడ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. దీంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న భారత తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు.

నా గ్రేట్ ఫ్రెండ్
మోదీకి స్వాగతం పలికిన తర్వాత నెతన్యాహు ఎక్స్​లో ఓ పోస్టు షేర్ చేశారు. 'ఇజ్రాయెల్​ పర్యటనకు వచ్చిన నా స్నేహితుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నేను, నా భార్య సారా ఘనస్వాగతం పలికాం. గతంలో 2017లో మోదీ ఇజ్రాయెల్​ను సందర్శించారు. తర్వాత నేనూ భారత్​ పర్యటనకు వెళ్లాను. అది నిజంగా అసాధారణమైనది. వ్యక్తిగత సంబంధాన్ని పంచుకుంటాం. తరచుగా మాట్లాడుకుంటాం. మా మధ్య ఉన్న స్నేహం మా రెండు దేశాల మధ్య సంబంధాలను శక్తిమంతంగా ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను.

'మేం నెస్సెట్‌లో జరిగే రిసెప్షన్‌కు హాజరవుతాం. తర్వాత జెరూసలేంలో జరిగే ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తాం. మోదీ విందుకు ఆతిథ్యం ఇస్తాము. ఇద్దరం కలిసి రేపు యాద్ వాషెమ్‌ను సందర్శిస్తాము. ఆపై మా బృందాలతో కలిసి మరొక సమావేశాన్ని నిర్వహిస్తాము. ఇజ్రాయెల్ -భారత్ మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆర్థిక, భద్రత, దౌత్య రంగాలలో వరుస ఒప్పందాలపై చర్చిస్తాం' అని పోస్టులో నెతన్యాహు రాసుకొచ్చారు.

ఆ తర్వాత బెన్ గురియన్​ ఎయిర్​పోర్ట్​ ఇరు దేశాల ప్రధానులు ఒక ప్రైవేట్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మోదీని తన గ్రేట్ ఫ్రెండ్​గా నెతన్యాహు అభివర్ణించారు.ఆయనతో షేక్​హ్యాండ్ ఇస్తూ 'ఇది నిజమైన స్నేహ బంధం!' అని అన్నారు. దీనికి మోదీ సరదాగా నవ్వుతూ ఆయనకు హగ్ ఇచ్చారు.

కాగా, ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటించనున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై రెండు దేశాల బృందాలు చర్చించనున్నాయి. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా నెతన్యాహుతో చర్చలు జరుపుతానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.