ETV Bharat / international

మళ్లీ రష్యా చమురే భారత్‌కు దిక్కు అవుతుందా? అలా చేస్తే అమెరికా ఊరుకుంటుందా?

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ దేశీయ ఇంధన భద్రతపై భారత్ ఫోకస్-  మళ్లీ రష్యా చమురును కొంటుందా?

Russia On Gulf Countries
Russia President Putin (AP File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 9:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Russia On Gulf Countries : క్షిపణులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. అందులో భాగంగా హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్‌కు హర్ముజ్‌ జలసంధి మూసివేత పెను సవాల్‌గా మారింది.

ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. భారత్ రోజూ వినియోగించే 60 లక్షల బారెళ్ల చమురులో దాదాపు 27 లక్షల బారెళ్లు ఈ మార్గం నుంచే రావాలి. ఇప్పుడు ఈ దారి మూసివేయడంతో దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు భారత్ ముందున్న ఒకేదారి 'రష్యా'. భారత తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి మళ్లీ రష్యా వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరిలో అమెరికా, భారత్ మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా లేదా వెనిజువెలా నుంచి తీసుకోవాలని వాషింగ్టన్ షరతు విధించింది. ఈ నిబంధనను అంగీకరించినందుకు గాను అమెరికా భారత్‌పై విధిస్తున్న టారిఫ్​ను 50శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. హర్మూజ్ మార్గం మూతపడటంతో భారత్‌కు రష్యా చమురు తప్ప వేరే గమ్యం కనిపించడం లేదు. కానీ రష్యా నుంచి కొనుగోళ్లు పెంచితే, అమెరికా మళ్ళీ భారీ టారిఫ్‌లను విధించే అవకాశమూ లేకపోలేదు. అయినప్పటికీ, దేశీయ అవసరాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య రష్యా ఇంధనాన్ని భారత్ 'ట్రంప్' కార్డుగా వాడే అవకాశం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో 60శాతం, ఎల్‌పీజీలో మెజారిటీ భాగం ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. ఖతార్ వంటి దేశాల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌లో ఇప్పటికే గ్యాస్ కోతలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ దేశంలో ఇంధన లభ్యతపై స్పందించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

అయినప్పటికీ అంతర్గతంగా ప్రభుత్వం పలు అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్యల్లో భాగంగా వంట గ్యాస్ సరఫరాపై పరిమితులు విధించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నియంత్రణ, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు సరఫరాలో 10శాతం నుంచి 30శాతం వరకు కోత విధించారు. భారత్ వద్ద ఉన్న చమురు నిల్వలు 90 రోజుల లోపు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. ఈలోపు పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోకపోతే భారత్‌లో ఇంధన లభ్యతపై పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.

గల్ఫ్ దేశాలతో పుతిన్ మంతనాలు
ఇదిలా ఉండగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించిన తర్వాత, పుతిన్ గల్ఫ్ దేశాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీ, యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఫెసిలిటీ, ఖతార్‌లోని రాస్ లఫాన్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇది అరబ్ దేశాలలో తీవ్ర భయాందోళనలను రేపుతున్నాయి. సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో పుతిన్ చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యాకు ఇటు ఇరాన్‌తోనూ, అటు అరబ్ దేశాలతోనూ మంచి సంబంధాలు ఉండటంతో పుతిన్ మధ్యవర్తిత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తైవాన్ వంటి దేశాలు ప్రపంచానికి అవసరమైన అధునాతన సెమీకండక్టర్ చిప్‌లను సరఫరా చేస్తాయి. ఈ పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అవసరం. ఇంధన కొరత ఏర్పడితే విద్యుత్ ఉత్పత్తి తగ్గి, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ వ్యవస్థల తయారీ ఆగిపోయే ప్రమాదం ఉంది. చైనా వద్ద ఆరు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉండటం వల్ల ఆ దేశం కొంతకాలం ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదు. కానీ భారత్ వంటి దేశాలు తక్షణమే ప్రత్యమ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది.