'పాకిస్థాన్ ఇంకా కలల్లోనే విహరిస్తోంది'- దాయాది అక్కసుపై ఐరాసలో భారత్ కౌంటర్
జమ్ముకశ్మీర్‌పై ఐరాస మానవ హక్కుల మండలిలో అక్కసు వెళ్లగక్కిన పాక్- జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధిని చూడలేదంటే పాక్ కలల్లో విహరిస్తూ ఉండొచ్చని భారత్ కౌంటర్

Published : February 26, 2026 at 10:39 AM IST
India Slams Pakistan : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తగిలింది. ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కాలని చూసిన దాయాది దేశానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ గురించి ఇస్లామాబాద్ అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని మండిపడింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధి పథం పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులకు పూర్తి విరుద్ధంగా ఉందని ఎద్దేవా చేసింది. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధిని చూడలేదంటే పాక్ కలల్లో (లా లా ల్యాండ్‌లో) విహరిస్తూ ఉండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
పాక్ ఆరోపణలపై భారత్ కౌంటర్
ఫిబ్రవరి 25న ఐరాస మానవ హక్కుల మండలిలో జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధిపై పాక్, ఓఐసీ (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్) ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో దాయాది ఆరోపణలను ఐరాసలో భారత ప్రతినిధి అనుపమ సింగ్ ఖండించారు. పాక్, ఓఐసీ చేస్తున్న ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌పై పాకిస్థాన్ చేస్తున్న నిరంతర అసత్య ప్రచారం వారికి భారత్‌పై ఉన్న అసూయను తెలియజేస్తోందన్నారు.
"జమ్ముకశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగమే. భారత స్వాతంత్ర్య చట్టం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం 1947లో ఈ ప్రాంతాన్ని భారత్‌లో చేర్చారు. ఈ ప్రక్రియ పూర్తిగా చట్టబద్దంగా జరిగింది. జమ్ముకశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ఏకైక పరిష్కారం కాని వివాదం ఏంటంటే భారత భూభాగాలను అక్రమంగా పాకిస్థాన్ ఆక్రమించడమే. ఆ ఆక్రమిత ప్రాంతాలను పాక్ ఖాళీ చేయాలి. "
--అనుపమ సింగ్, ఐరాసలో భారత ప్రతినిధి
ఐఎంఎఫ్ రుణాలను ఉటంకిస్తూ పాక్‌కు కౌంటర్
అలాగే జమ్ముకశ్మీర్ అభివృద్ధి గురించి పాకిస్థాన్ చేసిన ఆరోపణలకు అనుపమ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా పేరొందిన చీనాబ్ రైలు వంతెన ప్రారంభోత్సవం సహా జమ్ముకశ్మీర్ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధిని ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధి బడ్జెట్ పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి కోరిన ఇటీవలి బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెట్టింపని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కొనసాగుతోందన్నారు.
"గతేడాది జమ్ముకశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన వంతెన చీనాబ్ రైలు వంతెనను ప్రారంభించాం. అది నకిలీది అయితే పాకిస్థాన్ ఊహల్లో బతుకుతుండాలి లేదా కలల్లో విహరిస్తూ ఉండాలి. ప్రజా ప్రభుత్వాలు అరుదుగా తమ పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసే దేశం (పాకిస్థాన్‌ను ఉద్దేశించి) నుంచి ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు తీసుకోవడం కష్టం. జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో అక్కడి ప్రజలు ఉగ్రవాదం, హింస భావజాలాన్ని తిరస్కరించారు. అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్నారు. " అని అనుపమ సింగ్ పాకిస్థాన్‌పై మండిపడ్డారు.
'టెర్రరిజంతో జమ్ముకశ్మీర్‌ను అస్థిరపరిచే కుట్ర'
ఉగ్రవాదం ద్వారా జమ్ముకశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఐరాసలో భారత ప్రతినిధి అనుపమ సింగ్ ఆరోపించారు. జమ్ముకశ్మీర్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ వేదికపై (యూఎన్ మానవ హక్కుల మండలి) భారత్ గురించి మాట్లాడడం కంటే తమ దేశంలో తీవ్రమవుతున్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంపై పాకిస్థాన్ దృష్టి పెడితే మంచిదని ఎద్దేవా చేశారు.
ఇటీవలే ఐరాస మానవ హక్కుల మండలిలో జరిగిన సమావేశంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి నవ్వులపాలైంది. మైనార్టీలను వేధించడంలో ఘన చరిత్ర ఉన్న పాక్ ఇతరులకు మానవ హక్కులపై ఉపన్యాసాలు ఇస్తోందని భారత్ మండిపడింది. పాక్ తమ దేశంలోని మైనార్టీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలని సూచించింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు.

