ఇరు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి- భారత్, చైనా కీలక నిర్ణయం
సరిహద్దు వివాదాలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకుండా చర్యలు- సైన్యాల మధ్య సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం- సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణకు రెండు కొత్త బృందాల ఏర్పాటు

Published : August 27, 2026 at 10:24 AM IST
India China Talks : సరిహద్దు వివాదాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను అస్థిరపరచకుండా ఉండేందుకు భారత్, చైనాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయడంతో పాటు సరిహద్దుల నిర్ధారణపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించాయి. ప్రత్యేక ప్రతినిధి యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం బీజింగ్‌లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల మధ్య జరిగిన 25వ విడత చర్చల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఎనిమిది అంశాలతో కూడిన 'ఫలితం, ఏకాభిప్రాయం'ను ఇరు దేశాలు విడుదల చేశాయి.
2003లో యంత్రాంగం ఏర్పాటు
భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 2003లో ప్రత్యేక ప్రతినిధి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగం ఆధ్వర్యంలో ఇప్పటివరకు పలు దఫాలుగా చర్చలు జరిగాయి. బుధవారం విడుదల చేసిన ఎనిమిది అంశాల ఫలితంలో సరిహద్దు నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా సరిహద్దుల నిర్ధారణపై ఒక నిపుణుల బృందాన్ని, సరిహద్దు నిర్వహణపై ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. సరిహద్దుల నిర్ధారణ, సరిహద్దు నిర్వహణ అంశాల్లో త్వరితగతిన, గణనీయమైన ఫలితాలు సాధించేలా ఈ బృందాలు చర్చలను ముందుకు తీసుకెళ్లనున్నాయి.
కార్యవిధానంపై తొలుత అంగీకారం
ఈ రెండు బృందాలు భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కార్యనిర్వహణ యంత్రాంగం ఆధ్వర్యంలో పనిచేస్తాయి. తొలుత ఈ బృందాల విధివిధానాలు, బాధ్యతలు, పరిధికి సంబంధించిన 'టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్'పై ఇరు పక్షాలు అంగీకారానికి రావాల్సి ఉంటుంది. సరిహద్దుల నిర్ధరణలో వేగంగా ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి గత ఏడాదే ఇరు దేశాలు అంగీకరించాయి. తాజాగా సరిహద్దు నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
హాట్‌లైన్ ఛానెళ్ల విస్తరణ
సరిహద్దు వద్ద ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించేందుకు సైనిక కమాండర్ల మధ్య ప్రత్యక్ష సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. తూర్పు, మధ్య సెక్టార్లలో ఇప్పటికే ఉన్న సమావేశ కేంద్రాలకు అదనంగా మరో రెండు సమావేశ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే సరిహద్దు సైనిక హాట్‌లైన్ కోసం మరో రెండు ఛానెళ్లను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. మధ్య సెక్టార్ పరిధిలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మధ్య చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. తూర్పు సెక్టార్‌లో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులు ఉన్నాయి.
గాల్వాన్ తర్వాత సంబంధాలపై దృష్టి
2020లో గల్వాన్ ఘటన తర్వాత భారత్- చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సరిహద్దు వద్ద తలెత్తిన సమస్యలు ఇరు దేశాల మొత్తం సంబంధాలను ప్రభావితం చేశాయి. తాజాగా జరిగిన చర్చలు మాత్రం భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా దెబ్బతీయకుండా నిరోధించేందుకు ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు ఆరంభంలో దిల్లీలో జరిగిన భారత్- చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన 36వ కార్యనిర్వహణ యంత్రాంగం సమావేశంలోనూ ఇదే అంశాలపై చర్చించారు. సరిహద్దు సమస్యలతో పాటు, అక్కడ తలెత్తే అపార్థాలు ఇరు దేశాల సంబంధాల్లో పెద్ద సమస్యగా మారకుండా నిరోధించే మార్గాలపై చర్చలు జరిగాయి.
సరిహద్దు వాణిజ్యంపై సహకారం
భారత్, చైనా సంబంధాలను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత నాథూ లా, షిప్కి లా మార్గాల ద్వారా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమైంది. అయితే టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తున్న అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎనిమిది అంశాల ఏకాభిప్రాయంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో సంభాషణ, శాంతి, సంప్రదింపులు, సహకారంతో కూడిన వాతావరణాన్ని సృష్టించేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సరిహద్దు వాణిజ్యం, తీర్థయాత్రలు, ఇతర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకరించాయి.
కైలాష్-మానసరోవర్ యాత్రపై ప్రశంసలు
చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో జరిగే భారత అధికారిక కైలాష్-మానసరోవర్ యాత్రకు మరిన్ని బృందాలను అనుమతించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత పక్షం ప్రశంసించింది. సరిహద్దు నదులకు సంబంధించిన అంశాలపైనా ఇరు దేశాలు చర్చించాయి. భారత్-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జలసంబంధ డేటా పంచుకోవడం, సంబంధిత అవగాహన ఒప్పందాల (ఎంవోయూలు) పునరుద్ధరణ వంటి అంశాలపై సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.
ప్రపంచ అనిశ్చితి మధ్య సంబంధాల స్థిరీకరణ
ఇరాన్, ఉక్రెయిన్‌లలో కొనసాగుతున్న సంఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ భారత్, చైనాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల మధ్య తాజా సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేపాల్‌లో జలప్రళయం: 162కు చేరిన మృతులు- భారత్ చేయూత
ఖమేనీ చనిపోలేదు- కానీ తీవ్రంగా గాయపడ్డాడు: ఇరాన్ సుప్రీంలీడర్పై ట్రంప్ కామెంట్స్

