త్వరలోనే భారత్ - ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం- అణు ఇంధనం, అంతరిక్ష విభాగాల్లోనూ కలిసి పనిచేస్తాం: మోదీ
ఇజ్రాయెల్‌తో కలిసి విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను క్రియేట్ చేస్తాం- ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ ఇరుదేశాల భాగస్వామ్యం ఇజ్రాయెల్‌లోనూ భారత యూపీఐ వినియోగంలోకి- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ద్వైపాక్షిక భేటీ

Published : February 26, 2026 at 4:56 PM IST
India Israel FTA : భారత్ - ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) త్వరలోనే తుదిరూపును తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ డీల్ ఇరుదేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌లో భారతదేశ యూపీఐను వినియోగంలోకి తేవడంపైనా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. పౌర అణు ఇంధనం, అంతరిక్ష విభాగాల్లోనూ భారత్, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తాయన్నారు. గురువారం మధ్యాహ్నం జెరూసలెంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పై వివరాలను మోదీ ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి టెక్నాలజీలలో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. భవిష్యత్ వ్యవసాయ అవసరాలను తీర్చగల కొత్త టెక్నాలజీలనూ సంయుక్తంగా అభివృద్ధి చేస్తామని ప్రధాని చెప్పారు. భారత్, ఇజ్రాయెల్‌లలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను క్రియేట్ చేయడంపైనా ఫోకస్ పెడతామన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగంలోనూ ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. రక్షణ రంగంలో గత సంవత్సరం ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) సరికొత్త దిశను చూపిస్తుందనే ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు.
#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," we will soon give final shape to a mutually beneficial free trade agreement." pic.twitter.com/Xm42vsLpsu
— ANI (@ANI) February 26, 2026
140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమిది
"భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలు అత్యంత క్లిష్టమైన కాల పరీక్షల్లోనూ నెగ్గాయి. దీన్ని మేం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నాం. ఇరుదేశాల సంబంధాలకు కొత్త దిశను చూపడం, కొత్త వేగాన్ని అందించడంపైనే నేను, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ చర్చించాం. నాకు ప్రతిష్ఠాత్మక స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్‌ను ప్రదానం చేసినందుకు ఇజ్రాయెల్ ప్రధానికి ధన్యవాదాలు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. భారత్, ఇజ్రాయెల్ బలమైన స్నేహబంధానికి ప్రతీక. బలమైన విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు అనే పునాదులపై ఇరుదేశాల సంబంధం నిలిచి ఉంది" అని భారత ప్రధాని మోదీ తెలిపారు.
ఐఎంఈసీ, ఐ2యూ2లలోనూ ముందుకుసాగుతాం
"గాజా శాంతి ప్రణాళిక ద్వారా పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు బాటలు పడ్డాయి. ఈ ప్రయత్నాలకు భారత్ బలమైన మద్దతును అందించింది. ఇకపైనా మా మద్దతును అందిస్తాం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని శాంతి, సుస్థిరతలకు నేరుగా భారతదేశ భద్రతా ప్రయోజనాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. సైనిక సంఘర్షణలలో మానవత్వం అనేది అస్సలు బాధితం కాకూడదు. గ్లోబల్ సౌత్‌తో పాటు యావత్ మానవాళి కోరుకుంటున్నది ఇదే. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు అనేది భారత్, ఇజ్రాయెల్‌ల స్పష్టమైన విధానం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంగీకరించేది లేదు. ఉగ్రవాదంపై, దానికి మద్దతు తెలిపే వారిపై మా పోరాటం కొనసాగుతుంది. ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరోప్ ఎకనామిక్ కారిడార్(ఐఎంఈసీ), ఇండియా - ఇజ్రాయెల్ - యూఏఈ - అమెరికాలతో కూడిన ఐ2యూ2 కూటమి విషయంలోనూ మేం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ప్రాంతీయ స్థాయిలో అన్ని దేశాలు అనుసంధానం కావడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవి" అని ప్రధాని మోదీ చెప్పారు.
ఇరుదేశాల మంత్రుల స్థాయిలో సంప్రదింపులు : నెతన్యాహూ
ప్రతిభావంతులైన నిపుణులను కలిగిన భారత్, ఇజ్రాయెల్ కలిసికట్టుగా ముందుకు సాగితేే అద్భుతాలు చేయగలవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇకపై కూడా భారతీయులు, ఇజ్రాయెలీల మనసులు, మేధస్సులు ఏకమై పనిచేస్తాయని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై త్వరలోనే ఇరుదేశాల మంత్రుల స్థాయిలో సంప్రదింపులు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," we have taken a historic decision to give our time-tested relationship the status of special strategic partnership. this is a reflection of the aspirations of both the… pic.twitter.com/jkBeTYWB35
— ANI (@ANI) February 26, 2026
భారత్ -ఇజ్రాయెల్ ఒప్పందాలతో యువత, వ్యాపారులకు కొత్త అవకాశాలు : కేంద్రం
భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల ఇరుదేశాల యువత, వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ప్రత్యేకించి స్టార్టప్‌లు, టెక్నాలజీ, సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొత్తకొత్త అవకాశాలు ఏర్పడుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో భారత్, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. శాంతి, ఆవిష్కరణలు, వికాసం కోసం ఇరుదేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయని విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. టెక్, కొత్త ఆవిష్కరణల విభాగంలో దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాని మోదీ విజన్‌కు ఊతం ఇచ్చేలా భారత్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదిరాయన్నారు. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇవి దోహదం చేస్తాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, హారిజాన్ స్కానింగ్ మెకానిజంలలోనూ భారత్‌కు ఇజ్రాయెల్ సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.
వాణిజ్య ఒప్పందంపై చర్చలు : భారత్‌లో ఇజ్రాయెల్ ప్రతినిధులు
"2024 సెప్టెంబరులో భారత్, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై తొలి విడత సంప్రదింపులు జరిపేందుకు తాజాగా గురువారం రోజు ఇజ్రాయెల్ ప్రతినిధుల టీమ్ భారత్‌కు వచ్చింది. ఇప్పుడు ఇరుదేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకోసం ద్వైపాక్షిక ఆర్థిక సంప్రదింపులను జరపాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. గత కొన్నేళ్లలో దాదాపు 42వేల మంది భారతీయ నిపుణులు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. వాణిజ్య, సేవ, తయారీ, రెస్టారెంట్ విభాగాల్లో మానవ వనరుల నియామకంతో ముడిపడిన మార్గదర్శకాలపై ఇవాళ భారత్, ఇజ్రాయెల్ సంతకాలు చేశాయి. దీనివల్ల ఇజ్రాయెల్‌లోని ఆయా విభాగాల్లో భారతీయులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. రాబోయే ఐదేళ్లలో ఈ విభాగాల్లో మరో 50వేల మంది భారతీయులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి" అని విక్రమ్ మిస్రి వివరించారు.
100కు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్‌లు
"భారత్ - ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా - ఇజ్రాయెల్ జాయింట్ రీసెర్చ్ కాల్స్‌లను బలోపేతం చేయాలనే నిర్ణయం ప్రధాని పర్యటనలో జరిగింది. ప్రత్యేకించి ఇండియా - ఇజ్రాయెల్ జాయింట్ రీసెర్చ్ కాల్స్ కోసం ఇరుదేశాల వైపు నుంచి కేటాయించే బడ్జెట్‌ను రూ.13.63 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఇరుదేశాల యూనివర్సిటీలు సంయుక్తంగా రీసెర్చ్ వర్క్‌లు చేయగలుగుతాయి. భారత్ - ఇజ్రాయెల్ అకడమిక్ కోఆపరేషన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని మోదీ, నెతన్యాహూ నిర్ణయించారు. రీసెర్చ్, పాలసీ, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఇది పనిచేస్తుంది. ఇజ్రాయెల్ సహకారంతో 43 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్‌లను భారత్‌లో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల సంఖ్యను 100కు పెంచాలని ఇప్పుడు డిసైడ్ చేశారు. దీనిపై ఒక ఎంఓయూ కుదిరింది. ఇందులో భాగంగా ఇండియా - ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తారు. ఇజ్రాయెల్‌లోని వోల్కానీ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లోని భారత పరిశోధకులకు సంయుక్త ఫెల్లోషిప్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించారు" అని విక్రమ్ మిస్రి పేర్కొన్నారు.
ఎన్‌పీసీఐ, మాషావ్ సహకారం
"భారత్‌కు చెందిన ఎన్‌పీసీఐ, ఇజ్రాయెల్‌కు చెందిన మాషావ్ డిజిటల్ పేమెంట్స్‌ల మధ్య సహకారాన్ని పెంచాలనే దానిపైనా ఎంఓయూ కుదిరింది. ఇరుదేశాల మధ్య జరిగే లావాదేవీల వ్యవహారంలో పరస్పర సహకారాన్ని అందించుకోవాలని ఎన్‌పీసీఐ, మాషావ్ నిర్ణయించాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు జరిగే లావాదేవీల కోసం యూపీఐను అనుమతించే అంశంపైనా ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయి. పరస్పర వాణిజ్యం, టూరిజాన్ని పెంచుకోవాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి" అని విక్రమ్ మిస్రి తెలిపారు.
భారత్ - ఇజ్రాయెల్ కీలకమైన ఎంఓయూలు
- గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడంలో భారత్‌కు ఇజ్రాయెల్ సహకారాన్ని అందించనుంది. దీనిపై ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
- భూభౌతిక అన్వేషణల విభాగంలో భారత్‌కు టెక్నాలజీ పరమైన సహకారాన్ని అందించే విషయంపై ఇరుదేశాల మధ్యం ఎంఓయూ కుదిరింది.
- ఫిషరీస్, ఆక్వా కల్చర్ విభాగాల్లో కలిసి పనిచేసే అంశంపైనా ఎంఓయూ కుదిరింది.
- హారిజాన్ స్కానింగ్ విభాగంలో ఇరుదేశాల మధ్య డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ కుదిరింది. ఇందులో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీలపై భారత్, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఫోకస్ పెడతాయి.

