ప్రపంచానికి మేలుచేసే గొప్ప శక్తులుగా భారత్, ఇజ్రాయెల్: ప్రధాని మోదీ
భారత్ - ఇజ్రాయెల్ బంధానికి అంతర్జాతీయ ప్రాధాన్యత- జెరూసలెంలో భారత ప్రధాని మోదీ- ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో భేటీ- భారత పర్యటనకు రావాలని ఆహ్వానం

Published : February 26, 2026 at 3:36 PM IST
Modi About India Israel Force : ప్రపంచానికి మేలుచేసే గొప్ప శక్తులుగా భారత్, ఇజ్రాయెల్ వెలుగొందుతున్నాయని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చాలా విభాగాల్లో ఇరుదేశాలు బలంగా, కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్, ఇజ్రాయెల్‌ల ద్వైపాక్షిక భాగస్వామ్యం, సహకారం ఫలాలు యావత్ ప్రపంచానికి అందుతున్నాయని చెప్పారు. గురువారం రోజు జెరూసలెంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో భేటీ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా ఇరుదేశాల సంబంధాలు బలోపేతం అవుతున్నాయని, యావత్ ప్రపంచంలో ఈ బంధానికి సముచిత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. సైన్స్, ఆవిష్కరణలు, ఉన్నత విద్యాసంస్థలు వంటి విభాగాల్లో ఇజ్రాయెల్‌కు అద్భుత నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రత్యేకించి జల వనరుల సమర్ధ నిర్వహణ, వ్యవసాయ సాంకేతికత వంటి విభాగాల్లో ఇజ్రాయెలీ టెక్నాలజీని, పద్ధతులను భారత్ పాటిస్తోందన్నారు. వాటి వల్ల అమోఘమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. విజయవంతమైన ఇజ్రాయెలీ టెక్నాలజీని, విధానాలను ఇకపైనా భారత్‌లో వినియోగిస్తామన్నారు.
భారత్‌ను సందర్శించండి!
గతంలో ఇసాక్ హెర్జోగ్‌ను తాను కలిసిన సందర్భాలను భారత ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్‌పై పూర్తి స్పష్టత ఉన్నందుకు, తమ దేశంపై గౌరవభావాన్ని చూపుతున్నందుకు ఇసాక్ హెర్జోగ్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత పర్యటనకు రావాలని ఇసాక్ హెర్జోగ్‌ను ప్రధాని ఆహ్వానించారు. స్వాగతం పలికేందుకు భారత ప్రజలు ఆతురతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈసారి భారత పర్యటనకు వస్తే, దిల్లీతో పాటు ఇతర నగరాలనూ సందర్శించాలని కోరారు. తద్వారా భారతదేశ వైవిధ్యంపై అవగాహన వస్తుందన్నారు.
#WATCH | Jerusalem, Israel: Prime Minister Narendra Modi holds a bilateral meeting with the President of Israel, Isaac Herzog President of Israel.
— ANI (@ANI) February 26, 2026
PM Modi says, " i see that the way my delegation and i have been welcomed in israel since yesterday is a reflection of the deep… pic.twitter.com/5jR24bfEx6
పశ్చిమాసియా ఉజ్వల భవిష్యత్తు కోసం
పశ్చిమాసియా ప్రాంత ఉజ్వల భవిష్యత్తులో భారత్ కీలకమైన భాగమని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ అన్నారు. ఇక ఇదే సమయంలో భారతదేశ ఉజ్వల భవిష్యత్తులోనూ ఇజ్రాయెల్ ముఖ్యమైన భాగమని ఆయన చెప్పారు. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వికాసం వైపు ఇప్పుడు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందన్నారు. ఇజ్రాయెల్ చరిత్రపై, దాని నేపథ్యంపై సానుకూల వైఖరిని కలిగిన భారత్ పశ్చిమాసియా ప్రాంత భవిష్యత్తులో కీలక పాత్రను పోషించగలదని ఇసాక్ హెర్జోగ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో చాలా రంగాల్లో భారత్ అగ్రగామిగా రాణిస్తోందని, అంతటి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియాలతో కూడిన తూర్పు అర్ధగోళం (ఈస్టెర్న్ హెమిస్పియర్) ప్రాంతంలో వాణిజ్యానికి కేంద్ర బిందువుగా భారత్ ఉందని ఇసాక్ హెర్జోగ్ తెలిపారు. భారత్ - పశ్చిమాసియా - ఐరోపా వాణిజ్య కారిడార్‌లో కేంద్ర బిందువుగా ఇజ్రాయెల్ ఉందన్నారు. భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి పనిచేస్తే గ్లోబల్ సౌత్ సంక్షేమానికీ ఊతం లభిస్తుందన్నారు.
భారతీయ యువతను ప్రోత్సహించాలి
"భారత్, ఇజ్రాయెల్‌లలోని కాలేజీలు, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు కలిసికట్టుగా పనిచేయొచ్చు. దీనివల్ల ఇరుదేశాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇరుదేశాల విద్యాసంస్థల మధ్య విద్యార్థుల బదిలీ కొనసాగాలి. ఇజ్రాయెల్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు రావచ్చు. ఇజ్రాయెలీ విద్యార్థులు భారత్‌కు వెళ్లి చదవొచ్చు. ప్రతిభ కలిగిన భారతీయ యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు నిపుణులైన యువతరానికి ప్రపంచవ్యాప్తంగా చాలా అవకాశాలు ఉన్నాయి" అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ పేర్కొన్నారు.
కొత్త ఆవిష్కరణలు, విద్యార్థుల బదిలీపై సమీక్ష
ఈసమావేశం సందర్భంగా కొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, జలవనరుల పరిరక్షణ, వ్యవసాయ సాంకేతికత, ఉన్నత విద్యాసంస్థల నడుమ విద్యార్థుల బదిలీ వంటి విభాగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించే అంశంపై మోదీ, ఇసాక్ హెర్జోగ్ సమీక్షించారు. వ్యూహాత్మక, ఆర్థిక సహకారంతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపైనా మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.
యాద్ వాషెంను సందర్శించిన మోదీ
అంతకుముందు జెరూసలెంలోని యాద్ వాషెం మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు. 60 లక్షల మంది యూదులను జర్మన్ నాజీలు సంహరించిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మ్యూజియాన్ని 1953లో నిర్మించారు. నాజీల చేతిలో ప్రాణాలు కోల్పోయిన యూదులకు మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడి కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాని మోదీకి ప్రెసిడెంట్ ఇసాక్ హెర్జోగ్ ఘన స్వాగతం పలికారు. వారిద్దరూ కలిసి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇరువురు నేతల ద్వైపాక్షిక భేటీ జరిగింది.

