ETV Bharat / international

మేం దాడి చేయకపోతే ఇరాన్ మాపై చేసేది: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడిని సమర్ధించుకున్న డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ తమపై దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న ముందస్తు సమాచారం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Trump On Iran War
US president Donald Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 7:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On Iran War : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఒకవేళ ఈ ముందస్తు దాడులు చేయకపోయి ఉంటే, ఇరాన్ తమపై దాడులు చేసేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్ మొదట దాడి చేయాలని అనుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అందుకే తాము ముందే స్పందించామన్నారు. ఓవల్ ఆఫీస్‌లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భేటీ అయిన ట్రంప్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ, తమపై దాడి చేయాలని చూసిందని అర్థమైందని ట్రంప్ అన్నారు. అందుకే ఇజ్రాయెల్ కంటే ముందే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు చాలా కాలంగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని సిద్ధంగా ఉన్నాయని, వారికి అణు బాంబు తయారు చేయడానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉందని ఆయన వెల్లడించారు. తాము సరైన సమయంలో స్పందించడం వల్ల ఒక పెద్ద విపత్తు తప్పిందన్నారు. అమెరికా- ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయకుంటే మరో నెల రోజుల్లో ఇరాన్ వద్ద శక్తివంతమైన అణు ఆయుధం ఉండేదని ట్రంప్ వెల్లడించారు. చర్చలు సాగుతున్న తీరును బట్టి చూస్తే, ఇరాన్ ముందుగా దాడికి దిగుతుందని భావించినట్లు తెలిపారు. అలా జరగడం తనకు ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఇజ్రాయెల్​కు చెప్పినట్లు తెలిపారు.

ఇరాన్ పాలకులు మానసిక రోగులు : ట్రంప్
ఇరాన్ పాలకులను మానసిక రోగులుగా ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం పనిచేయడం లేదని, వారి సిద్ధాంతమే ప్రపంచాన్ని నాశనం చేయడమని ట్రంప్ ఆరోపించారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని, వేల సంఖ్యలో అమాయకులను చంపిందని ఆయన విమర్శించారు. ఒకవేళ ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉంటే, వారు ఎప్పుడో దాన్ని ఉపయోగించి ఉండేవారని, అది అనేక దేశాల మనుగడకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. 'బరాక్ హుస్సేన్ ఒబామా చేసిన ఆ ఒప్పందం అత్యంత దారుణమైనది. ఆ ఒప్పందం ద్వారా మధ్యప్రాచ్యంలో ఇరాన్‌కు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు. ఒకవేళ నేను ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోతే, మూడేళ్ల క్రితమే ఇరాన్ అణుబాంబుతో సిద్ధంగా ఉండేది' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ పోరాటంలో అండగా జర్మనీ
జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ను ట్రంప్ తన ఆప్తమిత్రుడిగా కొనిడాయారు. ఇరాన్‌తో జరిగే పోరాటంలో జర్మనీ తమకు అండగా ఉందని కొనియాడారు. స్పెయిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ దేశంతో ఉన్న అన్ని రకాల వ్యాపార, దౌత్య సంబంధాలను తెంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అమెరికాకు మిత్రదేశంగా ఉన్న బ్రిటన్ తీరు పట్ల కూడా తాను అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

గత నాలుగు రోజులుగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. అలాగే, పశ్చిమాసియాలోని అమెరికా బేస్‌లపై ఇరాన్ సైతం విరుచుకుపడతోంది. ఫిబ్రవరి 28న అమెరికా నేతృత్వంలో జరిగిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్', 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దాడులు ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు, కీలక సైనిక అధికారులు మరణించారు. దీనికి ప్రతికారంగా ఇరాన్ సైన్యం బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.